అభివృద్ధికి నోచుకోని గ్రంథాలయాలు
పట్టిపీడిస్తున్న సమస్యలు
నెల్లూరు(దర్గామిట్ట) : ఎందరో విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్‌ను నిర్ణయించే గ్రంథాలయాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. వీటిని నిధులు, వసతుల లేమి.. సిబ్బంది కొరత, వసూలు కాని సెస్సు తదితర సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. ప్రతి గ్రంథాలయాన్ని కంప్యూటరైజ్ చేస్తామన్న ప్రభుత్వ హామీ మాటలకే పరిమితమైంది. జిల్లాలో మొత్తం 61 లైబ్రరీలు ఉండగా.. వాటిలో ప్రభుత్వ భవనాల్లో 21, అద్దె భవనాల్లో 4, ఉచిత భవనాల్లో 36 ఉన్నాయి. వీటిలో చాలా వరకు భవనాలను రిపేరు చేయవలసిన అవసరమున్నది.
చాలీ చాలని సిబ్బంది
జిల్లాలోని అన్ని గ్రంథాలయల్లో 64 మంది సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. ఒకే గ్రంథాలయ అధికారి రెండు,మూడు చోట్ల ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తుండంతో సరైన దృష్టి సారించలేకపోతున్నారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది 8 మందిని నియమించామని.. వారిలోముగ్గురు లైబ్రేరియన్లు, ఒక రికార్డ్ అసిస్టెంట్, నలుగురు లైబ్రరీ హెల్పర్‌లు అని గ్రంథాలయ సంస్థ ఇన్‌చార్జి సెక్రటరీ ఎస్.సునీత తెలిపారు. జిల్లాలో పది లైబ్రరీలకు దాతల సహాయంతో మరమ్మతులు జరుగుతున్నాయని, మైపాడులో ఇటీవల ఓ దాత 2.50 లక్షలతో లైబ్రరీని అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
వేళలు పాటించని సిబ్బంది
జిల్లాలోని ప్రతి గ్రంథాలయం ఉదయం 8 గంటల నుంచి 11గంటల వరకు, మద్యాహ్నం 4 నుంచి 7 గంటల వరకు తీయవలసి ఉండగా.. సిబ్బంది ఉదయం 10 గంటలకు వస్తున్నారని పాఠకులు ఆరోపిస్తున్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థులకు ఉపయోగపడేలా సరైన వేళలకు గ్రంథాలయాలను తెరవాలని కోరుతున్నారు.
వసూలు కాని గ్రంథాలయ పన్ను(సెస్)
జిల్లా వ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీ ల్లో దాదాపు 8కోట్ల మేర సెస్ వసూలు కావలసి ఉంది. ఒక్క కావలిలోనే రూ.18 లక్షలు వసూలైనట్లు సమాచారం. సెస్ వసూలు చేస్తే తప్ప గ్రంథాలయాల నిర్వహణ కష్టంగానే ఉంటుంది.అయితే గ్రంథాలయాలకు కట్టవలసిన సెస్ ముని సిపాలిటీల సొంత అవసరాలకు వాడుకొంటున్నట్లు సమాచా రం. కాగా, వచ్చే మార్చి నాటికి దాదాపు 4 కోట్ల రూపాయల సెస్ వసూలు చేస్తామని ఇన్‌చార్జి సెక్రటరీ సునీత తెలిపారు.
వసతులు సరిగా లేని కేంద్ర గ్రంథాలయం
నెల్లూరులోని రేబాలవారి వీధిలో ఉన్న కేంద్ర గ్రంథాలయంలో వసతులు అంతంత మాత్రంగా ఉన్నాయి మహిళలు లైబ్ర రీకి వస్తే టాయిలెట్ సౌకర్యం లేదు. రాత్రి సమయాల్లో లైటిం గ్ సౌకర్యం తక్కువగా ఉండడం వల్ల చదువుకొనుటకు ఇబ్బం ది పడుతున్నామని పాఠకులు చెబుతున్నారు. గ్రూప్స్‌కు ప్రిపేరయ్యే నిరుద్యోగులకు ఏ పుస్తకాలు ఎక్కడ ఉంటాయో తెలియని పరిస్థితి. మూడు కంపూటర్లు మాత్రమే ఉన్నాయి. పుస్తకాలకు సరైన బార్ కోడింగ్ లేదు. జిల్లా గ్రంథాలయాల్లో అవగాహనా సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా ఎక్కడా జరిగినట్లు సమాచారం లేదు.
ప్రత్యేక రూం కావాలి
కేంద్ర గ్రంథాలయంలో రీడింగ్ రూంను ఉచిత కోచింగ్ సెంటర్‌కు ఇవ్వడంతో పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగులు చెట్ల కింద చదుకోవలసి వస్తోంది. ముందు భాగం పేపర్ విభాగానికి కేటాయించడంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నాం. నిరుద్యోగులకు ప్రత్యేక రీడింగ్ రూం ఏర్పాటు చేయాలి.
– కే.రమేష్
వసతులు కల్పించాలి
కేంద్ర గ్రంథాలయంలో వెనుక పక్క చెత్తా చెదారం చేరి దుర్గంధభరితంగా ఉందని, ఆ ప్రాంతంలో చెట్ల కింద చదువుకోలేకున్నామని ప్రభాకర్ తెలిపారు. కార్పొరేషన్ అధికారులు వెనుక భాగాన్ని శుభ్రపరచి టాయిలెట్ వసతులు కల్పించాలన్నారు.
– పి.ప్రభాకర్