సాక్షి, అమరావతి: విద్యారంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలతో ఉన్నత విద్యలో గరిష్ట స్థాయిలో చేరికలు నమోదవుతున్నాయి. జాతీయస్థాయికి మించి చేరికలు ఉండటం గమనార్హం. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసినా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యాసంస్థల్లో చేరికల నిష్పత్తి అధికంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఆలిండియా సర్వే హయ్యర్ ఎడ్యుకేషన్ 2019–20 గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. ఉన్నత విద్యలో జాతీయ స్థాయిలో గరిష్ట చేరికల నిష్పత్తి 201819లో 26.3 కాగా 201920లో 27.1కు పెరిగింది. ఇదే సమయంలో ఏపీలో నిష్పత్తి 32.4 నుంచి 35.2కు చేరింది. గరిష్ట చేరికల్లో పెరుగుదల జాతీయ స్థాయిలో 3.04 శాతం ఉండగా ఏపీలో 8.6 శాతానికి పెరగడం గమనార్హం. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో జీఈఆర్ పెరుగుదల 5 శాతం మాత్రమే ఉంది.
విద్యార్థినులే అధికం..
ఈ రెండేళ్లలో రాష్ట్రంలో ఉన్నత విద్యారంగంలో గరిష్ట చేరికల నిష్పత్తిని పరిశీలిస్తే విద్యార్థినులే ముందంజలో ఉన్నారు. విద్యార్థుల గరిష్ట చేరికల నిష్పత్తి 38.3 నుంచి 35.8కు పెరిగింది. విద్యార్థుల చేరికల నిష్పత్తి ప్రకారం జాతీయస్థాయిలో పెరుగుదల 2.28 శాతం కాగా ఏపీలో 7 శాతం మేర పెరుగుదల నమోదైంది. ఇక విద్యార్థినుల చేరికల నిష్పత్తి ఏపీలో 29.0 నుంచి 32.2కు పెరిగింది. ఏపీలో వారి చేరికల్లో పెరుగుదల 11.03 శాతం కాగా జాతీయస్థాయిలో 2.28 శాతం మాత్రమే కావడం గమనార్హం. జాతీయస్థాయికి మించి ఉండటంతోపాటు ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థినుల చేరికలు ఎక్కువగా ఉన్నట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో విద్యార్థుల చేరికల్లో పెరుగుదల శాతం 4 శాతం లోపు, విద్యార్థినుల్లో 6 శాతం లోపే ఉన్నాయి.
ఎస్సీ, ఎస్టీల్లోనూ మనమే ముందంజ
ఉన్నత విద్యలో ఎస్సీ, ఎస్టీ విద్యార్ధుల చేరికల్లోనూ ఆంధ్రప్రదేశ్‌లో జాతీయస్థాయికి మించి నిష్పత్తి నమోదైంది. ఎస్సీల్లో 28.9 నుంచి 31.2కు, ఎస్టీల్లో 26.4 నుంచి 29.4కు జీఈఆర్ పెరిగింది. ఎస్సీ విద్యార్ధుల చేరికల్లో పెరుగుదల 7.5 శాతంగా ఉండగా ఎస్టీ విద్యార్ధుల చేరికలు 9.5 శాతానికి పెరగడం విశేషం. ఈ కేటగిరీల్లో జాతీయస్థాయి జీఈఆర్ గణాంకాలతో పోలిస్తే రాష్ట్రం చాలా ముందంజలో ఉంది. జాతీయస్థాయిలో ఉన్నత విద్యలో చేరికలు ఎస్సీలలో 1.5 శాతం, ఎస్టీలలో 4.5 శాతం మాత్రమే ఉన్నాయి. తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఈ కేటగిరీ విద్యార్ధుల చేరికల నిష్పత్తిని పరిశీలిస్తే జాతీయ స్థాయికన్నా తక్కువగా ఉంది.
మరింత పెరిగే అవకాశం...
కరోనా కారణంగా 2020 21 గణాంకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. అవి కూడా విడుదలైతే రాష్ట్రంలో ఉన్నత విద్యారంగంలో చేరికల నిష్పత్తి మరింత పెరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉన్నత విద్యనభ్యసించే వారికి వసతి భోజన ఖర్చుల కోసం ఏటా రూ.20 వేల వరకు ఆర్థిక సాయంతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుండడంతో చేరికల శాతం ఏటా గణనీయంగా పెరుగుతోంది. ఐదేళ్లలో ఉన్నత విద్యారంగంలో చేరికల గరిష్ట నిష్పత్తి 50 శాతానికి చేరాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఏపీలో సంక్షేమ కార్యక్రమాల ఫలితంగా అంతకన్నా ఎన్నో రెట్లు పెరగనుంది. 2024 నాటికి రాష్ట్రంలో 70 శాతానికి చేరాలని, 2035 నాటికి 90 శాతానికి పైగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యాన్ని నిర్దేశించారు.
Comments
Please login to add a commentAdd a comment