గ్రంథాలయాల్లో మరిన్ని పోటీపరీక్షల పుస్తకాలు
Published Wed, Oct 19 2016 2:23 AM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యార్థులు, నిరుద్యోగులకు ఉపయుక్తంగా మరిన్ని పోటీ పరీక్షల పుస్తకాలను జిల్లా కేంద్ర గ్రంథాలయంలో అందుబాటులో ఉంచామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జయ్యవరపు శ్రీరామ్మూర్తి అన్నారు. స్థానిక జిల్లా శాఖా గ్రంథాలయంలో మంగళవారం పోలీస్ కానిస్టేబుల్స్ ఉచిత శిక్షణ తరగతులు ముగింపు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సహకారంతో పోటీ పరీక్షలకు యువతకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం పోలీస్ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు సుమారు 110 మందికి శిక్షణ పూర్తిచేశామని చెప్పారు. 50 రోజులపాటు ఉచిత శిక్షణ అందించడం అభినందనీయమని ఏలూరు, లింగపాలెం తహసీల్దార్లు కేవీ చంద్రశేఖరరావు, బి.సోమశేఖర్ అన్నారు. గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సీహెచ్ మాదారు, కో–ఆర్డినేటర్లు డాక్టర్ గిరిబాబు, జె.రమేష్, ఎల్.వెంకటేశ్వరరావు, శిక్షణ ఉపాధ్యాయులు టి.విజయకుమార్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement