హుజూర్‌నగర్, న్యూస్‌లైన్
జిల్లాలో గ్రంథాలయాల మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి దాపురించింది. గ్రంథాలయ సంస్థకు ప్రధాన ఆదాయమైన సెస్‌లు సకాలంలో సంస్థకు జమకాకపోవడంతో గ్రంథాలయాల నిర్వహణ భారంగా మారింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీ రూల్స్1961 చట్టం ప్రకారం ప్రతి గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలలో వసూలయ్యే పన్నుల నుంచి సెస్ రూపంలో గ్రంథాలయ సంస్థకు చెల్లించాలి. అయితే ఈ విధానం ప్రకారం ప్రతి 100 రూపాయలకు ఎనిమిది రూపాయల సెస్‌ను చెల్లించాల్సి ఉంది. జిల్లాలోని 1169 గ్రామపంచాయతీలు, ఎనిమిది మున్సిపాలిటీల పరిధిలో ఎక్కడా ప్రతి సంవత్సరం సకాలంలో సెస్‌లను జమ చేయడం లేదు. అయితే, మూడేళ్లుగా జిల్లాలో సుమారు 2 కోట్ల 54 లక్షల రూపాయల బకాయి గ్రంథాలయ సంస్థకు చెల్లించాల్సి ఉంది. దీంతో జిల్లాలోని 40 గ్రంథాలయాల్లో పుస్తకాల కొనుగోలు, మౌలిక వసతుల ఏర్పాటు, ఫర్నిచర్ కొనుగోలు, భవనాల మరమ్మతుల వంటి పనులు చేపట్టలేని పరిస్థితుల్లో గ్రంథాలయ సంస్థ కొట్టుమిట్టాడుతుంది.
ప్రభుత్వం గ్రంథాలయాల ఉద్యోగులకు మాత్రమే వేతనాలు చెల్లిస్తూ ఇతర నిర్వహణకు నిధులు విడుదల చేయడం లేదు. నిధులు విడుదల చేయకపోవడానికి సెస్‌ల రూపంలో వచ్చే నిధులే ప్రధాన ఆదాయంగా ఉండడమే ప్రధాన కారణం. అంతేగాక జిల్లాలో 50 బుక్ డిపాజిట్ సెంటర్లను నిర్వహిస్తుండడంతో ప్రతి సెంటర్‌కు *1000 చొప్పున నెలకు రూ.50వేలు చెల్లించాల్సి రావడం, ప్రభుత్వ నూతన నిబంధనల ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో బుక్ డిపాజిట్ కేంద్రాల ఏర్పాటుకు ఇటీవల పుస్తకాల కొనుగోలు చేయాల్సి రావడంతో తీవ్ర ఆర్థిక భారంతో సంస్థ కొట్టుమిట్టాడుతుంది. అంతేగాక ఆయా పంచాయతీలు, మున్సిపాలిటీలు వసూలైన ప్రతి రూ.100నుండి చెల్లించాల్సిన రూ.8 సెస్‌ను నిబంధనలకు విరుద్ధంగా గ్రంథాలయ సంస్థకు సంబంధించిన 19010313001 కోడ్‌ను ఉపయోగించకుండా ఖజానాలో జమచేస్తుండడం వల్ల కూడా గ్రంథాలయాలకు సెస్ జమ కావడం లేదు. ఇటీవల ప్రభుత్వం సెస్ బకాయిల వసూళ్లకు నోటీసులు జారీ చే సినా ఫలితం లేదు. తిరిగి జిల్లా గ్రంథాలయ సంస్థ మరోమారు సెస్ బకాయిల వసూళ్లకు ప్రత్యేక చొరవ చూపుతూ నోటీసులు జారీచేస్తున్నట్లు సమాచారం.
అంతుపట్టని అధికారుల మాయాజాలం
జిల్లాలోని మేజర్ గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో పెద్దపెద్ద పరిశ్రమలు, కర్మాకాగారాలు, ఫార్మా కంపెనీలున్నా ఆయా గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో పనిచేసే అధికారులు ఆస్తిపన్ను విధింపులో చేతివాటం ప్రదర్శిస్తూ కొద్దిమొత్తంలో పన్ను విధిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా ఆస్తి విలువ ప్రకారం పన్ను విధింపు జరిగితే ఆదాయం పెరిగి గ్రంథాలయాలకు కూడా సెస్‌ల రూపేణా వచ్చే ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఇటువంటి మాయాజాలం ప్రదర్శిస్తున్నారని పలుువురు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయమై కూడా ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రంథాలయ సంస్థల అధ్యక్షులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినట్లు సమాచారం.
సెస్ బకాయిల వసూళ్లకు ప్రత్యేక చర్యలు..
- అల్లం ప్రభాకర్‌రెడ్డి,
జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు
జిల్లాలోని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల నుంచి సెస్‌లు సకాలంలో రాకపోవడంతో గ్రంథాలయాల నిర్వహణ భారంగానే ఉంది. అయితే సెస్ బకాయిల వసూలుకు ప్రత్యేక చర్యలు చేపట్టడంలో భాగంగా ఫిబ్రవరి మొదటి వారంలో జిల్లా కేంద్రంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాం. గ్రంథాలయాల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తాం.
గ్రంథాలయాల మనుగడ ప్రశ్నార్థకం
Published Tue, Jan 21 2014 12:59 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement
Advertisement