ఆదిలాబాద్ కల్చరల్ : ఆదిలాబాద్ నియోజకవర్గంలో గ్రంథాలయాల పరిస్థితి అసౌకర్యాల నడుమ కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో కొంత అభివృద్ధి చెందిన అసౌకర్యాలు పోలేదు. విద్యార్థులకు పోటీ పరీక్షలకు కావాల్సిన పుస్తకాలు లేవు. గ్రూపు పరీక్షలకు సంబంధించిన మెటిరియల్ లేక గత్యంతరం లేక వేల రూపాయలు ఖర్చుచేసి పుస్తకాలు కొనాల్సినపరిస్థితి ఉంది. జిల్లా కేంద్రంలోని రెండో గేటు ప్రారంభానికి నొచుకోవడం లేదు. అరకొరగా పుస్తకాలు పాతవాటినే వాడుతున్నారు.
కొత్త పుస్తకాలు కొనుగోలు చేయడం లేదు. జైనథ్ మండల కేంద్రంలోని గ్రంథాలయాల ప్రాథమిక పాఠశాలలో అద్దె భవనంలో కొనసాగుతోంది. అక్కడ అటెండరే లైబ్రేరియన్‌గా మారాడు. లైబ్రేరియన్ ఉన్నా లేనట్టేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమయపాలన లేకుండా ఉంది. ఎప్పుడు తెరుస్తారో ఎప్పుడు తెరువరో ఎవరికీ తెలియని పరిస్థితి ఉంది. సదరు లైబ్రేరియన్ గ్రంథాలయ సంస్థ నాయకుడిగా ఉన్నందున అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. బేల మండలంలోని గ్రంథాలయం మరాఠి మీడియం ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతోంది. వసతులు లేకుండా ఉంది. కేవలం న్యూస్‌పేపర్లు మాత్రమే ఉన్నాయి. కనీస సౌకర్యాలు లేవు.
ఎటు చూసినా అసౌకర్యాలే
ఇచ్చోడ : చిరిగిన చొక్కా అయిన తొడుక్కొ.. కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కొ అన్నారో కవి. అంటే పుస్తక పఠనం ద్వారా కలిగే లాభాలు, అవగాహన మనిషికి ఎంత అవసరమో స్పష్టమవుతోంది. పుస్తకాలు కొనలేని వారు గ్రంథాలయానికి వచ్చి చదువుకుంటారు. కానీ గ్రంథాలయాల్లో అనింన రకాల పుస్తకాలు ఉండడం లేదు. నిధుల కొరతతో ఈ సమస్య ఉంది. దీంతో విజ్ఞాన భాండాగారాలుగా విలసిల్లాల్సిన గ్రంథాలయాలు ఏ జ్ఞానమూ అందించలేకపోతున్నాయి.
గదులు సరిపోక పుస్తకాలు, పత్రికలను నిల్వ చేసే పరిస్థితి కూడా చాలాచోట్ల లేదు. ప్రభుత్వ పట్టింపులేనితనం ఈ దుస్థితికి కారణమవుతోంది. బోథ్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో గ్రంథాలయాలను అసౌర్యాలు వెంటాడుతున్నాయి. తలమడుగు, బోథ్, నేరడిగొండ, గుడిహత్నూర్ మండలాల గ్రంథాలయాలకు సొంత భవనాలు లేవు. పంచాయతీ కార్యాలయల్లో కొన్ని, అద్దె భవనాల్లో మరిన్ని కొనసాగుతున్నాయి. పుస్తకాలు పెట్టే స్థలం లేక అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇరుకు గదుల్లో అసౌకర్యాల మధ్య చదవలేక పాఠకులు అవస్థలు పడుతున్నారు. ఇచ్చోడలో భవనం ఉన్నా సరిపడా ఫర్నిచర్ లేక పాఠకులకు ఇబ్బందులు తప్పడంలేదు. నేరడిగొండ మండలంలో గ్రంథాలయం పంచాయతీకి చెందిన ఇరుకు గదిలో కొనసాగుతోంది. బోథ్ గ్రంథాలయం 30 ఏళ్లుగా గ్రామాభివృద్ధి కమిటీ తరఫున ఇచ్చిన భవనంలో అరకొర వసతులు మధ్య కొనసాగుతోంది.
గుడిహత్నూర్‌లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. ఒకే గది దిక్కయిందిక్కడ. ఇక్కడి గ్రంథాలయ అధికారి తరచూ రాకపోవడంతో గ్రంథాలయం మూసే ఉంటోంది. బజార్‌హత్నూర్ మండల గ్రంథాలయానికి సొంత భవనం లేదు. దీంతో ప్రస్తుతం పశువైద్యశాలకు చెందిన భవనంలోనే తాత్కాలికంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇక్కడ పాఠకులకు తీవ్ర తిప్పలు తప్పడం లేదు.
నిర్మాణం పూర్తయ్యేదెప్పుడో?
నిర్మల్ : నిర్మల్‌లో 1958లో గ్రంథాలయాన్ని ప్రారంభించారు. మొదట గాంధీచౌక్‌లో ఓ అద్దె భవనంలో దీనిని నిర్వహించారు. 1960లో పౌర గ్రంథాలయ చట్టం అమలులోకి రావడంతో డీఈవో పరిధిలోకి, అనంతరం గ్రంథాలయాలకు ప్రత్యేక శాఖ ఏర్పడడంతో 1962లో గ్రంథాలయశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతూ వస్తోంది. అద్దె భవనం కావడం, అక్కడ సమస్యలు తెలత్తడంతో 2004 నవంబర్‌లో నిర్మల్ పాలించిన పాలకులు నిర్మించిన వందల ఏళ్ల నాటి సర్ద్‌మహాల్ (శీతలమందిరం)లోకి మార్చారు.
అయితే ప్రస్తుతం కొనసాగుతున్న భవనం పురాతనమైనది కావడం, ఒకటే గది ఉండడం అది కూడా పుస్తకాలను భద్రపర్చేందుకే సరిపోతోంది. దీంతో వచ్చే పాఠకులు ఆరుబయటే చదువుకునే పరిస్థితులు నెలకొంటున్నాయి. అలాగే భవనం వెనుకభాగంలో ఉన్న బావిలో నుంచి విషసర్పాలు, తేళ్లు వంటి వస్తుండడంతో అధికారులు, పాఠకులు భయాందోళనల మధ్య పఠించే పరిస్థితి ఏర్పడింది.
ఈ గ్రంథాలయ ఆధునికీకరణకు గతంలో అధికారులు, ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చారు. కానీ నేటికీ అవి ఆచరణకు నోచుకోలేదు. నియోజకవర్గంలోని మామడలో పురాతన భవనంలోనే గ్రంథాలయం కొనసాగుతోంది. మిగతా మండలాలకు గ్రంథాలయ భవనాలున్నా ఇతర సౌకర్యాలు కల్పించాల్సి ఉంది.
గతి తప్పిన గ్రంథాలయాలు
Published Tue, Nov 18 2014 3:04 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement