గతి లేని గ్రంథాలయాలు
కానరాని కొత్త పుస్తకాలు
రెండేళ్లుగా ఇదే పరిస్థితి
భర్తీ కాని పోస్టులు
స్థానిక సంస్థల నుంచి వసూలుకాని సెస్
పట్టించుకోని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు
ఏర్పడని గ్రంథాలయ పాలకవర్గం
మంత్రి గంటా సొంత జిల్లాలోనే గ్రంథాలయాల దుస్థితి
విశాఖపట్నం: ఒకప్పుడు విజ్ఞాన భాండాగారాలు.. నేడు నానాటికీ తీసికట్టుగా మారాయి. జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధీనంలో ఉండే ఈ శాఖలో గ్రంథాలయాల పరిస్థితిపై శనివారం సాక్షి బృందం జరిపిన పరిశీలనలో పలు సమస్యలు వెలుగుచూశాయి. నగరం నడిబొడ్డున కేజీహెచ్ సమీపంలో రూ.కోట్ల విలువైన కేంద్ర గ్రంథాలయ సంస్థ భూమి ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్ కేంద్రం ఆధీనంలో ఉంది. ఇక్కడ మల్టీస్టోర్‌డ కాంప్లెక్సు నిర్మించాలన్న ప్రతిపాదన గతంలో ఇదే మంత్రి ప్రతిపాదించినా నేటికీ కార్యరూపం దాల్చలేదు. దీంతో పరాయి పంచన, ఇరుకు గదుల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ పరిపాలన కార్యాలయం నెట్టుకొస్తోంది. దీనికోసం ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మతోపాటు యువజన, ప్రజా సంఘాలు అలుపెరగని పోరు సాగిస్తూనే ఉన్నాయి.
ఏర్పడని గ్రంథాలయ పరిషత్
టీడీపీ ప్రభుత్వం గద్దెనెక్కి దాదాపు రెండేళ్లు కావస్తున్నా నేటికీ రాష్ర్టస్థాయి గ్రంథాలయ పరిషత్ ఏర్పడలేదు. జిల్లాలో మంత్రుల మధ్య నెలకొన్న విబేధాల కారణంగా సంస్థ నూతన పాలకవర్గం ఏర్పడలేదు. దీంతో కనీసం పాఠకులు కోరే పుస్తకాలు కొనే నాథుడు లేకుండా పోయారు.
సెస్ జమచేయని స్థానిక సంస్థలు
అరకొర సదుపాయాలతో..అద్దె భవనాలతో నడుస్తున్న శాఖా గ్రంథాలయ పరిస్థితి ఘోరంగా ఉంది. ఏటా రెండు శాతం గ్రంథాలయ సెస్ వసూలు చేస్తున్న స్థానిక సంస్థలు వాటిని జమ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. దీంతో కళ్లెదుటే రూ. కోట్లు ఆదాయం ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. మున్సిపాలిటీల నుంచి రూ.30 లక్షలు, పంచాయతీల నుంచి రూ.50 లక్షలు, ఏపీఐఐసీ నుంచి మరో రూ.60 లక్షలమేర బకాయిలు ఉన్నాయి. జిల్లాలోని నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలతోపాటు ఏపీఐఐసీలు క్రమం తప్పకుండా బకాయిలు చెల్లిస్తున్నాయి. ఇవి కూడా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకాయిలు చెల్లించాల్సి ఉంది.
భర్తీకాని పోస్టులు
గ్రంథాలయాలను సిబ్బంది కొరత వేధిస్తోంది. పర్మినెంట్, పార్ట్‌టైం, అవుట్‌సోర్సింగ్ పోస్టుల్లో సగానికి పైగా పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. దీంతో శాఖా గ్రంథాలాయల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారుతోంది. చాలా గ్రంథాలయాలు వారానికి రెండు మూడు రోజులు కూడా తెరచుకోని దుస్థితి నెలకొంది. కొన్ని గ్రంథాలయాల్లో సిబ్బంది ఒకరు ఉన్నచోట సెలవు పెడితే మూతపడినట్టే. కొన్ని గ్రంథాలయాల నిర్వహణ స్వీపర్లు, అంటెడర్లపై ఆధారపడ్డాయి. పాలవకర్గం లేక ప్రశ్నించే నాథుడు కరువయ్యారు. రాష్ర్ట స్థాయిలో పరిషత్, జిల్లాస్థాయిలో పాలకవర్గం లేకపోవడంతో రెండేళ్లుగా ఒక్క పుస్తకం కొన్న పాపాన పోలేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కు సంబంధించిన పుస్తకాలు కానరావడం లేదు. గతంలో ట్రైబల్ సబ్‌ప్లాన్, ఎస్సీ సబ్‌ప్లాన్‌తో పాటు ఆర్థిక సంఘం నిధులు కూడా గ్రంథాలయ సంస్థలకు కేటాయించేవారు. నేడు ఇటు రాష్ర్టం కానీ..అటు కేంద్రం కానీ వీటి నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశాయి. సిబ్బంది జీతభత్యాలకు మినహా ఒక్క పైసా కూడా నిధులు కేటాయించడం లేదు.
గంటాపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు
విశాఖ జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ భవన నిర్మాణ విషయంలో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శాసన మండలిని తప్పుదోవ పట్టించారు. ప్రత్యూష కంపెనీకి తనకు సంబంధం లేదని 2014 సెప్టెంబర్ ఒకటిన మంత్రి గంటా శాసన మండలిలో తెలిపారు. ప్రత్యూష కంపెనీలో గంటాకు 26 శాతం వాటాలున్నాయి. స్పష్టమైన ఆధారాలున్నాయి. గ్రంథాలయ సంస్థ సొంత నిధులతో జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ స్థలంలో భవన నిర్మాణం చేపడతామని ఆ రోజునే మంత్రి శాసనమండలి హామీనిచ్చారు. 15 నెలలు గడచినా ఇంతవరకూ చర్యలు చేపట్టలేదు. అందుకే గంటాపై మండలిలో సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చాం.
- ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ