తెలుగు అకాడమీ పుస్తకాలను ఆవిష్కరిస్తున్న దేవసేన, శ్రీధర్, మంత్రి సబిత
సాక్షి, హైదరాబాద్: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా లైబ్రరీల్లో అన్ని సౌకర్యాలను కల్పించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం అధికారులతో లైబ్రరీలపై మంత్రి సమీక్షించారు. నిరుద్యోగులకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచాలని, జిల్లా లైబ్రరీలను ఉదయం 8 నుంచి రాత్రి 9 వరకు, శాఖా గ్రంథాలయాలను ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 వరకు తెరిచే ఉంచాలని సూచించారు.
పోటీ పరీక్షల అభ్యర్థులకు ప్రత్యేక రీడింగ్ రూం ఏర్పాటు చేయాలన్నారు. పోటీ పరీక్షల కోసం తెలుగు అకాడమీ ముద్రించిన 42 పుస్తకాలను మంత్రి ఆవిష్కరించారు. ‘మన ఊరు– మనబడి’ పథకం కింద ఎంపికైన స్కూళ్లలో గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయాల సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment