World Book Day 2021: చలో..‘బుక్‌’అయిపోదాం.. | World Book Day 2021: Highest, Largest, Longest Libraries, France Beach Library | Sakshi
Sakshi News home page

World Book Day 2021: చలో..‘బుక్‌’అయిపోదాం..

Published Fri, Apr 23 2021 7:08 PM | Last Updated on Fri, Apr 23 2021 7:29 PM

World Book Day 2021: Highest, Largest, Longest Libraries, France Beach Library - Sakshi

పుస్తకం గొప్పతనం గురించి అందరికీ తెలిసిందే.. అందుకే ఈసారి వాటికి నిలయమైన గ్రంథాలయాల గురించి తెలుసుకుందాం..

ఒక మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానమట.. అప్పట్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం చెప్పారు.. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. ఈ రోజు (ఏప్రిల్‌ 23) ప్రపంచపుస్తక దినోత్సవం.. పుస్తకం గొప్పతనం గురించి అందరికీ తెలిసిందే.. అందుకే ఈసారి వాటికి నిలయమైన గ్రంథాలయాల గురించి తెలుసుకుందాం.. ఇవి ప్రపంచంలోనే డిఫరెంట్‌ లైబ్రరీలు.. చలో మరి..

 
దీని వయసు 1,162 ఏళ్లు 
ప్రపంచంలో ఇప్పటికీ నిలిచిఉన్న పురాతన లైబ్రరీ  మొరాకోలోని ‘ది అల్‌ ఖారవియిన్‌ లైబ్రరీ’. క్రీస్తుశకం 859లో ఫాతిమా అల్‌ ఫిహ్రీ అనే సంపన్న మహిళ దీనిని కట్టించారు. ఇందులో ఎన్నో పురాతనమైన తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి.. మొరాకో ప్రభుత్వం ఈ మధ్యే ఈ బిల్డింగ్‌ను పునరుద్ధరించి.. ప్రజల కోసం ఓపెన్‌ చేసింది. 


470 భాషలు.. 3.2 కోట్ల పుస్తకాలు
అమెరికా ప్రతినిధుల సభ కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉండే ‘లైబ్రరీ ఆఫ్‌ కాంగ్రెస్‌’ ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీ ఇదే. 470 భాషలకు చెందిన 3.2 కోట్ల పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి . అందమైన నగిషీలు, మార్బుల్‌ ఫినిషింగ్‌తో అందమైన లైబ్రరీగానూ పేరుపొందింది. ప్రతినిధుల సభకు అనుబంధంగా ఉన్నా అక్కడి పౌరులెవరైనా వెళ్లి పుస్తకాలు చదువుకోవచ్చు.


నేచురల్‌ లైటింగ్‌..
చూడటానికి డిఫరెంట్‌గా కనిపిస్తున్న ఈ బిల్డింగ్‌ ఈజిప్ట్‌లోని బబ్లియోథెకా అలెగ్జాండ్రియా లైబ్రరీ. ప్రపంచంలోని పురాతన, అతిపెద్ద లైబ్రరీల్లో ఇదీ ఒకటి. ఈ లైబ్రరీకి 2002లో కొత్త బిల్డింగ్‌ కట్టించారు. పూర్తిగా సౌర కాంతి పడి పుస్తకాలు చదువుకునేలా రూపొందించారు.ఎక్కువ సంఖ్యలో పురాతన గ్రంథాల ఫొటో కాపీలు ఇక్కడ ఉన్నాయి.


చదువుతూ.. రిలాక్స్‌..
లైబ్రరీ అంటే అంతా సైలెంట్, ఓ పక్కన కూర్చుని మీ చదువేదో మీరు చదువుకుంటారు కదా.. కానీ ఫ్రాన్స్‌లో సముద్ర తీరం వెంబడి ఏర్పాటు చేసిన ‘లైర్‌ అ లా ప్లాగ్‌ (బీచ్‌ దగ్గర చదువుకోండి)’ లైబ్రరీలు మాత్రం వెరీ స్పెషల్‌. నచ్చిన పుస్తకమో, నవలో, మేగజైనో తీసుకుని.. బీచ్‌ ఇసుకలో అలా రిలాక్స్‌డ్‌గా చదువుకోవచ్చు. బీచ్‌ల వెంట ఆరెంజ్‌ పైకప్పు, ఎరుపు రంగు కుర్చీలను ఏర్పాటు చేశారు.


బొమ్మల పుస్తకాలు..
బొమ్మలతో ఉండే కథల పుస్తకాలు.. చిన్నప్పుడు ఇష్టంగా చదివేవాళ్లం.. వాటిని ఇప్పుడు కూడా చదవొచ్చు.. జపాన్‌లోని ఇవాకీ సిటీలో ఉన్న ఈ లైబ్రరీకి వెళ్తే.. ఇక్కడ వెయ్యికి పైగా ఇలాంటి పిక్చర్‌ బుక్స్‌ ఉన్నాయి. లోపల సెటప్‌ సూపర్‌గా ఉంటుంది.. అక్కడే ఉండిపోవాలనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement