మానవాళికి ఆలోచించడం నేర్పింది అక్షరమైతే... ప్రపంచ గతిని మార్చేలా చేసింది పుస్తకం. అనుభవం, జ్ఞానం ఓ తరం నుంచి మరో తరానికి అందించే ఏకైక సాధనం పుస్తకమే. తరతరాల నుండి పుస్తకాలు ప్రపంచానికి చేసిన సేవను అంచనా వేయడమంటే ఆకాశాన్ని కొలవడం లాంటిదే. స్పెయిన్ దేశంలోని ప్రజలు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 23న ఒకరిపట్ల ఒకరు ప్రేమను వ్యక్తం చేసుకుంటూ ఒకరికొకరు గులాబి పుష్పాలను అందించుకోవడం సంప్రదాయం. కానీ 1926లో అక్కడి రచయిత మిగ్యుల్ డి సెర్వాంటెజ్ మరణించడంతో ఆ సంవత్సరం గులాబీలకు బదులు పుస్తకాలను పరస్పరం అందించుకున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు వేర్వేరు తేదీలలో పుస్తక మహోత్సవాలు నిర్వహించినా... 1616లో ఏప్రిల్ 23న విలియం షేక్‌స్పియర్, సెర్వాంటెజ్ ‘ఒకేరోజున’ మరణించడం; మరి కొందరు ప్రముఖ రచయితలు అదే రోజున జన్మించడాన్ని ప్రామాణికంగా తీసుకొని యునెస్కో 1995లో ప్యారిస్‌లో జరిగిన సమావేశంలో... పుస్తకాలకూ, రచయితలకూ గౌరవాన్ని ఇవ్వడం, యువతరాన్ని పుస్తక పఠనం వైపు ఆకర్షించడం; ప్రచురణ, కాపీ హక్కుల వంటి విషయాలను ప్రోత్సాహించి వాటి గురించి విస్తృత ప్రచారం చేయడం వంటి లక్ష్యాలతో ఏప్రిల్ 23న ‘ప్రపంచ పుస్తక దినోత్సవం’గా, ప్రపంచ పుస్తక కాపీ హక్కుల దినంగా’ జరుపుకోవాలని పిలుపునిచ్చింది.
స్నేహపూర్వకమైన సలహాలను ఇచ్చి మనల్ని మనం గౌరవిం చుకోవడం, పరులను గౌరవించడాన్ని పుస్తకాలు నేర్పుతాయి. మన హృదయాన్నీ, మేధస్సునూ... మనిషి పట్ల, ప్రపంచం పట్ల ప్రేమతో నింపివేస్తాయి. అందుకే పుస్తకం హస్తభూషణం కావాలి. (క్లిక్: దేశమే ఓ ‘సంఘం’.. అది విద్వేష కేంద్రం కాదు!)
– నరేందర్ రాచమల్ల, హన్మకొండ
(ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవం)
Comments
Please login to add a commentAdd a comment