World Book Day
-
ప్రపంచానికి దిక్సూచి.. పుస్తకం
మానవాళికి ఆలోచించడం నేర్పింది అక్షరమైతే... ప్రపంచ గతిని మార్చేలా చేసింది పుస్తకం. అనుభవం, జ్ఞానం ఓ తరం నుంచి మరో తరానికి అందించే ఏకైక సాధనం పుస్తకమే. తరతరాల నుండి పుస్తకాలు ప్రపంచానికి చేసిన సేవను అంచనా వేయడమంటే ఆకాశాన్ని కొలవడం లాంటిదే. స్పెయిన్ దేశంలోని ప్రజలు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 23న ఒకరిపట్ల ఒకరు ప్రేమను వ్యక్తం చేసుకుంటూ ఒకరికొకరు గులాబి పుష్పాలను అందించుకోవడం సంప్రదాయం. కానీ 1926లో అక్కడి రచయిత మిగ్యుల్ డి సెర్వాంటెజ్ మరణించడంతో ఆ సంవత్సరం గులాబీలకు బదులు పుస్తకాలను పరస్పరం అందించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు వేర్వేరు తేదీలలో పుస్తక మహోత్సవాలు నిర్వహించినా... 1616లో ఏప్రిల్ 23న విలియం షేక్స్పియర్, సెర్వాంటెజ్ ‘ఒకేరోజున’ మరణించడం; మరి కొందరు ప్రముఖ రచయితలు అదే రోజున జన్మించడాన్ని ప్రామాణికంగా తీసుకొని యునెస్కో 1995లో ప్యారిస్‌లో జరిగిన సమావేశంలో... పుస్తకాలకూ, రచయితలకూ గౌరవాన్ని ఇవ్వడం, యువతరాన్ని పుస్తక పఠనం వైపు ఆకర్షించడం; ప్రచురణ, కాపీ హక్కుల వంటి విషయాలను ప్రోత్సాహించి వాటి గురించి విస్తృత ప్రచారం చేయడం వంటి లక్ష్యాలతో ఏప్రిల్ 23న ‘ప్రపంచ పుస్తక దినోత్సవం’గా, ప్రపంచ పుస్తక కాపీ హక్కుల దినంగా’ జరుపుకోవాలని పిలుపునిచ్చింది. స్నేహపూర్వకమైన సలహాలను ఇచ్చి మనల్ని మనం గౌరవిం చుకోవడం, పరులను గౌరవించడాన్ని పుస్తకాలు నేర్పుతాయి. మన హృదయాన్నీ, మేధస్సునూ... మనిషి పట్ల, ప్రపంచం పట్ల ప్రేమతో నింపివేస్తాయి. అందుకే పుస్తకం హస్తభూషణం కావాలి. (క్లిక్: దేశమే ఓ ‘సంఘం’.. అది విద్వేష కేంద్రం కాదు!) – నరేందర్ రాచమల్ల, హన్మకొండ (ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవం) -
World Book Day 2021: చలో..‘బుక్’అయిపోదాం..
ఒక మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానమట.. అప్పట్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పారు.. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. ఈ రోజు (ఏప్రిల్ 23) ప్రపంచపుస్తక దినోత్సవం.. పుస్తకం గొప్పతనం గురించి అందరికీ తెలిసిందే.. అందుకే ఈసారి వాటికి నిలయమైన గ్రంథాలయాల గురించి తెలుసుకుందాం.. ఇవి ప్రపంచంలోనే డిఫరెంట్ లైబ్రరీలు.. చలో మరి.. దీని వయసు 1,162 ఏళ్లు ప్రపంచంలో ఇప్పటికీ నిలిచిఉన్న పురాతన లైబ్రరీ మొరాకోలోని ‘ది అల్ ఖారవియిన్ లైబ్రరీ’. క్రీస్తుశకం 859లో ఫాతిమా అల్ ఫిహ్రీ అనే సంపన్న మహిళ దీనిని కట్టించారు. ఇందులో ఎన్నో పురాతనమైన తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి.. మొరాకో ప్రభుత్వం ఈ మధ్యే ఈ బిల్డింగ్‌ను పునరుద్ధరించి.. ప్రజల కోసం ఓపెన్ చేసింది. 470 భాషలు.. 3.2 కోట్ల పుస్తకాలు అమెరికా ప్రతినిధుల సభ కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉండే ‘లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్’ ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీ ఇదే. 470 భాషలకు చెందిన 3.2 కోట్ల పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి . అందమైన నగిషీలు, మార్బుల్ ఫినిషింగ్‌తో అందమైన లైబ్రరీగానూ పేరుపొందింది. ప్రతినిధుల సభకు అనుబంధంగా ఉన్నా అక్కడి పౌరులెవరైనా వెళ్లి పుస్తకాలు చదువుకోవచ్చు. నేచురల్ లైటింగ్.. చూడటానికి డిఫరెంట్‌గా కనిపిస్తున్న ఈ బిల్డింగ్ ఈజిప్ట్‌లోని బబ్లియోథెకా అలెగ్జాండ్రియా లైబ్రరీ. ప్రపంచంలోని పురాతన, అతిపెద్ద లైబ్రరీల్లో ఇదీ ఒకటి. ఈ లైబ్రరీకి 2002లో కొత్త బిల్డింగ్ కట్టించారు. పూర్తిగా సౌర కాంతి పడి పుస్తకాలు చదువుకునేలా రూపొందించారు.ఎక్కువ సంఖ్యలో పురాతన గ్రంథాల ఫొటో కాపీలు ఇక్కడ ఉన్నాయి. చదువుతూ.. రిలాక్స్.. లైబ్రరీ అంటే అంతా సైలెంట్, ఓ పక్కన కూర్చుని మీ చదువేదో మీరు చదువుకుంటారు కదా.. కానీ ఫ్రాన్స్‌లో సముద్ర తీరం వెంబడి ఏర్పాటు చేసిన ‘లైర్ అ లా ప్లాగ్ (బీచ్ దగ్గర చదువుకోండి)’ లైబ్రరీలు మాత్రం వెరీ స్పెషల్. నచ్చిన పుస్తకమో, నవలో, మేగజైనో తీసుకుని.. బీచ్ ఇసుకలో అలా రిలాక్స్డ్గా చదువుకోవచ్చు. బీచ్‌ల వెంట ఆరెంజ్ పైకప్పు, ఎరుపు రంగు కుర్చీలను ఏర్పాటు చేశారు. బొమ్మల పుస్తకాలు.. బొమ్మలతో ఉండే కథల పుస్తకాలు.. చిన్నప్పుడు ఇష్టంగా చదివేవాళ్లం.. వాటిని ఇప్పుడు కూడా చదవొచ్చు.. జపాన్‌లోని ఇవాకీ సిటీలో ఉన్న ఈ లైబ్రరీకి వెళ్తే.. ఇక్కడ వెయ్యికి పైగా ఇలాంటి పిక్చర్ బుక్స్ ఉన్నాయి. లోపల సెటప్ సూపర్‌గా ఉంటుంది.. అక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. -
ఆ సర్జరీ తర్వాత ‘ప్లాస్టిక్ చోప్రా’ అని వెక్కిరించేవారు
ఆకాశమంత జీవితం నిప్పై జ్వలిస్తుంది. నీరై ఎగసిపడుతుంది. ప్రభంజనమై గొంతెత్తుతుంది.ఎప్పడో శేషజీవితంలో పుస్తకం రాసుకుందాం లే...అనుకోకుండా బాలీవుడ్ సెలబ్రిటీలు పుస్తకాలు రాస్తున్నారు. తమ జీవితాన్ని తెరిచిన పుస్తకం చేస్తున్నారు...పుస్తకం పంచభూతాల సమాహారం క్రాకింగ్ ది కోడ్ మై జర్నీ ఇన్ బాలీవుడ్ –ఆయుష్మాన్ ఖురానా ఆయుష్మాన్ ఖురానా ఎవరు? అనగానే వచ్చే సమాధానం బ్యాక్–టు–బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఇస్తున్న హీరో అని! ఈయనలో మంచి రచయితను పరిచయం చేసిన పుస్తకం క్రాకింగ్ ది కోడ్. భార్య తహీర కష్యప్‌తో కలిసి ఈ పుస్తకం రాశారు. చండీగఢ్ నుంచి ముంబైకు ఎంత దూరమో తెలియదుగానీ ‘జీరో టు హీరో’కు మధ్య దూరం మాత్రం చాలా పెద్దది. అలా అని దూరభయంలోనే ఉంటే కలలు ఎప్పటికీ దూరంగానే ఉంటాయి. ఈ విషయం తెలిసే తన కలల దారిని వెదుక్కుంటూ డ్రీమ్స్ సిటీ ముంబైకి వచ్చాడు ఖురాన. తన ప్రయాణంలో ఎదురైన కష్టాలకు ఈ పుస్తకంలో అక్షర రూపం ఇచ్చాడు. ఫేమ్, మై భీ హీరో, మైనే స్ట్రగులర్ హుమ్, టికెట్ టు బాలీవుడ్...మొదలైన చాప్టర్లు ఈ పుస్తకంలో ఉన్నాయి. కలలు కనేవాళ్లకు, కన్న కలలు నిజం చేసుకోవడానికి భయపడేవాళ్లకు ఈ పుస్తకం అంతులేని ధైర్యం. పుస్తకం నుంచి మంచి వాక్యం: మనలోని ‘నాకు అంతా తెలుసు’ అనే ద్వారం మూతపడితే తప్ప ‘తెలుసుకోవాలి’ అనే ద్వారం తెరుచుకోదు. ది పెరిల్స్ ఆఫ్ బీయింగ్మోడరేట్లీ ఫేమస్ సోహా అలీ ఖాన్ పెద్ద మర్రిచెట్టు కింద చిన్న మొక్క కూడా మొలవదు అంటారు. అదేమిటోగానీ, ఆ పెద్ద నీడ మాటున ‘వ్యక్తిగత ప్రతిభ’ అనేది చాలాసార్లు చిన్నబోతుంది. హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ సినిమాల్లో నటిగా తన ప్రతిభ చాటుకున్న సోహా అలీఖాన్ చాలామంది దృష్టిలో పటౌడీ–షర్మిలా ఠాగూర్ల కూతురు మాత్రమే, ఇంకొందరి దృష్టిలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ సోదరి. ఇలాంటి విచిత్ర పరిస్థితిని హాస్యధోరణిలో రాసి నవ్వించారు సోహా. తన స్కూల్, కాలేజీ జీవిత జ్ఞాపకాలను నెమరేసుకోవడంతో పాటు ఈనాటి సోషల్ మీడియా కల్చర్‌పై తనదైన శైలిలో రాశారు. పుస్తకం నుంచి మంచి వాక్యం: జీవితం అయిదుసార్లు కుప్పకూల్చితే, పదిసార్లు లేచి నిల్చోవాలి.శక్తినంతా కూడదీసుకొని పోరాడాలి. అమ్మ మియా: ఇషా డియోల్ మాతృత్వం మధురిమపై ఇషా డియోల్ రాసిన అద్భుత పుస్తకం అమ్మ మియా. గర్భం దాల్చినప్పుడు తాను ఎదుర్కొన్న భయాలు, సందేహాలు వాటికి దొరికిన సమాధానాలు, ఇద్దరు పిల్లలు రధ్య, మియరల పెంపకం సంగతులు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇదొక బెస్ట్ పేరెంటింగ్ పుస్తకంగా పేరు తెచ్చుకుంది. స్థూలంగా చెప్పాలంటే న్యూ మదర్స్‌కు ఇదొక మంచి గైడ్‌లా ఉపకరిస్తుంది. పుస్తకం నుంచి మంచి వాక్యం: జీవితంలో మంచి విషయాలు అంటే అనుకోకుండా ఎదురయ్యే ఆనందక్షణాలే! అన్ఫినిష్డ్ ప్రియాంక చోప్రా సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి హాలీవుడ్ వరకు ఎదగడం సాధారణ విషయమేమీ కాదు. తన ప్రయాణం నల్లేరు మీద నడక కాదు. తన ప్రస్థానంలో ఎదురైన అవమానాలు, చేసిన పోరాటాలను ‘అన్ఫిన్ఫినిష్డ్’లో రాశారు ప్రియాంక చోప్రా. ఒకానొక రోజు ప్రమాదవశాత్తు పెదవి తెగి రూపమే మారిపోయిన సందర్భంలో ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాల్సి వచ్చింది. ఇక అప్పటి నుంచి ‘ప్లాస్టిక్ చోప్రా’ అనే వెక్కిరింపులు ఎదురయ్యాయి. అయితే ఇవేమీ తన విజయానికి అడ్డుపడలేకపోయాయి. పుస్తకం నుంచి మంచి వాక్యం: నీలాంటి వ్యక్తి నువ్వు మాత్రమే. నీ గురించి బాగా తెలిసిన వ్యక్తి నువ్వు మాత్రమే. నీ బలాల గురించి బాగా తెలిసిన వ్యక్తి కూడా నువ్వు మాత్రమే! -
ఐసోలేషన్‌లో అవే మన ఆత్మీయ నేస్తాలు!
జీవితంలో ప్రతీ ఒక్కరు తమకంటూ కొంతమంది ఆత్మీయులను సంపాదించుకుంటారు. బాధ కలిగినా.. సంతోషంతో మనసు ఉప్పొంగినా ఆ భావాలను వారితో పంచుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో చుట్టూ ఎంతమంది ఉన్నా మనం ఒంటరి వాళ్లమనే భావన కలుగుతుంది. అలాంటి సమయాల్లో నచ్చిన పుస్తకం తీసి చదువుతూ ఉంటే మనసు తేలికపడుతుంది. పుస్తకాలు విజ్ఞానాన్ని ఇవ్వడంతో పాటు... మానసికంగా ఎంతో ధైర్యాన్ని కూడా ఇస్తాయి. ‘చినిగిన చొక్కైనా తొడుక్కో.. ఒక మంచి పుస్తకం కొనుక్కో’ అని కందుకూరి వీరేశలింగం పంతులు... ‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’ అని ప్రజాకవి కాళోజీ అన్నారంటే మనిషి జీవితంలో పుస్తక పఠనానికి ఉన్న ప్రాముఖ్యం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా స్వీయ అనుభవంతోనే మనకు దాని విలువ బోధపడుతుంది. నేడు(ఏప్రిల్ 23) అంతర్జాతీయ పుస్తక దినోత్సవం. జగమెరిగిన ఆంగ్ల నాటక రచయిత విలియం షేక్స్ పియర్ జయంతి- వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళిగా 1995 నుంచి ప్రతీ ఏటా వరల్డ్ బుక్ డేను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని.. ‘‘ప్రపంచమంతా కోవిడ్-19తో కల్లోలం అవుతున్న వేళ పుస్తకాలు చేసే మ్యాజిక్ ఏంటో మనం తెలుసుకోవాలి. పుస్తక పఠనానికి ఉన్న శక్తి ఏమిటో... సరికొత్త రేపటిని నిర్మించుకోవడంలో అది ఏవిధంగా ఉపయోగపడుతుందో నేర్చుకోవాలి’’’ అని యునెస్కో ట్వీట్ చేసింది. మంచి పుస్తకాన్ని మించిన ఆత్మీయులెవరూ ఉండరంటూ ఓ ఫొటోను షేర్ చేసింది. ఇక ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సైతం.. ‘‘ నన్ను నేను సౌకర్యంగా ఉంచుకోవడంలో పుస్తకాలే ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఇలాంటి కష్టసమయాల్లో.. ఐసోలేషన్‌లో బుక్స్ మనకు ఎంతో సహాయం చేస్తాయి. పుస్తక పఠనంలో ద్వారా వచ్చే శక్తిని ఈ వరల్డ్బుక్డే సందర్భంగా మనం సెలబ్రేట్ చేసుకుందాం’’ అని ట్వీట్ చేశారు. తాటాకుల నుంచి ఇ-బుక్‌ల వరకు ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత పుస్తకాల ముద్రణ సులువుగా మారింది.. ఇ- బుక్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ సౌకర్యాలేవీ లేని పురాతన కాలం నుంచే ఎంతో మంది రచయితలు, కవులు తాటి ఆకులపై రచనా వ్యాసంగాలు చేశారు. ఇక సాహిత్యానికి పెద్దపీట వేసిన శ్రీకృష్ణదేవరాయలు వంటి ఎంతో మంది రాజులు కవులను ప్రోత్సహిస్తూ భాషాభివృద్ధికి తోడ్పడ్డారు. ప్రత్యేక సందర్భాల్లో బంగారు, వెండి, రాగి రేకులు, వస్త్రాలపై అమూల్యమైన సమాచారాన్ని లిఖించి భవిష్యత్ తరాలకు విలువైన సంపదను అందించారు. ఇక ప్రస్తుతం లక్షలాది మంది ప్రాణాలను బలిగొంటూ ప్రపంచంపై కరాళ నృత్యం చేస్తున్న కరోనా మహమ్మారి గురించి పోతులూరి వీరేంద్ర బ్రహ్మేంద్రస్వామి ఏనాడో తాళపత్ర గ్రంథాల్లో లిఖించారన్న విషయం సోషల్ మీడియా ద్వారా ప్రపంచాన్ని చుట్టేస్తున్న సంగతి తెలిసిందే. పన్నెండేళ్ల వయస్సులో లైబ్రరీ స్థాపించిన చిన్నారి యశోద గొప్ప కానుక... ప్రస్తుతం ప్రాణాంతక కోవిడ్-19ను కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌ను ఎంతో మంది పుస్తక పఠనంతో సద్వినియోగం చేసుకుంటున్నారు. ముఖ్యంగా కేరళకు చెందిన యశోద డి షెనాయ్ వంటి(12) చిన్నారులు సైతం ఖాళీ సమయాన్ని మరిన్ని ఎక్కువ పుస్తకాలు చదివేందుకు వినియోగిస్తున్నామని చెబుతున్నారు. అంతేకాదు అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా పేరొందిన కేరళలో.. లాక్డౌన్ నిబంధనలు పాక్షికంగా సడలించిన నేపథ్యంలో నిత్యావసరాల షాపులతో పాటుగా పుస్తకాల షాపులు కూడా తెరవాలని ఆ రాష్ట్ర వాసులు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు విజ్ఞప్తి చేశారు. మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుస్తకాలను కొనుక్కునేందుకు కొన్ని గంటల పాటు బుక్‌షాపులు తెరచి ఉంచాలని కోరుతున్నారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఇక ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా తాజాగా దేశంలోని అర్బన్ ప్రాంతాల్లోని నాన్ హాట్‌స్పాట్ ప్రాంతాల్లో పుస్తకాల షాపులకు మినహాయింపు ఇవ్వడంతో రీడర్స్ క్లబ్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వరల్డ్ బుక్ డే రోజు తమకు అందిన గొప్ప కానుక అంటూ పుస్తక ప్రియులు మురిసిపోతున్నారు. 23 April is #WorldBookDay! In a world disrupted by #COVID19, it is the magic of books that we need now. Let's unleash the power of reading to dream, to learn and to help us build a better tomorrow! ℹ️ https://t.co/MjMQG6JGxW #ShareCulture pic.twitter.com/jUNDlIjGxs — UNESCO (@UNESCO) April 23, 2020 -
పుస్తకాలే ప్రియనేస్తాలు
ప్రపంచ ప్రఖ్యాత ఆంగ్ల నాటక రచయిత విలియం షేక్స్ పియర్ జయంతి, వర్థంతి రోజైన ఏప్రిల్ 23ని యునెస్కో అంతర్జాతీయ పుస్తక దినోత్సవంగా ప్రకటించింది. ఈ మేరకు 1995 నుంచి ఏటా పుస్తక దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఏటా వంద దేశాల్లో ఈ ఉత్సవం జరుగుతోంది. కుటుంబ సభ్యులు ఆత్మీయులు మరణించిన సందర్భాలలో పుస్తకాలే ప్రియ నేస్తాలై ఆ బాధను మరచిపోవడానికి దోహదపడినట్టు చిలకమర్తి లక్ష్మీనరసింహం తన అనుభవాన్ని వివరించారు. అక్షర రూపం దాల్చిన ఒక్క సిరాచుక్క లక్ష మదళ్ళను కదిలిస్తుందన్నారు కాళోజీ. భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేడ్కర్ పుస్తకాలు చదివి అపారమైన విజ్ఞానాన్ని సొంతం చేసుకున్నారు. గ్రంథ పఠనానికే అగ్ర తాంబూలం ఇచ్చి, భోజనం చేయడం మర్చిపోయిన సందర్భాలెన్నో ఆయన జీవితంలో ఉన్నాయి. చిరిగిపోయిన వస్త్రాలనైనా ధరించు కానీ, కొత్త పుస్తకం దొరికితే కొనుక్కో అని జార్జి బెర్నార్షా, కందుకూరి వీరేశలింగం ఏనాడో సెలవిచ్చారు. అయితే చెడ్డ పుస్తకాలను చదవడం విషం సేవించడంతో సమానమని టాల్‌స్టాయ్ ప్రవచించారు. (నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం) వాండ్రంగి కొండలరావు, పొందూరు, శ్రీకాకుళం ‘ 94905 28730 -
పుస్తకం.. సమస్త ప్రపంచం
వెలుగు చూసిన.. అపూర్వ సాహిత్య సంపద దేవరకద్ర రూరల్ : ఆధునిక ముద్రణా పరిజ్ఞానం అందుబాటులోకి రాకముందే రచయితలు, కవులు, జానపదకళలను ప్రదర్శించే కళాకారులు, శాస్త్రకారులు తమ రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. తాళపత్రాలు (తాటి ఆకులు) విరివిగా వినియోగించి తమ రచనలను భద్రపరిచారు. వీటితోపాటు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో బంగారు, వెండి, రాగి రేకులు, వస్త్రాలపై అమూల్యమైన సమాచారాన్ని లిఖించి ప్రాచీన భాషకు పట్టం కట్టారు. శిలాశాసనాలకు కొదవేలేదు. అరుదైన చర్మలిఖిత ప్రతి పెబ్బేరు ప్రాంతంలో లభించింది. దేవరకద్ర మండలం కౌకుంట్లకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు, యువకవి గుముడాల చక్రవర్తిగౌడ్ జిల్లాలోని రాతప్రతులను సేకరించారు. 700 ఏళ్లనాటి రాతప్రతులు జాతీయ రాతప్రతుల సంస్థ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రాచీన రాతప్రతుల గ్రంథాలయం పర్యవేక్షణలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ప్రాచీన రాతప్రతుల సర్వే చేపట్టింది. ఈ క్రమంలోనే నారాయణపేటలో 700 ఏళ్ల క్రితం రాసిన ప్రాచీన రాతప్రతులను ఆ ప్రాంత సమన్వయకర్తగా వ్యవహరించిన కవి చందోజీరావు వెలుగులోకి తెచ్చారు. పేటలోని ధనుంజయ దీక్షితుల ఇంట్లో ఈ ప్రతులు లభించాయి. వీటితోపాటు యాగమంత్రాలు, వేదసంహిత రుగ్వేద సహిత వంటి ఎన్నో విలువైన రాతప్రతులు వెలుగుచూశాయి. అలాగే పాలమూరులో కృష్ణశర్మ నివాసంలో 200లకుపైగా తాళపత్ర గ్రంథాలను సమన్వయకర్త గుముడాల చక్రవర్తిగౌడ్ వెలుగులోకి తెచ్చారు. సారస్వత క్షేత్రం పాలమూరు సాహిత్య రంగానికి పెట్టింది పేరు పాలమూరు జిల్లా. తెలుగు సాహిత్యంలో అనేక లబ్ధప్రతిష్టమైన రచనలు ఇక్కడి నుంచి వెలువడ్డాయి. తెలుగులో మొట్టమొదటి రామాయణమైన రంగనాథ రామాయణం వెలువడింది పాలమూరు నుంచే. గోన బుద్దారెడ్డి, కుప్పాంబిక, అప్పకవి, సురభి మాధవరాయులు, ఏలకూచి బాలసరస్వతి, రాసురాట్క్ రవి, బాలసరస్వతి, బుక్కపట్నం శ్రీనివాసాచార్యులు, కేశవ పంతుల నరసింహశాస్త్రితోపాటు గడియారం రామకృష్ణశర్మ, సురవరం ప్రతాప్‌రెడ్డి, కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, బూర్గుల రామకృష్ణారావు, రుక్పానుపేట రత్నమ్మ, కపిలవాయి లింగమూర్తి వంటి మొదలైన సాహిత్యమూర్తులు ఈ గడ్డకు చెందినవారే. వారంతా అద్భుతమైన కావ్యాలను రచించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. నాటి సంస్థాన కాలం నుంచి నేటి ఆధునిక సాహిత్యం వరకు ఎంతో మంది కవులు, రచయితలు ఆణిముత్యాల్లాంటి పుస్తకాలను వెలువరించారు. జిల్లాలో నెలకోసారి పుస్తకం వెలువరించడం సంప్రదాయంగా వస్తుంది. ఇప్పటికీ వేల సంఖ్యలో పుస్తకాలు వెలువడుతూనే ఉన్నాయి. పుస్తకం.. ఆత్మీయ నేస్తం పుస్తకం మనకో ఆత్మీయ నేస్తం. అదే తోడుంటే ఎంతో మానసిక ధైర్యం ఉన్నట్లే. పుస్తకం మనకో మిత్రుడు, ఒక మార్గదర్శి. పుస్తకాలను నేటితరం యువత చదవడం అలవాటు చేసుకుంటే గొప్ప గొప్ప ఆలోచనలకు పదునుపెట్టి అనేక ఆవిష్కరణలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎంతోమంది ప్రముఖులు పుస్తక జ్ఞానాన్ని సముపార్జించి లబ్ధప్రతిష్టులయ్యారు. పుస్తకమే ఒక విజ్ఞాన సంపద. అందులోని జ్ఞానాన్ని ఆస్వాదిస్తే గొప్ప వ్యక్తులుగా మారే అవకాశం ఉంటుంది. అలాంటి పుస్తకాలను నేటితరం చదివితేనే భవిష్యత్‌కు బంగారు బాట వేసుకోవచ్చు. అందుకే కందుకూరి ‘చినిగిన చొక్కైనా వేసుకో.. ఒక మంచి పుస్తకం కొనుక్కో’ అనే సందేశాన్ని నేటితరం ఆచరిస్తే పుస్తకానికి గౌరవం. సాహిత్య రంగానికి ప్రోత్సాహమేదీ? ప్రస్తుతం సాహిత్య రంగానికి ప్రోత్సాహం కరువైంది. కవి పండితులే తమ రచనలను ముద్రించుకొనేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. సెల్‌ఫోన్, యాంత్రికమైన జీవితానికి అలవాటుపడిన ఈ తరం పుస్తక పఠనంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పిల్లల్లో పుస్తక పఠనాభిలాషను బాల్యం నుంచే అలవర్చాలి. విజ్ఞానం ఎంత ఎదిగినా మన ప్రాచీన సాహిత్య సంపద కాలగర్భంలో కలిసిపోకుండా బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. భాషాభిమానుల సహకారంతో పరిరక్షణకు ముందుకు సాగితే సాంస్కృతిక సాహిత్య సంపదను భావితరాలకు అందించవచ్చు. – గుముడాల చక్రవర్తిగౌడ్, తెలుగు ఉపాధ్యాయుడు, యువకవి, దేవరకద్ర అభిరుచిని పెంపొందించుకోవాలి నేటి ఆధునిక ప్రపంచంలో ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఊపేస్తుంది. ఇంటర్నెట్ ప్రవేశించాక సామాజిక మాధ్యమాల్లో రచనలు విరివిగా వస్తున్నాయి. కానీ, నేటితరం పుస్తకాలకు దూరమవుతున్నారు. మనిషి మానసిక పరిపక్వత చెందాలంటే పుస్తక జ్ఞానం తప్పనిసరి. పుస్తకాలను చదవడం వల్లనే మనిషి అనంతమైన జ్ఞానాన్ని సంపాదించి తన భవిష్యత్‌ను చక్కగా తీర్చిదిద్దుకుంటాడు. నేటితరం పుస్తక ఆవశ్యకతను గుర్తించి పుస్తక అభిరుచి పెంపొందించుకోవాలి. – డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, పాలమూరు సాహితీ అధ్యక్షుడు -
బుక్ సెల్ఫ్
నేడు వరల్డ్ బుక్ డే లంకంత ఇల్లు కట్టుకున్నా రాని ఆనందం లక్షణమైన లైబ్రరీని చూస్తే వస్తుంది అంటారు పుస్తక ప్రియులు. అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లల్లో గాలికే చోటు లేకుంటే ఇక లైబ్రరీలా..? అనే కొందరి ప్రశ్నకు అభిరుచి ఉంటే అన్నీ అవే వస్తాయి అనేది కొందరి సమాధానం. ఈ వాగ్వాదాల సంగతెలా ఉన్నా.. గృహమే కదా పుస్తక సీమ అన్నట్టు హోమ్ లైబ్రరీని ఏర్పాటు చేసుకున్నవాళ్లు సిటీలో చాలా మందే ఉన్నారు. వారిలో ఇద్దరు నగర ప్రముఖులు పంచుకున్న తమ పుస్తక ఖజానాల పఠనాభిరుచుల విశేషాలివి.. ఇంట్రస్ట్ కొద్దీ పోగైన పుస్తకాలే లైబ్రరీని డిమాండ్ చేశాయంటారు యాడ్ కంపెనీ అధినేత , ప్రముఖ చిత్రకారుడు రమాకాంత్. ‘నా దగ్గర వేలాది పుస్తకాలున్నాయి’ అంటూ సంతోషంగా చెబుతారు. అందులో దాదాపు 80 శాతంపైగా చదివేశారు కూడా. ఆరో తరగతిలో ఉన్నప్పుడే 350 పేజీల ‘గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్’ చదవడం ద్వారా చార్లెస్ డికెన్స్ వంటి గొప్ప రచయితను అవగాహన చేసుకోగలిగిన ఆయన ఆ తర్వాత ప్రతి దశలో తన పఠనాభిరుచికి పదును పెట్టుకుంటూనే వచ్చారు. ‘ఇంటర్‌లోనే ఫిలాసఫీ చదవడం మొదలుపెట్టా’నన్నారాయన నవ్వుతూ. ప్రస్తుతం ఉన్న ఫ్లాట్‌లో తన భార్య సాయంతో లైబ్రరీలోని పుస్తకాలను కేటగారికల్‌గా తీర్చిదిద్దుకున్న రమాకాంత్.. కొత్తగా కట్టుకుంటున్న ఇంటిలో తొలి ప్రాధాన్యం లైబ్రరీకే ఇస్తానంటున్నారు. తానే కాదు పరిచయస్తులు ఎవరైనా సరే వచ్చి హాయిగా కొన్ని గంటల పాటు పుస్తకం చదువుకుంటూ కూర్చునేందుకు అనువుగా కొత్త ఇంట్లో ఒక పూర్తిస్థాయి హోమ్ లైబ్రరీ, రీడింగ్హాల్ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. యూరోపియన్ సాహిత్యమంటే ఇష్టపడే రమాకాంత్.. తెలుగులో కృష్ణశాస్త్రి నుంచి శ్రీశ్రీ దాకా విభిన్న శైలులున్న సుప్రసిద్ధ కవులు, రచయితల రచనలన్నీ ఓ పట్టు పట్టేశారు. రైటర్ కావాలనుకుని ఆర్టిస్ట్ అయ్యానంటున్న ఈ చిత్ర‘కాంతి’.. తన చిత్రలేఖన నైపుణ్యానికి సహజంగానే పుస్తక పఠనం దోహదపడిందని చెప్పారు. భవిష్యత్తులో రైటర్‌గా మారి తన కోరిక తీర్చుకోబోతున్న ఈ కాబోయే రచయిత.. చిత్రకళ మీదే తన తొలి రచన ఉంటుందన్నారు. సగటున రోజుకు 50 పేజీలు చదవనిదే నిద్రపోనంటున్న రమాకాంత్.. తన అభిమాన రచయితలు నగరానికి వస్తే కలవకుండా ఉండరు. దృక్పథాన్ని మార్చేసింది.. ‘చిన్నప్పుడు నా కోసం పేరెంట్స్ స్టోరీ బుక్స్ చదివేవారు. అలా నా జీవితంలో భాగమైపోయిన పుస్తకం.. నా జీవితాన్నే మార్చేసింది’ అంటారు సంధ్యారాజు. సంప్రదాయ నృత్యకారిణిగా నగరవాసులకు చిరపరిచితమైన సంధ్యారాజును బిజీ లైఫ్ నుంచి సేదతీర్చేది, పఠనంతో బిజీగా మార్చేదీ తన ఇంట్లో ఉన్న లైబ్రరీ. అమరచిత్రకథ వంటి పుస్తకాలు తన నృత్యసాధనలో సహకరిస్తే, ఇప్పుడు ఇంట్లో ఇచ్చే పార్టీలకు సైతం కొన్ని పుస్తకాలు సహకరించాయంటారు. రిచర్డ్ డాకిన్స్ రాసిన సెల్ఫిష్ బీన్.. తన జీవిత దృక్పథాన్ని అమాంతం మార్చేసిందంటూ కృతజ్ఞతగా చెబుతారు. కార్ల్ సెగాన్ రాసిన కాస్మోస్, కార్ల్ జిమ్మర్ ఎవల్యూషన్.. ఇలా లైఫ్‌ని చూసే తన వ్యూని మార్చిన పుస్తకాల జాబితాలో చేరేవి మరికొన్ని కూడా ఉన్నాయంటారామె. ‘పుస్తకాలు నాకు కాలక్షేపంగా మాత్రమే మిగిలిపోకుండా అంతకు మించినవిగా మారడానికి నేను చదివిన గొప్ప గొప్ప రచనలే కారణం’ అంటారామె. మహాభారతం, రామాయణం వంటివి అద్భుతమైన రీతిలో అందించిన మాధవ్ మీనన్ వంటి భారతీయ రచయితలూ ఆమె ఫేవరెట్ రైటర్స్‌లో ఉన్నారు. తనకే కాదు పక్షులను ఇష్టపడే తన హజ్బెండ్ కోసం, మూడేళ్ల తన కొడుక్కి కావల్సిన పుస్తకాలతో ఎప్పటికప్పుడు లైబ్రరీని అప్డేట్ చేసే సంధ్య.. లేటెస్ట్గా రిలీజైన వాటిలో బెస్ట్ సెల్లర్స్‌ను కొనడం కన్నా బాగా పాపులరైన బుక్స్‌ను తాను ఎంచుకుంటానన్నారు. ఆన్లైన్ ద్వారా కొంటే తక్కువ ధరలోనే నచ్చిన, యూజ్డ్ బుక్స్‌ను సొంతం చేసుకోవచ్చునంటూ బుక్లవర్స్కు సలహా ఇస్తున్నారు. అధికంగా చదివిన చాలా మందికి అనిపించినట్టే సంధ్యారాజు కూడా ప్రస్తుతం పుస్తకం రాయాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే సహజంగానే అది నాట్యానికి సంబంధించిందే. - సత్యబాబు -
పుస్తకాలొచ్చేశాయ్!
రేపు ప్రపంచ పుస్తక దినోత్సవం ‘‘ఈ మధ్య ఏ పుస్తకం చదివారు వదినా?’’ అనే మాట వినక ఎంతకాలమైంది...తనలో తాను అనుకుంది రజనీబాయి. పుస్తకాలు విపరీతంగా చదివే బంగారు కాలం ఒకటి ఉండేది. తాము చదవడమే కాదు పక్కింటి వాళ్లతో కూడా చదివించేవారు. వినోద మాధ్యమాల దెబ్బతో - ‘‘ఈ మధ్య ఏ సీరియల్ చూశావు’’ అనే మాట తప్ప వేరే మాట వినిపించని పరిస్థ్థితిలో పుస్తకపఠనం అనే మంచి అలవాటును తిరిగి కొనసాగించడానికి నడుం బిగించింది కేరళలోని కోజిక్కోడ్‌కు చెందిన రజనీ. చేతి నిండా, బ్యాగు నిండా పుస్తకాలు సర్దుకొని వారంలో ఆరురోజులు ఊరూరూ తిరుగుతుంది. రోజూ పాతిక ఇళ్లకు తక్కువ కాకుండా వెళుతుంది. తన చేతుల్లో ఉన్న పుస్తకాల గురించి చెబుతుంది. కొందరు వారానికి రెండు, కొందరు మూడు పుస్తకాలు తీసుకుంటారు. రజనీని ‘మొబైల్ లైబ్రేరియన్’ అని కూడా పిలుస్తుంటారు. ఆమె దగ్గర ఉన్న పుస్తకాలలో కాలక్షేప సాహిత్యంతో పాటు, సామాజికస్పృహతో కూడిన సాహిత్యపుస్తకాలు కూడా ఉంటాయి. పాఠకుల అభిరుచికి తగ్గ పుస్తకాలను అద్దెకిస్తుంటుంది. పుస్తకాల అద్దె నెలకు 20 రూపాయలు. పుస్తకాల అద్దె ద్వారా నెలకు రూ. 1200 గడిస్తుందామె. ‘‘నాకు వచ్చే ఆదాయం తక్కువ కావచ్చు. తృప్తి మాత్రం చాలా ఎక్కువ’’ అంటుంది రజని చిరునవ్వుతో. అవును కదా!