పుస్తకం.. సమస్త ప్రపంచం | World Book Day Special Story | Sakshi
Sakshi News home page

పుస్తకం.. సమస్త ప్రపంచం

Published Tue, Apr 23 2019 12:48 PM | Last Updated on Tue, Apr 23 2019 12:48 PM

World Book Day Special Story - Sakshi

జిల్లాలో లభించిన తాళపత్ర గ్రంథం

వెలుగు చూసిన.. అపూర్వ సాహిత్య సంపద
దేవరకద్ర రూరల్‌ : ఆధునిక ముద్రణా పరిజ్ఞానం అందుబాటులోకి రాకముందే రచయితలు, కవులు, జానపదకళలను ప్రదర్శించే కళాకారులు, శాస్త్రకారులు తమ రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. తాళపత్రాలు (తాటి ఆకులు) విరివిగా వినియోగించి తమ రచనలను భద్రపరిచారు. వీటితోపాటు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో బంగారు, వెండి, రాగి రేకులు, వస్త్రాలపై అమూల్యమైన సమాచారాన్ని లిఖించి ప్రాచీన భాషకు పట్టం కట్టారు. శిలాశాసనాలకు కొదవేలేదు. అరుదైన చర్మలిఖిత ప్రతి పెబ్బేరు ప్రాంతంలో లభించింది. దేవరకద్ర మండలం కౌకుంట్లకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు, యువకవి గుముడాల చక్రవర్తిగౌడ్‌ జిల్లాలోని రాతప్రతులను సేకరించారు. 

700 ఏళ్లనాటి రాతప్రతులు 
జాతీయ రాతప్రతుల సంస్థ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రాచీన రాతప్రతుల గ్రంథాలయం పర్యవేక్షణలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ప్రాచీన రాతప్రతుల సర్వే చేపట్టింది. ఈ క్రమంలోనే నారాయణపేటలో 700 ఏళ్ల క్రితం రాసిన ప్రాచీన రాతప్రతులను ఆ ప్రాంత సమన్వయకర్తగా వ్యవహరించిన కవి చందోజీరావు వెలుగులోకి తెచ్చారు. పేటలోని ధనుంజయ దీక్షితుల ఇంట్లో ఈ ప్రతులు లభించాయి. వీటితోపాటు యాగమంత్రాలు, వేదసంహిత రుగ్వేద సహిత వంటి ఎన్నో విలువైన రాతప్రతులు వెలుగుచూశాయి.  అలాగే పాలమూరులో కృష్ణశర్మ నివాసంలో 200లకుపైగా తాళపత్ర గ్రంథాలను సమన్వయకర్త గుముడాల చక్రవర్తిగౌడ్‌ వెలుగులోకి తెచ్చారు. 

సారస్వత క్షేత్రం పాలమూరు 
సాహిత్య రంగానికి పెట్టింది పేరు పాలమూరు జిల్లా. తెలుగు సాహిత్యంలో అనేక లబ్ధప్రతిష్టమైన రచనలు ఇక్కడి నుంచి వెలువడ్డాయి. తెలుగులో మొట్టమొదటి రామాయణమైన రంగనాథ రామాయణం వెలువడింది పాలమూరు నుంచే. గోన బుద్దారెడ్డి, కుప్పాంబిక, అప్పకవి, సురభి మాధవరాయులు, ఏలకూచి బాలసరస్వతి, రాసురాట్క్‌ రవి, బాలసరస్వతి, బుక్కపట్నం శ్రీనివాసాచార్యులు, కేశవ పంతుల నరసింహశాస్త్రితోపాటు గడియారం రామకృష్ణశర్మ, సురవరం ప్రతాప్‌రెడ్డి, కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, బూర్గుల రామకృష్ణారావు, రుక్పానుపేట రత్నమ్మ, కపిలవాయి లింగమూర్తి వంటి మొదలైన సాహిత్యమూర్తులు ఈ గడ్డకు చెందినవారే. వారంతా అద్భుతమైన కావ్యాలను రచించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. నాటి సంస్థాన కాలం నుంచి నేటి ఆధునిక సాహిత్యం వరకు ఎంతో మంది కవులు, రచయితలు ఆణిముత్యాల్లాంటి పుస్తకాలను వెలువరించారు. జిల్లాలో నెలకోసారి పుస్తకం వెలువరించడం సంప్రదాయంగా వస్తుంది. ఇప్పటికీ వేల సంఖ్యలో పుస్తకాలు వెలువడుతూనే ఉన్నాయి. 

పుస్తకం.. ఆత్మీయ నేస్తం
పుస్తకం మనకో ఆత్మీయ నేస్తం. అదే తోడుంటే ఎంతో మానసిక ధైర్యం ఉన్నట్లే. పుస్తకం మనకో మిత్రుడు, ఒక మార్గదర్శి. పుస్తకాలను నేటితరం యువత చదవడం అలవాటు చేసుకుంటే గొప్ప గొప్ప ఆలోచనలకు పదునుపెట్టి అనేక ఆవిష్కరణలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎంతోమంది ప్రముఖులు పుస్తక జ్ఞానాన్ని సముపార్జించి లబ్ధప్రతిష్టులయ్యారు. పుస్తకమే ఒక విజ్ఞాన సంపద. అందులోని జ్ఞానాన్ని ఆస్వాదిస్తే గొప్ప వ్యక్తులుగా మారే అవకాశం ఉంటుంది. అలాంటి పుస్తకాలను నేటితరం చదివితేనే భవిష్యత్‌కు బంగారు బాట వేసుకోవచ్చు. అందుకే కందుకూరి ‘చినిగిన చొక్కైనా వేసుకో.. ఒక మంచి పుస్తకం కొనుక్కో’ అనే సందేశాన్ని నేటితరం ఆచరిస్తే పుస్తకానికి గౌరవం.  

సాహిత్య రంగానికి ప్రోత్సాహమేదీ? 
ప్రస్తుతం సాహిత్య రంగానికి ప్రోత్సాహం కరువైంది. కవి పండితులే తమ రచనలను ముద్రించుకొనేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. సెల్‌ఫోన్, యాంత్రికమైన జీవితానికి అలవాటుపడిన ఈ తరం పుస్తక పఠనంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పిల్లల్లో పుస్తక పఠనాభిలాషను బాల్యం నుంచే అలవర్చాలి. విజ్ఞానం ఎంత ఎదిగినా మన ప్రాచీన సాహిత్య సంపద కాలగర్భంలో కలిసిపోకుండా బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. భాషాభిమానుల సహకారంతో పరిరక్షణకు ముందుకు సాగితే సాంస్కృతిక సాహిత్య సంపదను భావితరాలకు అందించవచ్చు. 
– గుముడాల చక్రవర్తిగౌడ్, తెలుగు ఉపాధ్యాయుడు, యువకవి, దేవరకద్ర 

అభిరుచిని పెంపొందించుకోవాలి
నేటి ఆధునిక ప్రపంచంలో ఇంటర్నెట్‌ ప్రపంచాన్ని ఊపేస్తుంది. ఇంటర్నెట్‌ ప్రవేశించాక సామాజిక మాధ్యమాల్లో రచనలు విరివిగా వస్తున్నాయి. కానీ, నేటితరం పుస్తకాలకు దూరమవుతున్నారు. మనిషి మానసిక పరిపక్వత చెందాలంటే పుస్తక జ్ఞానం తప్పనిసరి. పుస్తకాలను చదవడం వల్లనే మనిషి అనంతమైన జ్ఞానాన్ని సంపాదించి తన భవిష్యత్‌ను చక్కగా తీర్చిదిద్దుకుంటాడు. నేటితరం పుస్తక ఆవశ్యకతను గుర్తించి పుస్తక అభిరుచి పెంపొందించుకోవాలి. – డాక్టర్‌ భీంపల్లి శ్రీకాంత్, పాలమూరు సాహితీ అధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement