
ప్రపంచ ప్రఖ్యాత ఆంగ్ల నాటక రచయిత విలియం షేక్స్ పియర్ జయంతి, వర్థంతి రోజైన ఏప్రిల్ 23ని యునెస్కో అంతర్జాతీయ పుస్తక దినోత్సవంగా ప్రకటించింది. ఈ మేరకు 1995 నుంచి ఏటా పుస్తక దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఏటా వంద దేశాల్లో ఈ ఉత్సవం జరుగుతోంది. కుటుంబ సభ్యులు ఆత్మీయులు మరణించిన సందర్భాలలో పుస్తకాలే ప్రియ నేస్తాలై ఆ బాధను మరచిపోవడానికి దోహదపడినట్టు చిలకమర్తి లక్ష్మీనరసింహం తన అనుభవాన్ని వివరించారు.
అక్షర రూపం దాల్చిన ఒక్క సిరాచుక్క లక్ష మదళ్ళను కదిలిస్తుందన్నారు కాళోజీ. భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేడ్కర్ పుస్తకాలు చదివి అపారమైన విజ్ఞానాన్ని సొంతం చేసుకున్నారు. గ్రంథ పఠనానికే అగ్ర తాంబూలం ఇచ్చి, భోజనం చేయడం మర్చిపోయిన సందర్భాలెన్నో ఆయన జీవితంలో ఉన్నాయి. చిరిగిపోయిన వస్త్రాలనైనా ధరించు కానీ, కొత్త పుస్తకం దొరికితే కొనుక్కో అని జార్జి బెర్నార్‌షా, కందుకూరి వీరేశలింగం ఏనాడో సెలవిచ్చారు. అయితే చెడ్డ పుస్తకాలను చదవడం విషం సేవించడంతో సమానమని టాల్‌స్టాయ్ ప్రవచించారు.
(నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం)
వాండ్రంగి కొండలరావు,
పొందూరు, శ్రీకాకుళం ‘ 94905 28730