ఆధారాల మీద కొత్త వెలుగు | Indian libraries are historical matter storages | Sakshi
Sakshi News home page

ఆధారాల మీద కొత్త వెలుగు

Published Thu, Jan 4 2018 1:55 AM | Last Updated on Thu, Jan 4 2018 1:56 AM

Indian libraries are historical matter storages - Sakshi

ఇలాంటి ప్రయత్నం తెలుగు ప్రాంతంలోనే విజయవంతమైంది. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ స్టడీస్, కలకత్తా సంచాలకుడు ఎస్పీ సేన్‌ 1978లోనే చారిత్రక ఆధారాలను పుస్తకంగా తీసుకురావాలని ఒక ప్రయత్నం చేశారు. కానీ అది సఫలం కాలేదు.

భారతదేశంలో చరిత్ర గురించి ఆలోచించేవాళ్లు, చరిత్రకారులు, చరిత్ర ఆధారంగా సృజనాత్మక రచనలు చేసేవారు కూడా పురావస్తు శాఖకు వెళ్లడం కనిపించదని ప్రఖ్యాత చరిత్రకారుడు, రచయిత విలియం డాల్రింపుల్‌ ‘లాస్ట్‌ మొఘల్‌’ పుస్తకం పీఠికలో అంటారు. అది చదివినప్పుడు మనసు చివుక్కుమనే మాట నిజం. కానీ, కాస్త ఆలోచిస్తే అందులో కొంత సత్యం ఉందనే అనిపిస్తుంది కూడా. ఎందుకంటే 20వ శతాబ్దం ఆరంభం నుంచి తెలుగు ప్రాంతాలలోను, భారతదేశంలోను కూడా చరిత్ర రచనకు ఉపక్రమించిన పలువురు మనసావాచా ఆ పనిచేశారు. ఒక ఉదాహరణ: మల్లంపల్లి సోమశేఖరశర్మ ‘రెడ్డి రాజ్యాల చరిత్ర’. లేదా ఇటీవలే వచ్చిన పీవీ పరబ్రహ్మశాస్త్రి ‘కాకతీయులు’గ్రంథం. పరిపూర్ణమైన రీతిలో ఆధారాలను ఉపయోగించుకున్న చరిత్ర రచన ఎంత పరిపుష్టంగా ఉంటుందో ఆ పుస్తకాలు చెబుతాయి. కానీ తరువాత ఇంత ఖ్యాతి ఉన్న రచనలు తక్కువ.

చరిత్ర రచన లేదా నిర్మాణానికి అత్యంత కీలకం– చారిత్రక ఆధారాలే. చారిత్రకత, విశ్వసనీయత ఆ ఆధారాలకు మరింత ముఖ్యం అంటుంది చరిత్రతత్త్వం.  ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర కాంగ్రెస్‌ వెలువరించిన ‘తెలుగు ప్రజల చరిత్ర, సంస్కృతికి ఆధారాలు’చరిత్రకారులనీ, సృజనాత్మక రచనలు చేసేవారిని ముమ్మాటికీ ఆధారాల పట్ల గౌరవం పెంచుకునేటట్టు, అలాంటి బాధ్యత గురించి మరింత అవగాహన పెంచడానికి దోహదం చేస్తుంది.

చారిత్రక ఆధారాలంటే ఏమిటి? ఒక కాలపు చరిత్రను నిర్మించడానికి అనివార్యంగా తీసుకునే ఆ కాలపు ఆధారాలు. శిలాశాసనాలు, నాణేలు, విదేశీ పర్యాటకులరచనలు, పురాతన సాహిత్యం, స్థల పురాణాలు ఆ ఆధారాలను ప్రధానంగా అందిస్తాయి. వీటిలో మళ్లీ ప్రైమరీ అనీ, సెకండరీ అనీ ఉంటాయి. ఇలాంటి ఆధారాల పరంపరను క్రోడీకరించినదే ‘తెలుగు ప్రజల చరిత్ర, సంస్కృతికి ఆధారాలు’.
క్రీస్తుపూర్వం 5000 (చరిత్ర పూర్వయుగం) నుంచి, క్రీస్తుశకం 2016 వరకు జరిగిన చరిత్రకు ఆధారాలను సంపాదకులు, రచయితలు ఈ ఉద్గ్రంథంలో పొందు పరిచారు. అందుకే ఇదొక గొప్ప ప్రయత్నమని చెప్పాలి. పదహారు అధ్యాయాలలో ఈ సమాచారం మొత్తం అందించారు. పురాతన, మధ్య యుగ, ఆధునిక చరిత్రలతో పాటు, సమీప గతానికి చెందిన ఆధారాలను కూడా ఇందులో గమనిస్తాం. ద్రవిడ విశ్వవిద్యాలయం (కుప్పం), పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (హైదరాబాద్‌), ఇతర వదాన్యుల సహాయ సహకారాలతో మొత్తం తొమ్మిది వాల్యూంలలో తెలుగువారి చరిత్రను దాదాపు సంపూర్ణమనదగిన రీతిలో సంకలనం చేశారు. ఆ కృషికి ఈ ఆధారాల వాల్యూం పరాకాష్ట.

చరిత్ర పూర్వయుగం, చరిత్ర ఆరంభ దశ, మధ్య యుగ చరిత్ర ఆరంభ దశ, ముసునూరి నాయకులు, రెడ్డి రాజులు, విజయనగర చరిత్ర, బహమనీలు, కుతుబ్‌షాహీల చరిత్ర, ఆధునిక ఆంధ్ర దేశ చరిత్ర, అసఫ్‌జాహీలు, కోస్తాంధ్ర, రాయలసీమ, హైదరాబాద్‌ స్టేట్, సమకాలీన ఆంధ్రప్రదేశ్, సాహిత్యాధారాలు, జానపద కళలు–సంస్కృతి, కళ–వాస్తు, లలితకళలు అన్న 16 అధ్యాయాలలో చారిత్రక ఆధారాలను విస్తారంగా ఇచ్చారు. అలాగే గ్రంథాలయాలు, ఇండియన్‌ హిస్టారికల్‌ రివ్యూ పత్రికలో అచ్చయిన వ్యాసాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విశ్వవిద్యాలయాల చరిత్ర శాఖలలో జరిగిన కృషి, ఆంధ్రప్రదేశ్‌ ఆర్కైవ్స్‌ ప్రచురణలు, ప్రముఖుల పత్రాలు, నెహ్రూ స్మారక గ్రంథాలయం (ఢిల్లీ) వంటి చోట లభ్యమయ్యే చారిత్రక ఆధారాలు ఏవో కూడా ఇందులో తెలుసుకోవచ్చు. ఇంకా ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర కాంగ్రెస్‌కు సమర్పించిన పత్రాల వివరాలు, తెలుగు పత్రికల జాబితా, గౌతమి గ్రంథాలయంలో లభ్యమవుతున్న గ్రంథాలు, వేటపాలెం సారస్వత నికేతన్‌లోని గ్రంథాల వివరాలు, లండన్‌లోని ఇండియా ఆఫీస్‌ గ్రంథాలయంలో లభించే గ్రంథాల పేర్లు కూడా ఈ వాల్యూంలో ఇచ్చారు. ఆ విధంగా చరిత్ర రచనకు ఈ వాల్యూం చక్కని దిశను చూపిందనే చెప్పవచ్చు. ఎన్‌. చంద్రమౌళి, సి.సోమసుందరరావు, డి. భాస్కరమూర్తి, కె. సూర్యనారాయణ, కేఎస్‌ కామేశ్వరరావు, అబ్దుల్‌ మాజిద్, ఏఆర్‌ రామచంద్రారెడ్డి, వి. లలిత, కనకదుర్గ వంటి చరిత్రకారులు ఈ ఆధారాల వాల్యూం కోసం శ్రమించారు. వకుళాభరణం రామకృష్ణ సంపాదకులుగా వ్యవహరించారు. ఈ పుస్తకాన్ని మండలి వెంకటకృష్ణారావు, పీవీ పరబ్రహ్మశాస్త్రిలకు అంకితం ఇవ్వడం సముచితంగా ఉంది.

మరొక విషయం కూడా తప్పనిసరిగా ప్రస్తావించాలి. ఇలాంటి ప్రయత్నం తెలుగు ప్రాంతంలోనే విజయవంతమైంది. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ స్టడీస్, కలకత్తా సంచాలకుడు ఎస్పీ సేన్‌ 1978లోనే చారిత్రక ఆధారాలను పుస్తకంగా తీసుకురావాలని ఒక ప్రయత్నం చేశారు. కానీ అది సఫలం కాలేదు. ‘సోర్సెస్‌ ఆఫ్‌ ది హిస్టరీ ఆఫ్‌ ఇండియా’పేరుతో ఆయా యుగాలకు అవసరమైన ఆధారాలను సంకలనం చేయడం సేన్‌ ఉద్దేశం. కానీ మొదటి భాగం మాత్రమే ఆయన వెలువరించగలిగారు. 1999లో ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర కాంగ్రెస్‌ తెలుగువారి సమగ్ర చరిత్ర రచనా యజ్ఞానాన్ని ప్రారంభించింది. ఇది 2016కు పూర్తయింది. ఇప్పుడు ‘తెలుగు ప్రజల చరిత్ర, సంస్కృతికి ఆధారాలు’వాల్యూంతో మొదట వచ్చిన వాల్యూమ్‌లకు పరిపూర్ణత చేకూరినట్టయింది. అందులో నిక్షిప్తం చేసిన కొన్నివేల పేజీల చరిత్రకు ఆధారాలు ఈ వాల్యూంలో లభిస్తాయి. ఈ కృషి ఒక అద్భుతం. ఈ భారాన్ని మోసిన చరిత్రకారులందరికీ తెలుగువారు కృతజ్ఞులై ఉండాలి.

(‘తెలుగు ప్రజల చరిత్ర, సంస్కృతికి ఆధారాలు’ పుస్తకం నేడు విజయవాడ పుస్తకోత్సవంలో ఆవిష్కరిస్తున్న సందర్భంగా...ముఖ్యఅతిథి మండలి బుద్ధప్రసాద్‌)
–కల్హణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement