అద్దె భవనాలు.. అరకొర వసతులు
- 30 గ్రంథాలయాలకు సొంత భవనాల్లేవు
- ఇరుకు గదుల్లో ఇబ్బందులు పడుతున్న పాఠకులు
- కదిరిలో ప్రారంభంగాని భవన నిర్మాణం
కదిరి అర్బన్: కార్పొరేట్ కంపెనీలకు స్థలం కావాలంటే రెడ్ కార్పెట్ పరచి వేలాది ఎకరాలను దారాదత్తం చేసే పాలకులు అదే పది మందికీ విజ్ఙానాన్ని పంచే గ్రంథాలయాల నిర్మాణానికి 5 సెంట్ల స్థలం చూపమంటే మాత్రం ముఖం చాటేస్తున్నారు. జిల్లాలో మొత్తం 70 శాఖా గ్రంథాలయాలుంటే అందులో 40 గ్రంథాలయాలకు మాత్రమే పక్కా భవనాలు ఉన్నాయి. మిగిలిన 30 చోట్లా అద్దె భవనాల్లో అరకొర వసతులతో నెట్టుకొస్తున్నారు. అందులో 10 గ్రంథాలయాలకు రెవెన్యూవారు స్థలం కేటాయించగా, భవన నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపుతున్నట్లు గ్రంథాలయ శాఖాధికారులు తెలిపారు.
మిగిలిన వాటికి కూడా స్థలం కేటాయిస్తే భవనాలు నిర్మించి ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని వారు చెబుతున్నారు. కదిరి పట్టణంలోని గ్రంథాలయానికి పక్కాభవనం లేదు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా రెండవ అంతస్తులో అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. అది చిన్నది కావడంతో నిత్యం వందలాదిగా వచ్చే పాఠకులు ఇరుకు గదుల్లో ఇబ్బందులు పడుతూ చదువుకోవాల్సి వస్తోంది. పోటీ పరీక్షలకు ప్రశాంతంగా ప్రిపేర్ కాలేకపోతున్నామని అభ్యర్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడికొచ్చేవారి వాహనాలను నిలుపుకొనేందుకు కూడా సౌకర్యం లేదు. రోడ్డుపైనే నిలిపి రావాల్సి వస్తోంది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది.
నిధులున్నా నిష్ర్పయోజనం
కదిరిలో గ్రంథాలయానికి పక్కా భవనం నిర్మించేందుకు నిధులున్నాయని, స్థలం చూపితే చాలని ఆ శాఖాధికారులు గతంలో ఎన్నోసార్లు చెప్పారు. ఈ క్రమంలో స్థలం కేటాయించాలని విద్యార్థి, ప్రజాసంఘాలు అప్పటి ఆర్డీఓ రాజశేఖర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పక్కన ఉన్న 5 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. కానీ గ్రంథాలయ శాఖాధికారులు భవన నిర్మాణం దిశగా చర్యలు వేగవంతం చేయలేదు.
పదిమంది వస్తే నిండిపోతోంది
గ్రంథాలయంలో నిరంతరం ఏదో విషయం తెలుసుకోవచ్చు. అందుకే విరామ సమయంలో ఇక్కడికి వస్తుంటాను. ఈ భవనం పట్టణ జనాభాకు అనుగుణంగా లేదు. పట్టుమని పదిమంది వస్తే నిండిపోతోంది.
- శంకర్, రిటైర్డ్ డీఎల్‌పీఓ
ప్రశాంతతకు భంగం
ఈ గ్రంథాలయం ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా ఉంది. ఇక్కడ ప్రతిరోజూ ఏదో ఒక ఆందోళన జరుగుతూనే ఉంటుంది. రణగొణధ్వనుల మధ్య ప్రశాంతంగా ఎలా చదువుకోగలం. అన్ని శాఖలకూ పక్కా భవనాలను నిర్మిస్తున్న ప్రభుత్వం గ్రంథాలయాలను విస్మరిస్తోంది.
- మురళీకృష్ణ, పాఠకుడు, కదిరి
ప్రతిపాదనలు పంపాము
కదిరిలో గ్రంథాలయానికి పక్కా భవనం కోసం ప్రతిపాదనలు పంపాం. పై అధికారుల నుంచి అనుమతి రాగానే నిర్మాణం మొదలుపెడతాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో పాఠకులు చదువుకునేలా చూస్తాం.
- లలిత, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి, అనంతపురం