నర్సాపూర్ గ్రంథాలయంలో తడిసి ముద్దగా మారిన పుస్తకాలు
- తడిసి ముద్దవుతున్న గ్రంథాలు
- శిథిలభవనాల్లో పుస్తక భాండాగారాలు
- పట్టించుకోని అధికారులు
నర్సాపూర్: గ్రంథాలయాల నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసింది. నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్న ఎనిమిది గ్రంథాలయాల్లో ఐదింటి భవనాలు శిథిలావస్థకు చేరాయి. కౌడిపల్లిలోని గ్రంథాలయ భవనంలో పంచాయతీ రాజ్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయగా శివ్వంపేటలో భవన నిర్మాణ పనులు 15ఏళ్లుగా కొనసాగుతున్నాయి.
అమలుకు నోచుకోని ఎమ్మెల్యే, జెడ్పీచైర్‌పర్సన్ల హామీ
నర్సాపూర్‌లోని ప్రభుత్వ గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరగా ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి గ్రంథాలయాన్ని సందర్శించి భవనం శిథిలావస్థకు చేరిన గ్రంథాలయాన్ని అద్దె భవనంలోకి మార్చాలని లైబ్రేరియన్‌కు సూచించారు. కొత్త భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తామని, అంతవరకు అద్దె భవనంలో నిర్వహించాలని, అద్దె తామే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. వారు హామీ ఇచ్చి 22 నెలలు గడుస్తున్నా ఇంత వరకు గ్రంథాలయాన్ని అదే భవనంలో కొనసాగిస్తున్నారు.
దీంతో భవనం మరింత శిథిలం కావడంతో ఎప్పుడు కూలుతుందోనని పాఠకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా భవనంలోని రీడింగ్ గది పైకప్పు పెచ్చులూడి ఇనుప చువ్వలు బయటకు రావడంతో పాటు అంతటా ఉరుస్తున్నందున ఆ గదిని మూసేసి చిన్న పాటి గదిని రీడింగు రూంగా ఏర్పాటు చేశారు.
గది ఉరుస్తున్నందున పుస్తకాలు తడవడంతో కొన్ని పుస్తకాలను బస్తాల్లో ఉంచి అటకపై పెట్టగా అక్కడ సైతం వర్షం నీరు పడడంతో పుస్తకాలు తడిసి చెదలు పడుతున్నాయని తెలిసింది. గ్రంథాలయంలో సుమారు 50వేల రూపాయల విలువ చేసే పుస్తకాలు తడిసి ముద్దయినట్లు తెలిసింది.
వెల్దుర్తిలో రెండు భవనాలు శిథిలావస్థకు
వెల్దర్తి మండలంలో రెండు గ్రంథాలయాలు ఉండగా రెండూ శిథిలావస్థకు చేరాయి. వెల్దుర్తిలో గ్రంథాలయాన్ని గ్రామ పంచాయితీ భవనంలోని ఒక గదిలో నిర్వహిస్తుండగా ఆ గది శిథిలావస్థకు చేరింది. 1988లో నిర్మించిన మాసాయిపేట గ్రంథాలయం శాశ్వత భవనంలో కొనసాగుతున్నా శిథిలావస్థకు చేరింది.
రంగంపేటలో అధ్వానం
కొల్చారం మండంలం రంగంపేటలో గ్రంథాలయం అధ్వానంగా ఉన్న గదిలో కొనసాగుతోంది. గ్రామ పంచాయితీ కార్యాలయానికి చెందిన ఓ గదిలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయగా అది శిథిలావస్థకు చేరింది. కాగా కొల్చారంలోని గ్రంథాలయానికి పక్కా భవనం ఉన్నా పుస్తకాల సంఖ్యను పెంచాలని పాఠకులు కోరుతున్నారు.
గ్రంధాలయ భవనం మరో శాఖకు కేటాయింపు
కౌడిపల్లిలో గ్రంథాలయ నిర్వహణ పట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు చిన్న చూపు చూస్తున్నారు. గ్రంథాలయ భవనాన్ని ఇతర శాఖకు కేటాయించడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. కౌడిపల్లిలో గ్రంథాలయం కోసం ఆరు నెలల క్రితం నిర్మించిన భవనాన్ని పంచాయితీ రాజ్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయానికి కేటాయించి గ్రంథాలయాన్ని గ్రామంలోని కమ్యూనిటీ హాలులో కొనసాగిస్తున్నారు. కాగా కమ్యూనిటీ హాలులో కరెంటు లేకపోవడంతో సాయంత్రం పూట పాఠకులు ఇబ్బందులు ఎదుర్కొటున్నారు.
శివ్వంపేటలో 15 ఏళ్లుగా నిర్మాణం
మండల కేంద్రమైన శివ్వంపేటలో గ్రంథాలయ భవన నిర్మాణ పనులు సుమారు 15 ఏళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. రెండేళ్లుగా పనులు పూర్తిగా నిలిచిపోయాయి. భవన నిర్మాణ పనులు నత్త నడకన సాగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. హత్నూరలో ఉన్న ప్రభుత్వ గ్రంథాలయానికి సొంత భవనం ఉన్నా నిధులు తక్కువగా మంజూరు కావడంతో పత్రికలు కూడా తక్కువ సంఖ్యలో వస్తున్నాయని పాఠకులు కోరుతున్నారు.