పుస్తకాల ర్యాక్‌కు రంగులు వేస్తున్న నారంగ్ మీనా
తెలుగు రాష్ట్రాలలో గ్రంథాలయాలు, పుస్తక పఠనం ఆదరణ కోల్పోతుంటే ‘సెవన్ సిస్టర్స్’గా పిలువబడే ఈశాన్య రాష్ట్రాల్లో ‘రోడ్‌సైడ్ లైబ్రరీ’ల ఉద్యమం ఊపందుకుంది. మిజోరామ్‌లో మొదలైన రోడ్‌సైడ్ లైబ్రరీలు ఇప్పుడు అరుణాచల్‌ప్రదేశ్‌కు పాకాయి. నారంగ్ మీనా అనే గిరిజన స్కూల్ టీచర్ అక్కడ ‘వైన్ షాపుల కంటే గ్రంథాలయాలే ఎక్కువ కనపడేలా చేస్తాను’ అంటూ ప్రతిన బూని పని చేస్తోంది. ‘మా అమ్మ నిరక్షరాస్యతే నాకు చదువు అవసరాన్ని తెలియచేసింది’ అని ఆమె అంటోంది. నెల క్రితం వార్తల్లో వచ్చిన మీనా నేడు ఏ విధంగా ఉద్యమాన్ని విస్తరిస్తున్నదో తెలిపే కథనం...
రోడ్డు పక్కన పూల చెట్లు కనిపించడం బావుంటుంది. కాని ఆ చెట్లకు పుస్తకాలు కాయడం ఇంకా బాగుంటుంది. ఈశాన్యరాష్ట్రాల్లో కొసాకు ఉండే అరుణాచల్ ప్రదేశ్‌లో వీధిలో నడుస్తుంటే లైబ్రరీలు కనిపించే ఉద్యమం మొదలైంది. రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో ఒక పుస్తకాల అర, రెండు బల్లలు, రాత్రి పూట చదువుకోవడానికి రెండు లైట్లు... దీనిని ‘రోడ్‌సైడ్ లైబ్రరీ’ అంటారు. అక్కడ ఎంతసేపైనా కూచుని పుస్తకం చదువుకోవచ్చు. నచ్చిన పుస్తకం పట్టుకుపోవచ్చు. ఇంట్లో తాము చదివేసిన పుస్తకాలను తెచ్చిపెట్టవచ్చు. గొప్ప మెదళ్లు రెండు చోట్ల తయారవుతాయి. ఒకటి తరగతి గదిలో. రెండు గ్రంథాలయంలో. గొప్ప వ్యక్తిత్వాలు కూడా ఈ రెండుచోట్లే రూపు దిద్దుకుంటాయి. ఆ విషయాన్ని కనిపెట్టింది ఇటానగర్‌కు చెందిన నారంగ్ మీనా అనే గవర్నమెంట్ స్కూల్ టీచర్. వెనుకబడిన తన రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మహిళలు చైతన్యవంతం కావాలంటే లైబ్రరీలే మార్గం అని ఆమె రోడ్‌సైడ్ లైబ్రరీల ఉద్యమం మొదలెట్టింది. చదవండి: (వీధిలో విజ్ఞాన వెలుగులు)
నారంగ్ మీనా ఏర్పాటు చేసిన రోడ్ సైడ్ లైబ్రరీలు
గ్రంథాలయం మనసుకు చికిత్సాలయం
‘ఏ లైబ్రరీ ఈజ్ ఏ హాస్పిటల్ ఫర్ ది మైండ్’ అని ఉంటుంది మీనా నిర్వహిస్తున్న ‘నారంగ్ లెర్నింగ్ సెంటర్’ ఫేస్‌బుక్ పేజీలో. నాలుగేళ్ల క్రితం మీనా అరుణాచల్ ప్రదేశ్‌లోని గిరిజన మహిళలు తమ స్వావలంబన కోసం వివిధ ఉపాధి మార్గాలలో నైపుణ్యం పొందే నురంగ్ లెర్నింగ్ సెంటర్‌ను స్థాపించింది. దాని కార్యకలాపాల్లో భాగంగా రోడ్‌సైడ్ లైబ్రరీల స్థాపన మొదలెట్టింది. మొదటి లైబ్రరీ నెల క్రితం అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ నుంచి గంట దూరంలో ఉండే నిర్జులి అనే ఊళ్లో ఒక రోడ్డు పక్కన స్థాపించింది. ‘దాని కోసం నేను 20 వేల రూపాయలు ఖర్చు చేశాను. పది వేల రూపాయలు పుస్తకాలకు, పదివేలు స్టాండ్ తయారీకి’ అని నారంగ్ మీనా చెప్పింది. ‘మిజోరంలో ఇద్దరు అధ్యాపకులు (సి.లాంజువాలా, లల్లైసంగ్జూలీ) రోడ్‌సైడ్ లైబ్రరీలను స్థాపించారు. వారు అమెరికాలో ఇలాంటి లైబ్రరీలు చూసి స్ఫూర్తి పొందారు. వాటికి వచ్చిన ఆదరణ చూసి నేను ప్రేరణ పొందాను’ అని మీనా అంది.
మంచి వైపు లాగడానికి
‘మేము పిల్లలకు చాక్లెట్‌లు ఇచ్చి వాళ్లను ఆకర్షించాము. కాని పెద్దలను లాక్కురావాలంటే పెద్ద పనే అయ్యింది’ అని నవ్వుతుంది మీనా. కాని మెల్లగా పెద్దలు కూడా వచ్చి కూచుంటున్నారు. ‘మా నాన్న రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండేవారు. కాని ప్రత్యర్థులు ఆయనను హత్య చేశారు. మా అమ్మ నిరక్షరాస్యురాలు. 13 ఏటే పెళ్లి చేసుకొని బాదరబందీల్లో ఇరుక్కుంది. నేను, నా చెల్లెలు బాగా చదువుకున్నాం. బెంగళూరులో చదివాక అమెరికా వెళ్లే వీలున్నా నా ప్రాంతానికి ఏదైనా చేయాలని వెనక్కి వచ్చాను. చూస్తే దారుణమైన వెనుకబాటుతనం. అవినీతి. విలువల్లేనితనం కనిపించాయి. విలువలు ఎక్కడి నుంచి వస్తాయి? పుస్తకాలు చదవకుండా వీళ్లు ఏం తెలుసుకుంటారు’ అనిపించి రోడ్‌సైడ్ లైబ్రరీ స్థాపించాను అందామె.
వైన్‌షాపులు కాదు కావాల్సింది
‘వీధికొక వైన్‌షాప్ కాదు కావాల్సింది. లైబ్రరీ. మా రాష్ట్రంలో వైన్‌షాప్స్‌కు మించి లైబ్రరీలు కనిపించాలనేదే నా తపన.’ అందామె. నారంగ్ మీనా ప్రయత్నం దేశంలోనే కాదు విదేశాలలో కూడా ప్రచారం పొందింది. ఆమె లెర్నింగ్ సెంటర్‌కు కేరళ నుంచి పంజాబ్ వరకు ఎందరో రచయితలు, పుస్తక ప్రేమికులు పుస్తకాల బండిల్స్ పంపుతున్నారు. ‘మీ లైబ్రరీల్లో వీటిని ఉపయోగించుకోండి’ అని కోరుతున్నారు. నారంగ్‌కు తానేం చేస్తున్నదో స్పష్టత ఉంది. ‘మా రాష్ట్రంలో తిరప్ జిల్లా అత్యంత వెనుకబడిన ప్రాంతం. రోడ్‌సైడ్ లైబ్రరీలు ఎక్కువ కావాల్సింది అక్కడే. అక్షరాస్యతను పెంచాలన్నా చదువు మీద ఆసక్తి కలగాలన్నా లైబ్రరీలు కళ్ల ముందు కనిపిస్తూ ఉండాలి. నేను ఆ ప్రాంతం మీద ఫోకస్ పెట్టాను’ అంది నారంగ్.
వాక్యం రాయలేని విద్యార్థులు
‘నేను టీచర్‌గా మా విద్యార్థులను చూస్తున్నాను. సొంతగా వాక్యం రాయడం రావడం లేదు. పుస్తకాలు చదవకుండా వీరికి భాష ఎలా తెలుస్తుంది. వ్యక్తీకరణ ఎలా పట్టుబడుతుంది? పుస్తకం చదవకపోతే మాతృభాషను కూడా కోల్పోతాం. తల్లిదండ్రులు పిల్లలను పుస్తకాలు చదవడానికి ప్రోత్సహించాలి. ఇందుకు గట్టిగా ప్రయత్నించాలి’ అంటుంది నారంగ్. ఆమెలాంటి వారు ఈ దేశానికి గట్టిగా వంద మంది చాలు... పుస్తకాల చెట్లు వీధి వీధిన మొలవడానికి. ఈశాన్యరాష్ట్రాల ఉద్యమం దేశమంతా పాకాలని కోరుకుందాం.
– సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment