ఎయిర్ ఏషియా ప్రమాదం: మృతదేహాలు లభ్యం
ఎయిర్ ఏషియా విమానం కూలిపోయినట్లు ఇండోనేషియా ప్రభుత్వం నిర్ధారించిన కొద్దిసేపటికే.. ఆ ప్రాంతంలోనే కొన్ని మృతదేహాలు సముద్రంలో తేలియాడుతున్నాయని, వాటిని స్వాధీనం చేసుకున్నామని ఇండోనేసియా అధికారులు తెలిపారు. మృతదేహాలు బాగా ఉబ్బినా.. అవి పాడవ్వలేదని, వాటిని ఇండోనేషియా నౌకాదళానికి చెందిన ఓ నౌక నుంచి తీరానికి తీసుకొచ్చామని నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ డైరెక్టర్ ఎస్.బి. సుప్రియాదీ తెలిపారు.
విమానం రాడార్ పరిధినుంచి తప్పిపోయిన ప్రాంతానికి సరిగ్గా పది కిలోమీటర్ల దూరంలో విమాన శకలాలను తొలుత గుర్తించారు. వెంటనే ఆ ప్రాంతంలో గాలింపు ముమ్మరం చేయగా.. కొన్ని మృతదేహాలు కూడా కనిపించాయి. దాంతో విమానం సముద్రంలోనే కూలిపోయిందని స్పష్టంగా తెలిసింది. ఇక ప్రమాదంలో మొత్తం విమానంలో ఉన్న 162 మందీ మరణించారా.. లేక ఎవరైనా ప్రమాదం బారి నుంచి బయటపడ్డారా అనే విషయం మాత్రం నిర్ధారణ కావాల్సి ఉంది.