
ఎయిర్ ఏషియా కుంభకోణం: చంద్రబాబు, అశోక్ గజపతిరాజు, టోనీ ఫెర్నాండెజ్, మిట్టూ శాండిల్య
సాక్షి, హైదరాబాద్: ‘‘అక్రమ మార్గంలో ఏ పని జరగాలన్నా ఆయనను కలిస్తే సరిపోతుంది.. ఆయన అవినీతి ప్రపంచ స్థాయికి చేరింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలోనే అతిపెద్ద దళారీ చంద్రబాబు నాయుడే. ఓట్లు వేసిన ప్రజల్ని దారుణంగా వంచించిన ఆయన.. పక్కరాష్ట్రాలకు వెళ్లి ఏపీ పరువు తీస్తున్నారు..’’ అంటూ ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రి తీరును తూర్పారపట్టారు వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి. ఎయిర్ ఏషియా కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పేర్లు బయటపడటంతో వారి అవినీతి స్థాయి ఏమిటో మరోసారి బట్టబయలైందని అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. (ప్రధాన వార్త: చంద్రబాబు అవినీతి ‘ఆకాశయానం’!)
‘‘చంద్రబాబు అవినీతి సామ్రాజ్యం ఎంతదాకా విస్తరించిందో ఎయిర్ ఏషియా కుంభకోణంతో మరోసారి బయటపడింది. అక్రమ మార్గాల్లో ఆయన చేయలేని పనులంటూ లేవని రుజువులు దొరికాయి. ఇంత పెద్ద కుంభకోణం జరిగినా ఎల్లో మీడియా మాత్రం మౌనంగా ఉండటం గమనార్హం. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు మహిళా లోకాన్ని అవమానించేలా మాట్లాడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 600 హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. పెట్రోల్‌పై వ్యాట్ పేరుతో వాహనదారుల నడ్డివిరుస్తున్నారు. గిట్టుబాటు ధర రానీయకుండా రైతులను దగాచేస్తున్నారు..’’ అని భూమన అన్నారు.
ఎయిర్ ఏషియా కుంభకోణానికి సంబంధించి ఆంగ్ల పత్రిక బిజినెస్ టుడే ప్రచురించిన కథనం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్‌కు అదే సంస్థకు చెందిన ఇండియా సీఈఓ మిట్టూ శాండిల్యకు మధ్య జరిగిన సంభాషణలో చంద్రబాబు దళారీల వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది. అంతర్జాతీయంగా కలకలం రేపుతోన్న ఈ ఉదంతంపై టీడీపీతోపాటు పచ్చ మీడియా సైతం కిమ్మనకుండా ఉండిపోయంది. (ప్రధాన వార్త: చంద్రబాబు అవినీతి ‘ఆకాశయానం’!)
మీడియాతో మాట్లాడుతున్న భూమన
Comments
Please login to add a commentAdd a comment