172 ఎయిర్బస్ విమానాల కొనుగోలు
ఎయిర్‌బస్‌తో ఎయిర్ ఏషియా, గో ఎయిర్ ఒప్పందం
ఫార్న్‌బరో: విమానయాన సేవలకు గిరాకీ నేపథ్యంలో బడ్జెట్ ఎయిర్‌లైన్ సంస్థ ఎయిర్ ఏషియా తోపాటు తక్కువ ధరల విమానసేవల సంస్థ గో ఎయిర్ భారీ ఎత్తున ఎయిర్‌బస్ విమానాల కొనుగోలుకు ముందుకు వచ్చాయి. ఈ మేరకు ఈ సంస్థలు ఎయిర్‌బస్ కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇంగ్లండ్‌లోని ఫార్న్‌బరోలో జరుగుతున్న ఎయిర్‌షో కార్యక్రమం ఇందుకు వేదికగా నిలిచింది.
ఎయిర్ ఏషియా 100 విమానాలు
ఎయిర్ ఏషియా సంస్థ 100 ఎయిర్‌బస్ ఏ321 నియో మోడల్ విమానాలను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది. ఇందుకు 1260కోట్ల అమెరికన్ డాలర్లు (రూ.84,420కోట్లు సుమారు) ఖర్చు చేయనుంది. ఇందులో ఒకే తరగతిలో 236 మంది ప్రయాణించడానికి వీలుంటుంది. తాజా కొనుగోలుతో కలిపి చూస్తే... ఎయిర్ ఏషియా ఇప్పటి వరకు మొత్తం 575 ఏ320 విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. వీటిలో 170 విమానాలను ఎయిర్‌బస్ అందించింది.
గో ఎయిర్ 72 విమానాలు
గో ఎయిర్ సంస్థ కూడా తన సేవల విస్తరణకు వీలుగా ఎయిర్‌బస్ 72 ఏ320 నియో మోడల్ విమానాల కొనుగోలుకు అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం విలువ 770 కోట్ల డాలర్లు (రూ.51,590 కోట్లు సుమారు). దీంతో వాడియా గ్రూపునకు చెందిన గో ఎయిర్ మొత్తం 144 ఎయిర్‌బస్ విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నట్టు అయింది.