మళ్ళీ ఎయిర్‌బస్ బస | Tata's airline JVs to use Airbus A320 passenger planes | Sakshi
Sakshi News home page

మళ్ళీ ఎయిర్‌బస్ బస

Published Thu, Mar 13 2014 12:47 AM | Last Updated on Sun, Sep 2 2018 3:57 PM

మళ్ళీ ఎయిర్‌బస్ బస - Sakshi

మళ్ళీ ఎయిర్‌బస్ బస

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డాలరు బలపడటం, ఆర్థిక మందగమనం వంటివి కొత్త విమానాల ఆర్డర్లపై ఎటువంటి ప్రభావం చూపలేదని విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ ప్రకటించింది. దేశీయ విమానరంగం వేగంగా విస్తరిస్తుండటంతో విమానాలకు డిమాండ్ బాగుందని ఎయిర్‌బస్ మార్కెటింగ్ హెడ్ (ఆసియా) జూస్ట్ వాన్ డెర్ హెయిజ్‌డెన్ తెలిపారు. ఇండియా ఏవియేషన్ 2014  ప్రదర్శన సందర్భంగా కలసిన విలేకరులతో జూస్ట్ మాట్లాడుతూ ఇండియా నుంచి ఇప్పటి వరకు మొత్తం 600 విమానాలకు ఆర్డర్లు రాగా అందులో 234 డెలివరీ చేసినట్లు తెలిపారు. ఇందులో ఇండిగో అత్యధికంగా 280 విమానాలకు, గోఎయిర్, ఎయిర్ ఇండియా 90కిపైగా ఆర్డర్లు ఇచ్చినట్లు జూస్ట్ వివరించారు. ఇండియాలో ఏ-330, ఎ-320 రకం విమానాలకు డిమాండ్ అధికంగా ఉందని, ఇక్కడ ఎగురుతున్న విమానాల్లో సగం ఎయిర్‌బస్‌వేనని పేర్కొన్నారు.

 ఇరవైలో ఒక్కరే ఎగురుతున్నారు
 120 కోట్లకు పైగా జనాభా కలిగిన ఇండియాలో విమానంలో ప్రయాణిస్తున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని జూస్ట్ తెలిపారు. చైనాలో ప్రతి నలుగురిలో ఒకరు విమానంలో ప్రయాణిస్తుంటే ఇక్కడ ఇరవై మందిలో ఒక్కరు మాత్రమే ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. ఇండియాలో మధ్యతరగతి ప్రజల సంఖ్య వేగంగా పెరుగుతుండటమే కాకుండా తలసరి ఆదాయం, జీడీపీ వృద్ధి చెందుతుండటంతో విమానయాన రంగానికి మంచి అవకాశాలున్నాయన్నారు. ముఖ్యంగా చిన్న పట్టణాలకు డిమాండ్ పెరుగుతున్నట్లు చెప్పారు.

 భారీ విహంగానికి టైమ్ పడుతుంది
 దేశంలో అతిపెద్ద విమానంగా పేరొందిన ఏ-380కి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్నట్లు జూస్ట్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 20 సంస్థల నుంచి 324 విమానాలకు ఆర్డర్లు వచ్చినట్లు తెలిపారు. ఏ-380కి సంబంధించి  ఇండియా నుంచి ఇంత వరకు ఒక్క ఆర్డరు కూడా రాలేదని, దీనికి ఇంకా సమయం పడుతుందన్నారు.
 
 ఏవియేషన్ షోకు ఎయిర్‌బస్ ఏ380
   ప్రపంచంలోనే అతిపెద్దది; సీట్లు 517
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలో అతిపెద్ద విమానం ఎయిర్‌బస్ ఏ380-800 హైదరాబాద్ వచ్చింది. విమాన సేవల సంస్థ ఎమిరేట్స్ ఈ లోహ విహంగాన్ని ఏవియేషన్ షో కోసం బుధవారం తీసుకొచ్చింది. ప్రయాణికుల విమానాల్లో ప్రపంచంలో ఇదే అతి పెద్దది. రెండంతస్తులుగా సీటింగ్ ఉంటుంది. బేస్ ఫ్లోర్‌లో 427 (ఎకానమీ క్లాస్) సీట్లున్నాయి. పై అంతస్తులో బిజినెస్ క్లాస్ 76, ఫస్ట్ క్లాస్‌లో (సూట్స్) 14 సీట్లు ఉన్నాయి. దీని ఖరీదు మన కరెన్సీలో రూ.2,500 కోట్లపైనే. ఎక్కడా ఆగకుండా 15,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.  

 సూట్ ప్రత్యేకతే వేరు..
 పై అంతస్తులో 14 ఫస్ట్ క్లాస్ సీట్లున్నాయి. ఏకాంతం కోసం స్లైడింగ్ డోర్ ఉంది. ప్రతీ సీటుకు మినీ బార్, అడ్జస్టబుల్ లైటింగ్, పెద్ద టీవీ ఉంది. 1,600 చానెళ్లను వీక్షించవచ్చు. పడుకోవాలంటే సీటు కాస్తా బెడ్‌గా మారిపోతుంది. సీట్లను అడ్జస్ట్ చేసుకోవడానికి బటన్ నొక్కితే చాలు. ఇందుకోసం టచ్ స్క్రీన్ కంట్రోలర్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడికైనా మాట్లాడుకునే శాటిలైట్ ఫోన్ ఉంది. ముందున్న టచ్ స్క్రీన్‌లో ఇ-మెయిల్, ఎస్‌ఎంఎస్ పంపుకోవచ్చు. ప్రయాణికులు తమ సొంత ఫోన్లను కూడా వినియోగించవచ్చు. విమానం మొత్తం వైఫై కనెక్ట్ అయి ఉంది. పానీయాల కోసం ప్రత్యేకంగా బార్ ఉంది. సమావేశాల కోసం రెండు లాంజెస్ ఉన్నాయి.

 125 విమానాలు..
 ప్రస్తుతం ఏ380 మోడల్‌కు చెందిన 125 విమానాలు వివిధ దేశాల్లో సేవలందిస్తున్నాయి. మరో 324 విమానాలకు ఆర్డరు ఉందని ఎయిర్‌బస్ మార్కెటింగ్ మేనేజర్ క్లాడీ డెబ్యూక్వెన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. భారత్‌లో హైదరాబాద్‌లోని శంషాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయాలు మాత్రమే ఏ380 దిగేందుకు అనువైనవి. బ్యాంకాక్ నుంచి దుబాయి వెళ్తున్న ఎమిరేట్స్ ఏ380 విమానం 2011 అక్టోబరు 23న శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ అయింది. 2008లో హైదరాబాద్‌లో జరిగిన ఎయిర్‌షోలో ఇక్కడి వారిని తొలిసారిగా కనువిందు చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement