ఎయిర్ ఏషియా ఎగిరింది..
- విమానయాన సేవలు షురూ..
- తొలి ఫ్లయిట్ బెంగళూరు నుంచి టేకాఫ్
బెంగళూరు: దేశంలో ఎయిర్ ఏషియా విమాన సేవలు గురువారం మొదలయ్యాయి. తొలి విమాన సర్వీసును బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నుంచి గోవాకు నడిపారు. మలేసియా కేంద్రంగా పనిచేస్తున్న ఆసియాలోనే అతిపెద్ద బడ్జెట్ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా భారతీయ విభాగమే ఎయిర్ ఏషియా ఇండియా. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఈ రంగంలోకి ఎయిర్ ఏషియా ప్రవేశంతో ధరల పోరు తీవ్రతరం కానుంది. ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్ తర్వాత దేశంలో చౌకగా విమాన సేవలందించే కంపెనీగా ఎయిర్ ఏషియా ఆవిర్భవించింది.
ప్రారంభ ఆఫరుగా బెంగళూరు - గోవా టికెట్‌ను రూ.990గా ప్రకటించారు. అందుబాటు ధరలో విమాన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం, విమానంలో ప్రయాణించే అవకాశాన్ని భారతీయులందరికీ కల్పించడమే తమ లక్ష్యమని ఎయిర్ ఏషియా ఇండియా సీఈఓ మిట్టు చాండిల్య మీడియాకు తెలిపారు. మార్కెట్ రేట్లతో పోలిస్తే తమ చార్జీలు 35 శాతం తక్కువగా ఉంటాయని చెప్పారు. స్థిరమైన కార్యకలాపాల ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తామనేది తమ విశ్వాసమనీ, అందుకే చార్జీలను మరింత తగ్గించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.డీజీసీఏ గణాంకాల ప్రకారం.. స్థానిక మార్కెట్లో 31.6% వాటాతో ఇండిగో అగ్రస్థానంలో ఉంది. జెట్‌ఎయిర్‌వేస్-జెట్‌లైట్ 21.8%, ఎయిర్‌ఇండియా 18.3%, స్పైస్‌జెట్ 17.9%, గోఎయిర్ 9.5% మార్కెట్ వాటాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఎయిర్ ఏషియాపై స్వార్థశక్తుల పన్నాగం: టాటాసన్స్
న్యూఢిల్లీ: చౌక ధరలకే విమాన సేవలను అందించే ఎయిర్ ఏషియా కార్యకలాపాలను అడ్డుకోవడానికి కొన్ని స్వార్థశక్తులు యత్నిస్తున్నాయని ఈ సంస్థ వాటాదారు టాటా సన్స్ ఆరోపించింది. దేశంలో ఎయిర్ ఏషియా సర్వీసులు గురువారం ప్రారంభమైన కొద్దిసేపటికే టాటా సన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘బీజేపీ నాయకుడు డాక్టర్ సుబ్రమణ్యస్వామి ఎయిర్ ఏషియాపై చేసిన ఆరోపణలు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయి.
విమాన ప్రయాణికులకు ప్రయోజనం కలిగించే స్వేచ్ఛాయుత, న్యాయబద్ధమైన పోటీని వ్యతిరేకిస్తున్న కొన్ని శక్తులు ఎయిర్ ఏషియా కార్యకలాపాలకు భంగం కలిగేలా దుష్ర్పచారం సాగిస్తున్నాయి’ అని టాటా సన్స్ ఘాటుగా విమర్శించింది. భారత్‌లో విమాన సేవలు ప్రారంభించడానికి ప్రభుత్వం నుంచి, డీజీసీఏ నుంచి అన్ని అనుమతులూ పొందామని ఉద్ఘాటించింది.
స్వామి తో పాటు మరికొందరు కోర్టును ఆశ్రయించినప్పటికీ కార్యకలాపాల నిలిపివేతకు ఇంజంక్షన్ ఉత్తర్వులేమీ రాలేదని పేర్కొంది. ఢిల్లీ హైకోర్టుకు ఈ విషయంపై పూర్తి అవగాహన ఉందనీ, న్యాయస్థానం ఆదేశాలను తాము, ఎయిర్ ఏషియా ఇండియా గౌరవిస్తామనీ టాటా సన్స్ తెలిపింది. కాగా, ఎయిర్ ఏషియా వ్యవహారం కోర్టులో ఉందనీ, కనుక ఆ సంస్థకు అనుమతి మంజూరు చేయవద్దంటూ ఎన్నికల సంఘం, డీజీసీఏకు, పౌర విమానయాన శాఖకు డాక్టర్ స్వామి గతంలో ఫిర్యాదు చేశారు.