ఎయిర్ ఏషియా 50 లక్షల ఉచిత సీట్లు
ముంబై: మలేసియాకు చెందిన చౌక ధరల విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా 50 లక్షల ఉచిత సీట్లను(హోటల్ ప్యాకేజీతో కలుపుకుని) ఆఫర్ చేస్తోంది. దీంతో పాటు కౌలాలంపూర్ నుంచి ఎంపిక చేసిన రూట్లలో 18 లక్షల ప్రమోషనల్ సీట్లను చౌక ధరల్లో ఆఫర్ చేస్తున్నామని కంపెనీ పేర్కొంది. ఈ ఆఫర్‌కు బుకింగ్స్ సోమవారం నుంచే ప్రారంభమయ్యాయని, మార్చి 2 వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకూ చేసే ప్రయాణాలకు ఆఫర్ వర్తిస్తుందని వివరించింది. కోచి, కోల్‌కతా, తిరుచిరాపల్లి, చెన్నై, బెంగళూరుల నుంచి కౌలాలంపూర్‌కు చార్జీరూ.6,999గా ఆఫర్ చేస్తున్నామని పేర్కొంది.
ఇక చెన్నై-బ్యాంకాక్ సెక్టర్ చార్జీలు రూ.7,999 అని వివరించింది. ఉచిత సీట్ల ఆఫర్ కింద చౌక ధరలకే విమాన ప్రయాణాన్ని చేసే అవకాశం అందిస్తున్నామని ఎయిర్ ఏషియా గ్రూప్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్, సీగ్‌ట్రాండ్ టెహ్ పేర్కొన్నారు. తమ వెబ్‌సైట్, లేదా ఐఫోన్, ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ జెడ్ 10, విండోస్ ఫోన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఎయిర్‌ఏషియా మొబైల్ యాప్‌లతో టికెట్లను బుక్ చేయవచ్చని వివరించింది. కాగా ఈ సంస్థ దేశీయ కార్యకలాపాల కోసం దరఖాస్తు చేయడం తెలిసిందే.