మరెన్నో టేకాఫ్‌లకు చాన్స్..
బెంగళూరు: జనాభాతోపాటు, టూరిజం పరిశ్రమను పరిగణనలోకి తీసుకుంటే దేశీ విమానయాన రంగంలో భారీ అవకాశాలున్నాయని ఎయిర్ ఏషియా గ్రూప్ సీఈవో టోనీ ఫెర్నాండెజ్ పేర్కొన్నారు. టూరిజంకున్న అవకాశాలతో పోలిస్తే ఈ రంగం చాలా వెనకబడి ఉన్నదని చెప్పారు. వెరసి నాలుగో బడ్జెట్ విమానయాన సంస్థకు సైతం గరిష్ట స్థాయిలో అవకాశాలున్నాయని చెప్పారు. అయితే ఇందుకు పోటీదారులు సంస్థలెన్ని ఉన్నాయన్న లెక్కలుమాని, చౌక ధరల్లో సర్వీసులను అందించాల్సి ఉన్నదని వ్యాఖ్యానించారు.
గత నెల 12న తొలిసారి బెంగళూరు నుంచి గోవాకు విమాన సర్వీసును నిర్వహించడం ద్వారా ఎయిర్ ఏషియా దేశీయ కార్యకలాపాలు మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎయిర్ ఏషియా గురువారమిక్కడ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సమావేశంలో కంపెనీ సీఈవో టోనీతోపాటు సంస్థ ముఖ్య సలహాదారు రతన్ టాటా, చైర్మన్ ఎస్.రామదొరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఈవో టోనీ మాట్లాడుతూ దేశీ విమానయాన రంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
అత్యధికులకు చాన్స్...
పోటీ సంస్థలు పరస్పరం సహకరించుకోవడం ద్వారా అందుబాటు ధరల్లో సర్వీసులను నిర్వహించడానికే ప్రాధాన్యత ఇవ్వాలని టోనీ సూచించారు. తద్వారా అత్యధిక శాతం ప్రజలకు విమానయానాన్ని చేరువ చేయవచ్చునని తెలిపారు. చౌక ధరల సర్వీసులతో వ్యాపారాలు తదితర అవసరాల కోసం విదేశాలకు ప్రయాణించే వారి సంఖ్యను పెంచేందుకు వీలు కల్పించాలని సలహా ఇచ్చారు. ఇదే విధంగా స్వదేశీ సందర్శనకు వచ్చే విదేశీయులకు అవకాశాలు పెంచాలని చెప్పారు.
టికెట్ ధరలను సాధ్యమైనంతమేర తగ్గించడం ద్వారా వృద్ధి అవకాశాలను అందుకోవాలనేది తమ అభిమతమని చెప్పారు. ఇందుకు అనుగుణంగా ఇటు కేంద్రం, అటు రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువ వ్యయాలతో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని, విమాన ఇంధనం(ఏటీఎఫ్) ధరలను తగ్గించడంపై దృష్టి పెట్టాలని కోరారు. కాగా, ఈ నెల 20 నుంచి ఎయిర్ ఏషియా కొచ్చికి సైతం విమాన సర్వీసులను నిర్వహించనుంది.
ఏడాది కాలంలో బ్రేక్‌ఈవెన్ సాధిస్తాం
ఏడాది కాలంలో ఎయిర్ ఏషియా లాభనష్టాలులేని స్థితికి(బ్రేక్ ఈవెన్) చేరుకుంటుందని టోనీ అంచనా వేశారు. ఇందుకు మరిన్ని ప్రణాళికలను అమలు చేయాల్సి ఉన్నదని చెప్పారు. ఆరు విమానాలతో సర్వీసులను విస్తరించనున్నట్లు తెలిపారు.