టాటా ఎయిర్‌లైన్స్ టేకాఫ్! | tata airlines take off | Sakshi
Sakshi News home page

టాటా ఎయిర్‌లైన్స్ టేకాఫ్!

Published Fri, Sep 20 2013 12:38 AM | Last Updated on Fri, Sep 1 2017 10:51 PM

టాటా ఎయిర్‌లైన్స్ టేకాఫ్!

టాటా ఎయిర్‌లైన్స్ టేకాఫ్!


 న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్.. దేశీ విమానయాన రంగంలో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు విస్తరించడంపై దృష్టి పెట్టింది. ఇప్పటికే ఎయిర్‌ఏషియాతో కలిసి చౌక విమాన సేవలు అందించడంపై దృష్టి పెట్టిన టాటా గ్రూప్ .. తాజాగా ఫుల్ సర్వీస్ ఎయిర్‌లైన్స్ ఏర్పాటుపై కసరత్తు చేస్తోంది. ఇందుకోసం సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో ముచ్చటగా మూడోసారి జతకట్టింది. గురువారం ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే కొత్త కంపెనీకి అనుమతుల కోసం విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్‌ఐపీబీ)కి దరఖాస్తు చేసుకున్నట్లు టాటా గ్రూప్ పేర్కొంది. ముందుగా 10 కోట్ల డాలర్ల పెట్టుబడితో కొత్త ఎయిర్‌లైన్స్‌ని ప్రారంభించే అవకాశముందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అనుమతులన్నీ లభిస్తే వచ్చే ఏడాది కార్యకలాపాలు మొదలుకావొచ్చని వివరించాయి. దేశీయంగా పౌరవిమానయాన రంగంలో టాటా సన్స్‌కి సుదీర్ఘ చరిత్ర ఉంది. 1932లోనే జేఆర్‌డీ టాటా ..టాటా ఎయిర్‌లైన్స్‌ని ప్రారంభించారు. ఇదే ఆ తర్వాత 1946లో ఎయిరిండియాగా మారింది. దీన్ని 1953లో జాతీయం చేశారు.
 
 టాటా గ్రూప్‌కి 5% వాటాలు..: కొత్త ఎయిర్‌లైన్స్‌లో టాటా గ్రూప్ కంపెనీల హోల్డింగ్ సంస్థ అయిన టాటా సన్స్‌కి 51%, సింగపూర్ ఎయిర్‌లై న్స్‌కి 49% వాటాలు ఉంటాయి. బోర్డులో ముగ్గురు సభ్యులు ఉంటారు. ఇందులో ఇద్దరిని టాటా సన్స్, ఒకరిని సింగపూర్ ఎయిర్‌లైన్స్ నామినేట్ చేస్తాయి. టాటా క్వాలిటీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ చైర్మన్ ప్రసాద్ మీనన్.. దీనికి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. సింగపూర్ ఎయిర్‌లైన్స్ తరఫు నుంచి మాక్ స్వీ వా.. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (కమర్షియల్)గా ఉంటారు. టాటా గ్రూప్ ఇప్పటికే చౌక విమానయాన సర్వీసులు అందించేందుకు మలేసియాకి చెందిన ఎయిర్‌ఏషియాతో జట్టు కట్టింది. అయితే, ప్రతిపాదిత ఎయిర్‌ఏషియా వెంచర్‌లో టాటా సన్స్‌కి 30% వాటాలు ఉన్నా నిర్వాహక పాత్ర లేదు. కానీ సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో వెంచర్‌లో మాత్రం అదే సారథ్య బాధ్యతలు చేపట్టనుంది.
 
 నియంత్రణపరమైన ప్రశ్నలు ..
 టాటా గ్రూప్ ఇలా ఒకే రంగంలో రెండు వేర్వేరు వెంచర్లు ఏర్పాటు చేస్తుండటం తాజా డీల్‌కి ఆటంకాలేమైనా తెచ్చిపెట్టవచ్చని కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ పార్ట్‌నర్ అంబర్ దూబే తెలిపారు. మరోవైపు, ఈ విషయంలో ఏవియేషన్ నిబంధనలపరంగా అడ్డంకులేమీ లేవని పౌర విమానయాన మంత్రి అజిత్ సింగ్ చెప్పారు. అయితే సెబీ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ  నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఉండొచ్చని, అవే ఈ ప్రతిపాదనను క్లియర్ చేయాల్సి ఉంటుందని వివరించారు. ఇక, భారత్‌లో పౌర విమానయాన రంగం నిలకడగా వృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయని టాటా సన్స్ అంచనా వేసినట్లు ప్రసాద్ మీనన్ తెలిపారు. భారత్ మార్కెట్లో విస్తరించేందుకు టాటా గ్రూప్‌తో భాగస్వామ్యం తోడ్పడగలదని సింగపూర్ ఎయిర్‌లైన్స్ సీఈవో గోహ్ చూన్ ఫోంగ్ తెలిపారు.
 
 18 ఏళ్లలో ముచ్చటగా మూడోసారి..
 టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ భారత్‌లో విమాన సర్వీసులను ప్రారంభించేందుకు ప్రయత్నించడం ఇది మూడోసారి. 1995లో ఫుల్ సర్వీస్ ఎయిర్‌లైన్స్ కోసం ఎఫ్‌ఐపీబీకి ఇవి తొలిసారిగా దరఖాస్తు చేసుకున్నాయి. ఏడాది తర్వాత అనుమతులు లభించాయి. అయితే, దేశీ ఎయిర్‌లైన్స్‌లో విదేశీ ఎయిర్‌లైన్స్ వాటాలు తీసుకోకూడదంటూ 1997లో విధానాలను మార్చేయడంతో ఆ ప్రయత్నం కార్యరూపం దాల్చలేదు. ఒక కేంద్ర మంత్రికి లంచమివ్వడానికి నిరాకరించినందునే ఇలా జరిగిందంటూ టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా వ్యాఖ్యానిం చారు కూడా. ఇక 2000లో టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ మరోసారి దేశీ విమానయాన రంగంలోకి ప్రవేశించేందుకు విఫలయత్నం చేశాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement