డ్రోన్లు, కెమెరాలతో పరిపాలన: సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాబోయే రోజుల్లో డ్రోన్లు, నిఘా కెమెరాల పర్యవేక్షణలో పరిపాలన(రియల్ టైమ్ గవర్నెన్స్) సాగిస్తామని, ఆ విధంగా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రియల్‌టైమ్ గవర్నెన్స్ విధానం ద్వారా ఇది సాధ్యపడుతుందని, ఆమేరకు అవసరమైన చర్యలు చేపడతామని చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఆదివారం ఫైబర్ నెట్‌వర్క్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో రియల్‌టైమ్ గవర్నెన్స్‌లో డ్రోన్‌ల వినియోగం గురించి ముఖ్యమంత్రి చర్చించారు.
గృహ నిర్మాణాలు, కాలువల నిర్వహణతోపాటు అన్ని రంగాల్లోనూ డ్రోన్‌లు వినియోగించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు. డ్రోన్‌లు, సర్వైలెన్స్ కెమేరాల పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. వీటి నిర్వహణను పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో ఒక నోడల్ ఏజెన్సీని, ఈ విధానంపై అవగాహన కోసం ఒక శిక్షణ అకాడమీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టు అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై విధివిధానాల రూపకల్పనకు నలుగురైదుగురు అధికారులు, నిపుణులతో ఒక కమిటినీ నియమించి దానికి పూర్తి అధికారాలిస్తామన్నారు.
ప్రతి జిల్లాలోనూ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతోపాటు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం నగరాల్లో నగర స్థాయి కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలు ఏర్పాటుచేసి వాటన్నింటినీ అమరావతిలోని రాష్ట్రస్థాయి కమాండ్ కంట్రోల్ కేంద్రంతో అనుసంధానించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సమావేశంలో ఏపీ ఫైబర్ గ్రిడ్ ఎండీ సాంబశివరావు డ్రోన్‌ల ద్వారా వినియోగించుకునే అవకాశం ఉన్న సేవల గురించి ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో మంత్రి నారాయణ, విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ తదితరులు పాల్గొన్నారు.