శుక్రవారం ఉండవల్లిలో పోలీసులపై చేయి చేసుకుంటున్న టీడీపీ కార్యకర్త
సాక్షి, అమరావతి బ్యూరో/తాడేపల్లి రూరల్/గుంటూరు: గుంటూరు జిల్లా ఉండవల్లిలో కృష్ణా నది కరకట్టపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్‌హౌస్ వద్ద శుక్రవారం తెలుగుదేశం పార్టీ నేతలు హల్‌చల్ చేశారు. నదిలో వరద పరిస్థితిని అంచనా వేసేందుకు డ్రోన్ కెమెరాతో చిత్రీకరిస్తుండగా దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఇరిగేషన్ శాఖ అధికారుల ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాతో చిత్రీకరిస్తున్న ఇద్దరు యువకులను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. పోలీసులు వారిని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా, మీడియాను పిలిపించి నానా యాగీ చేశారు. వరద ముంపు ప్రాంతాలను, నీటి ఉధృతిని డ్రోన్ కెమెరాతో చిత్రీకరిస్తున్నామని అధికారులు చెబుతున్నా వినిపించుకోకుండా ఇందులో వైఎస్సార్‌సీపీ నాయకుల ప్రమేయం ఉందంటూ ఆందోళనకు దిగారు.
పోలీసులు రెండు గంటల పాటు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వినకుండా ముఖ్యమంత్రిని దూషిస్తూ రోడ్డుపై బైఠాయించారు. చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ నాయకులు కుట్ర పన్నుతున్నారని, అందుకే ఆయన నివాసాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు, టీడీపీ నేతలు దేవినేని అవినాష్, అశోక్‌బాబు, బచ్చుల అర్జునుడు ఆరోపించారు. డ్రోన్ కెమెరా ఆపరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని, పోలీసు స్టేషన్‌కు తరలిస్తుండగా వారి జీపును, మరో బస్సు అద్దాలను ధ్వంసం చేసేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. పోలీసులు టీడీపీ కార్యకర్తలను అడ్డుకొని, ఇద్దరు ఆపరేటర్లను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు మరోసారి ధర్నాకు దిగి, పోలీసు వాహనాలను అడ్డుకున్నారు. పోలీసులు లాఠీచార్జి చేసి వారిని దూరంగా తరిమేశారు.
మంత్రులను అడ్డుకున్న బాబు ఇంటి భద్రతా సిబ్బంది
ప్రకాశం బ్యారేజీకి వరద భారీగా పెరుగుతుండడంతో కృష్ణా కరకట్ట వెంబడి ఉన్న పంటలు, నిర్మాణాలను మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్‌కుమార్ యాదవ్, వెలంపల్లి శ్రీనివాస్ తదితరులు పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం ఉండవల్లి కరకట్ట వెంబడి ఉన్న ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి సంబంధించిన తులసివనం అతిథి గృహాన్ని పరిశీలించారు. అనంతరం ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటి వద్ద వరద తాకిడి ఎలా ఉందో పరిశీలించేందుకు వెళ్లారు. అయితే, చంద్రబాబు ఇంటి వద్ద ఉన్న భద్రతా సిబ్బంది మంత్రులను లోపలికి అనుమతించలేదు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. వరదలను కూడా రాజకీయం చేయడం తగదన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో కరకట్ట పక్కన ఉన్న మాజీ సీఎం చంద్రబాబు ఇంటికి ఇరువైపులా ఉన్న గోకరాజు గంగరాజు గెస్ట్‌హౌస్, చందనా బ్రదర్స్ గెస్ట్‌హౌస్, తులసి నివాసాలు నీట మునిగిన దృశ్యం
లింగమనేని గెస్ట్‌హౌస్‌ను చుట్టుముట్టిన వరద
ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 9 గంటల సమయానికి ఉండవల్లి కరకట్ట వెంబడి ఉన్న పంట పొలాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అరటి, మునగ, కంద, దొండ తదితర పొలాల్లో నీరు నిలిచింది. మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు అతిథి గృహం, ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి చెందిన తులసి వనం గెస్ట్‌హౌస్‌లోకి వరద పారింది. చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్‌హౌస్ వద్ద ఉన్న రివర్ వ్యూ ఇప్పటికే మునిగిపోయింది. అక్కడ ఉన్న వరండా పైనుంచి వరద పారుతోంది. లింగమనేని గెస్ట్‌హౌస్‌కు ముందు వైపు, వెనక వైపు వరద చుట్టుముట్టింది. చంద్రబాబు ఇంటికి ముందు వంద మీటర్ల దూరంలో, వెనక వైపు రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న పంటపొలాల్లోకి అడుగు మేర వరద వచ్చింది. చంద్రబాబు ఇంటిని రక్షించేందుకు అక్కడి సిబ్బంది మట్టి, ఇసుక, కంకరను సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే తాడేపల్లి రెవెన్యూ అధికారులు కరకట్ట వెంబడి ఉన్న 26 అతిథి గృహాలను ఖాళీ చేయాలని ఆదేశించారు. అయినా చంద్రబాబు నివాసాన్ని ఖాళీ చేయకుండా మొండికేస్తుండడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అనుమతి లేకుండా డ్రోన్లు వినియోగించొద్దు: ఐజీ
కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో వరద కొనసాగుతోందని గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ శుక్రవారం చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లోని నివాసాలకు వరద ముప్పు పొంచి ఉందన్నారు. సహాయక చర్యల్లో నిమగ్నమైన ప్రభుత్వ శాఖల సిబ్బందికి, పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో పోలీసుల అనుమతి లేకుండా డ్రోన్లు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తప్పనిసరిగా వినియోగించాల్సి వస్తే సంబంధిత జిల్లా పోలీస్ అధికారి నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు.
గేట్లకు బోట్లు అడ్డుపెట్టి వరద తెప్పించారు
నా ఇంటిని ముంచేయడానికే ఇలా చేశారు: చంద్రబాబు
ప్రకాశం బ్యారేజీ గేట్లకు బోట్లను అడ్డుగా పెట్టి, తన ఇల్లు మునిగిపోయేలా చేశారని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. హైదరాబాద్‌లో ఉన్న ఆయన శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో మకాం వేసిన టీడీపీ నేతలతో పలుమార్లు టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. బ్యారేజీలో నీళ్లు వెనక్కి తన్నడం కోసమే గేట్లకు బోట్లు అడ్డం పెట్టారని అన్నారు. సక్రమంగా వరద నిర్వహణ చేపడితే నీళ్లు వెనక్కి వచ్చేవి కావని, వరద ప్రవాహం నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. వరద నిర్వహణపై ముఖ్యమంత్రి ఒక్క సమీక్ష కూడా చేయలేదని ధ్వజమెత్తారు. ప్రకాశం బ్యారేజీ గేట్లను నిర్వహించే విధానం ప్రభుత్వానికి తెలియలేదన్నారు.
బ్యారేజీ నుంచి మూడు లక్షల క్యూసెక్కుల నీటిని ముందే వదిలితే వరద ఉండేది కాదని చెప్పారు. తనపై ద్వేషంతో వరదలతో ఆటలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అక్కసుతో ప్రజలను వరదల్లో ముంచుతున్నారని, బ్యారేజీలో నీళ్లు నిల్వ ఉంచి అకస్మాత్తుగా దిగువకు వదిలారని అన్నారు. ఉండవల్లిలోని తన నివాసాన్ని టార్గెట్ చేశారని దుయ్యబట్టారు. హై సెక్యూరిటీ జోన్‌లో ఉన్న తన ఇంటిపై డ్రోన్లు ఎందుకు ఎగురవేశారని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రినైన తన నివాసంపై డ్రోన్లు తిప్పడం ఏమిటని నిలదీశారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న చంద్రబాబు ఇంటిపై డ్రోన్లు నడిపేముందు సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకున్నారో లేదో చెప్పాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై శనివారం డీజీపీని కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment