ఈ కృషి ప్రశంసనీయం | Sakshi Editorial On Odisha Response Over Cyclone Fani | Sakshi
Sakshi News home page

ఈ కృషి ప్రశంసనీయం

Published Tue, May 7 2019 12:53 AM | Last Updated on Tue, May 7 2019 12:53 AM

Sakshi Editorial On Odisha Response Over Cyclone Fani

ప్రకృతి ప్రకోపించి విరుచుకుపడినప్పుడు దాన్ని శాంతింపజేయడం ఎవరి తరమూ కాదు. ఇప్పటి కున్న శాస్త్ర పరిజ్ఞానం మేరకు మనిషి చేయగలిగిందల్లా దాని ఆనవాళ్లను ముందుగా పసిగట్టి, అది సృష్టించగల విధ్వంసాన్ని అంచనా వేసుకుని ప్రజలందరినీ అప్రమత్తం చేయడం, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి జన నష్టం లేకుండా శాయశక్తులా ప్రయత్నించడం మాత్రమే. ఇవిమాత్రమే కాదు...వైపరీత్యం సమయంలోనూ, అది నిష్క్రమించాకా సహాయ, పునరావాస కార్యక్రమాలను సమర్థవంతంగా చేపట్టగలగాలి. అందుకవసరమైన సమస్త మౌలిక సదుపాయాలనూ సిద్ధం చేయాలి. వీటన్నిటినీ ఎంత ఒడుపుగా, ఎంత నేర్పుగా, ఎంత సమన్వయంతో చేయగలుగుతుం దన్నదే ఏ ప్రభుత్వ పనితనానికైనా గీటురాయి.

దాదాపు పదిరోజులపాటు తీర ప్రాంత రాష్ట్రాలను ఊపిరాడనీయకుండా చేసిన ‘ఫొని’ తుపాను శుక్రవారం ఒడిశాలోని పూరి సమీపంలో తీరం దాటినప్పుడు అది సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. గంటకు దాదాపు 205 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. కుండపోతగా వర్షాలు పడ్డాయి. లక్షలాదిమందిని పునరావాస కేంద్రాలకు తరలించవలసి వచ్చింది. 30మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రధానంగా పూరి, ఖుర్దా జిల్లాలు తుపాను తాకిడికి చివురుటాకుల్లా వణికాయి. ‘ఫొని’ ఆచూకీ పదిరోజుల ముందే తెలిసినా అది ఉన్నకొద్దీ బలం పుంజుకుంటూ, వంపులు తిరుగుతూ సాగిన తీరు శాస్త్రవేత్తలను కూడా అయోమయంలో పడేసింది. దాని నడకను గమనిస్తూ అది తమిళనాడు దగ్గర తీరం దాటొచ్చునని ఒకసారి, ఆంధ్రప్రదేశ్‌పై విరుచుకుపడొచ్చునని మరోసారి వారు అంచనా వేశారు. కానీ గాలులు వీచే తీరు, సముద్రంలో అనూహ్యంగా చోటుచేసుకున్న పరిణామాలు దాని దిశను మార్చాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌ తీరాన్ని ఒరుసుకుంటూ అది సాగించిన ప్రయాణం వల్ల ఉత్తరాంధ్ర జిల్లాలు, ప్రత్యేకించి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు నష్టాన్ని చవిచూడక తప్పలేదు. జన నష్టం లేక పోయినా వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. 958 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ఈ రెండు జిల్లాల్లో రూ. 58.61 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కేంద్రానికి పంపిన ప్రాథమిక అంచనా నివేదికలో తెలియజేశారు.   

‘ఫొని’ విలయాన్ని ఒడిశా ఎదుర్కొన్న తీరు అత్యంత ప్రశంసనీయమైనది. ప్రభుత్వం 43,000 మంది వలంటీర్లను రంగంలోకి దించింది. విపత్కర పరిస్థితుల్లో సాయం అందించడానికి మరో వేయిమంది సిబ్బందిని ముఖ్యప్రాంతాలకు తరలించింది. ఎస్సెమ్మెస్‌లు, టీవీ చానెళ్లు, సైరన్‌లు, మైక్‌లు... ఒకటేమిటి అన్నిటినీ సంపూర్ణంగా వినియోగించుకుంది. ‘తుపాను విరుచుకుపడబోతోంది... సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లండ’న్నదే ఆ సందేశాల సారాంశం. రంగంలోకి దిగిన ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు క్షేత్ర స్థాయిలో పనిచేసే వేలాదిమంది వలంటీర్లతో, సహాయ సిబ్బందితో సమన్వయపరచుకుంటూ సహాయశిబిరాలకు 12 లక్షలమంది తరలివెళ్లేలా చూశారు. అక్కడ కనీస సదుపాయాలు అందుబాటులో ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ఆహారం, మంచినీరు ప్యాకెట్లు ప్రతి ఒక్కరికీ చేరేయగలిగారు.

1999నాటి పెనుతు పాను 10,000మందిని పొట్టనబెట్టుకున్నదని గుర్తుంచుకుంటే...‘ఫొని’ రాక్షసిని ఇప్పుడు ఒడిశా ఎంత సమర్ధవంతంగా ఎదుర్కొన్నదో అవగాహనకొస్తుంది. పాలకులకు ముందు చూపుంటే, తీవ్రతను అంచనా వేయగలిగితే, దానికి తగ్గట్టుగా సర్వ శక్తుల్ని కేంద్రీకరించగలిగితే నష్టాన్ని కనిష్ట స్థాయికి పరిమితం చేయడం కష్టం కాదని ఒడిశా నిరూపించింది. కేవలం అయిదు పేజీల కార్యాచరణ ప్రణాళిక ఈ అద్భుతాన్ని సాధించిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ ప్రణాళిక ప్రతి అంశాన్నీ స్పృశించింది.  షెల్టర్‌లకు ప్రజల్ని చేరేసేటపుడు ఏ ఏ అంశాల్ని దృష్టిలో పెట్టుకోవాలో ఇది సూచించింది. ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లు, చిన్న పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చెప్పింది. తమ ప్రాంతాల్లో ఉన్న ఇళ్లు, అందులో నివసిస్తున్నవారి వివరాలున్న జాబితాలను క్షేత్రస్థాయి సిబ్బందికి అందించారు. ‘ఫొని’ శుక్రవారం ఉదయం విరుచుకుపడగా అంతకు 24 గంటలకన్నా ముందే ఒక క్రమపద్ధతిలో సహాయచర్యలు మొదలైపోయాయి. 

విపత్తులు విరుచుకుపడినప్పుడు ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాలో ఒడిశా తన ఆచరణ ద్వారా దేశానికి మాత్రమే కాదు... ప్రపంచ దేశాలకు కూడా చాటింది. అందువల్లే అది అంత ర్జాతీయ మీడియా ప్రశంసలు కూడా అందుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న కారణంగా ప్రభుత్వ యంత్రాంగం సమర్థత అందరికీ తేటతెల్లమైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సారథ్యంలో తుపానును ఎదుర్కొనడానికి ప్రభుత్వంలో పైనుంచి కిందివరకూ అందరికందరూ ఎవరి బాధ్యతలను వారు అంకితభావంతో, దృఢ సంకల్పంతో నిర్వర్తించారు. కానీ చంద్రబాబు ఏలుబడి దీనికి భిన్నం. ఆయన అధికారంలోకొచ్చాక ఇంచు మించు ఏడాదికొక తుపాను రాష్ట్రంపై విరుచుకుపడింది.

ఈ సందర్భాలన్నిటా ఆయనకు ప్రచారయావ తప్ప సామాన్య జనం పడే కష్టాలు కనబడలేదు. అంతటా తానే కనబడుతూ, సిబ్బందిని అదిలిస్తూ కేవలం తన కారణంగా మాత్రమే వారంతా పనిచేస్తున్నారన్న అభిప్రాయం కలిగించ డానికి ఆయన వెంపర్లాడేవారు. పర్యవసానంగా క్షేత్రస్థాయిలో సహాయకార్యక్రమాలు చతికిలబ డేవి. సొంత మీడియా మాత్రం ఆయన్ను ఆకాశానికెత్తేది. హుద్‌హుద్, తిత్లీ తుపానుల సమ యంలో ఆయన చేసిన హడావుడిని, తాగునీరు సైతం అందక ప్రజలు ఇబ్బందిపడిన తీరును ఎవరూ మరిచిపోరు. ఇప్పుడలాంటి అనాలోచిత చేష్టలు లేవు. అధికార యంత్రాంగం స్వేచ్ఛగా, సమర్ధవంతంగా పనిచేయగలిగింది. విపత్తు నిర్వహణ నియమావళిని తు.చ. తప్పకుండా పాటించ గలిగింది. ఫలితంగా బాధిత ప్రజలకెంతో మేలు జరిగింది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ అనుభవాలు మున్ముందు అందరికీ ఆదర్శం కావాలని ఆశించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement