సాక్షి, అమరావతి: విపత్తులు సంభవించినప్పుడు ఒడిశా ప్రభుత్వ యంత్రాంగం మన రాష్ట్రం కంటే మరింత సన్నద్ధంగా ఉంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. ఆ రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలను తెలుసుకుని ఇక్కడి అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఫొని తుపాను సహాయక చర్యలపై అత్యవసరంగా సమీక్షించేందుకు గురువారం ఆయన సచివాలయానికి వచ్చారు. ఆర్టీజీఎస్ కేంద్రంలో అధికారులు, తన కార్యదర్శులతో కలిసి తుపాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. అధికారులు కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినకుండా చూడాలని, సెల్ ఫోన్లు చార్జింగ్ చేసుకునేలా జనరేటర్లు ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలోని 15 మండలాలు, 200 గ్రామాలపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని విపత్తుల ప్రత్యేకాధికారి వర ప్రసాద్, ఆర్టీజీఎస్ సీఈవో అహ్మద్ బాబు ముఖ్యమంత్రికి తెలిపారు. 120 క్యాంపులను నిర్వహిస్తున్నామని, ముగ్గురు ఐఏఎస్ అధికారులను ప్రత్యేకంగా సహాయ, ముందస్తు కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ కోసం నియమించామని.. టెక్కలి, పలాస కేంద్రాలుగా సూపర్ సైక్లోన్ బృందాలు పని చేస్తున్నట్టు వివరించారు. మండలాల్లో కాకుండా, గ్రామాల్లో తుపాను సహాయ బృందాలను అందుబాటులో వుంచాలని, విశాఖ కేంద్రంగా తాగునీరు, పాలు, కూరగాయలు, నిత్యావసరాలు తుపాన్ ప్రభావిత ప్రాంతాలకు అందించేలా చూడాలని చంద్రబాబు సూచించారు. ఫొని తుపాన్ సహాయక చర్యల కోసం కొత్త జీవోలు అక్కర్లేదని, తిత్లీ తుపాను సమయంలో జారీ చేసిన ఆదేశాలనే ఇప్పుడూ అనుసరించాలన్నారు.
ఈసీకి లేఖ రాస్తే స్పందించలేదు..
అవసరమైతే తాను క్షేత్ర స్థాయి పర్యవేక్షణకు వస్తానని, తుపాను ప్రభావిత జిల్లాల్లో ఎన్నికల నియమావళిని సడలించాలని భారత ఎన్నికల సంఘానికి లేఖ రాస్తే స్పందించలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ మితిమీరి జోక్యం చేసుకుంటోందని తాను ముందు నుంచీ చెబుతూనే ఉన్నానని తెలిపారు. తుపాన్ ప్రభావం గురించి ఈ సమావేశం నుంచే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో ఫోన్‌లో మాట్లాడారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు తుపాన్ బాధితులకు అండగా నిలవాలని బాబు పిలుపునిచ్చారు.
విపత్తుల వేళ మనకంటే ఒడిశా మేలు
Published Fri, May 3 2019 4:19 AM | Last Updated on Fri, May 3 2019 4:19 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment