సాక్షి, అమరావతి : అతి తీవ్ర తుపానుగా మారిన ఫొని తీరం వైపు దూసుకోస్తుంది. ఒడిశాలోని పూరీకి నైరుతి దిశగా 830 కి.మీల దూరంలో.. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 670 కి.మీల దూరంలో ఫొని పెను తుపాను కేంద్రీకృతమై ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. మరో 12 గంటల్లో ఫొని తీవ్ర పెను తుపానుగా మారనుంది. ఈశాన్య దిశగా కదులుతూ దిశ మార్చుకొని ఒడిశా తీరం వైపు తరలనుంది. ఫొని తుపాను మే 3 మధ్యాహ్నానికి ఒడిశా తీరానికి చేరుకుంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. తుపాను కదులుతున్న మార్గంలో గంటకు 170 నుంచి 200 కిలో మీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయని అధికారులు పేర్కొంటున్నారు.
అయితే, ఫొని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీచేశారు అధికారులు. కాకినాడ, గంగవరం పోర్టుల్లో ఐదో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేయగా.. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో రెండో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
కేబినేట్ కార్యదర్శి సమీక్ష
ఫొని తుపానుపై కేబినేట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా.. ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పరిస్థితిని సమీక్షించారు. మే 2, 3 తేదీల్లో ఫొని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై ఉంటుందని తెలిపారు. తుపాను ప్రభావంతో రైళ్ల రాకపోకలకు ఆటంకం కలిగి నిలిచిపోయే అవకాశం ఉందన్నారు. ప్రయాణీకులకు ఇబ్బందులు ఎదురవ్వకుండా నీరు, ఆహారం అందించేందుకు రైల్వే బోర్టుకు తగిన ఆదేశాలు జారీ చేయాలని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment