
ప్రళయ భీకర గాలులు.. వాటి ధాటికి చిగురుటాకుల్లా వణికిపోయిన కట్టడాలు, వృక్షరాజాలు.. విద్యుత్, రవాణా వ్యవస్థల విచ్ఛిన్నం.. రోజుల తరబడి జనజీవనం చిన్నాభిన్నం.. ఆ చేదు జ్ఞాపకాలు.. ఆ చీకటి రోజులు.. ఐదేళ్ల క్రితం హుద్‌హుద్ మిగిల్చిన గాయాలు.. ఇంకా ప్రజల్లో స్మృతిపథంలో పచ్చిగానే ఉన్నాయి..ఇంతలోనే మరో పెనుముప్పు ఫొని రూపంలో కమ్ముకొస్తోందని.. నాటి హుద్‌హుద్ కంటే దీన్ని తీవ్రత ఎక్కువేనన్న వాతావరణ శాఖ హెచ్చరికలు విశాఖవాసులను బెంబేలెత్తిస్తున్నాయి. తీరానికి సమీపిస్తున్న కొద్దీ ఫొని తుపాను ప్రభావంతో 175 నుంచి 200 కి.మీ. వేగంతో భీకర గాలులు వీస్తాయని.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. తీవ్రస్థాయిలో విధ్వంసం జరగవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.అందుకు తగినట్లే తీరగ్రామాలను అప్రమత్తం చేస్తున్నారు.
అధికారులు, ఉద్యోగుల సెలవులు రద్దు చేశారు. మండలాలవారీగా తక్షణ సమాచారం కోసం టోల్‌ఫ్రీ నెంబర్లతో కాల్‌సెంటర్లు ఏర్పాటు చేశారు. నిత్యావసరం, ఇతర అత్యవసర వస్తువులను సిద్ధం చేస్తున్నారు. తక్షణం రంగంలోకి దిగేందుకు వీలుగా తూర్పు నావికాదళం అధికారులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధమవుతున్నాయి. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఎంత నష్టం, కష్టం వాటిల్లుతుందోనని ప్రజలు గుబులు చెందుతున్నారు.మరోవైపు ప్రస్తుత అంచనాల ప్రకారం.. విశాఖకు సుమారు 500 కి.మీ. దూరంలో ఉన్న తుపాను.. రెండు, మూడు తేదీల్లో ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావం చూపి ఒడిశా వైపు సాగిపోతుందని.. ఆ రాష్ట్రంలోని గోపాల్‌పూర్–చాంద్‌బలి మధ్య 4వ తేదీన తీరాన్ని తాకుతుందంటున్నారు. ఇదే నిజమవ్వాలని.. పెద్ద నష్టం కలిగించకుండానే ఫొని తుపానును అలా ముందుకే సాగిపోనీ.. అని మనసులో దేవుడ్ని మొక్కుకుంటున్నారు. –సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం
సాక్షి, విశాఖపట్నం: ఫొని పెను తుపాను ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తోంది. తీరానికి చేరువలోకి వచ్చే సరికి గంటకు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో పెనుగాలులు వీయనున్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. సాధారణంగా 100 కిలోమీటర్ల గాలి వేగానికే చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలతాయి. అలాంటిది అంతకు రెట్టింపు వేగంతో గాలులు వీస్తాయన్న హెచ్చరికలు అందరినీ కలవరపెడుతున్నాయి. ఈ పెను తుపాను ఒడిశాలోని పూరీకి సమీపంలో ఈనెల 3న తీరాన్ని దాటనుంది. దాని ప్రభావం ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై పడనుంది. ప్రధానంగా విశాఖపట్నంకంటే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు పెనుగాలులు విధ్వంసం సృష్టించవచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెను తుపాను వేళ ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలో నేషనల్ డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ సూచించింది. తుపానుకు ముందు, తుపాను సమయం, తుపాను తర్వాత తీసుకోవలసి జాగ్రత్తలను వివరించింది.
తుపానుకు ముందు..
♦ నిత్యావసర వస్తువులను సమకూర్చుకోవాలి.
♦ పాలు, మందులు, తాగునీరు భద్రపరచుకోవాలి
♦ మీ మొబైల్ ఫోన్లకు చార్జింగ్ పెట్టుకోవాలి
♦ రేడియో, టీవీల్లో సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి
♦ ముఖ్యమైన పత్రాలు, దస్త్రాలు తడిసిపోకుండా భద్రపరచుకోవాలి
♦ పదునైనా వస్తువులను బయట ఉంచకండి
♦ పెంపుడు జంతువులకు రక్షణ కల్పించండి
తుపాను సమయంలో..
♦ విద్యుత్ మెయిన్‌ను, గ్యాస్ సరఫరాను తొలగించండి
♦ తలుపులు, కిటికీలను మూసివేయాలి
♦ మీరుండే ఇల్లు సురక్షితం కాకపోతే మరో చోటకు వెళ్లిపోవాలి
♦ రేడియో/టీవీల ద్వారా సమాచారం తెలుసుకోవాలి
♦ వేడిచేసిన/శుద్ధిచేసిన నీటిని మాత్రమే తాగాలి
తుపాను తర్వాత..
♦ దెబ్బతిన్న, శిథిలమైన ఇళ్లు/భవనాల్లోకి వెళ్లకూడదు
♦ దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, వైర్లకు దూరంగా ఉండాలి.
♦ సాధ్యమైనంత వరకు సురక్షిత షెల్టర్లలోనే ఉండాలి
మత్స్యకారులకు..
♦ రేడియో సెట్లకు అదనపు బ్యాటరీలను సమకూర్చుకోవాలి.
♦ పడవలు/బోట్లను సురక్షిత ప్రాంతంలో ఉంచుకోవాలి
♦ తుపాను తీవ్రత పూర్తిగా తగ్గేవరకు వేట మానుకోవాలి
సహాయ చర్యలకు తూర్పు నౌకాదళం సన్నద్ధం
విశాఖసిటీ: తీర ప్రాంతాలపై విరుచుకుపడనున్న ఫొని తుఫాను రక్షణ చర్యల్లో పాల్గొనేందుకు తమ బృందాలు సిద్ధంగా ఉన్నాయని తూర్పు నౌకాదళం మంగళవారం ప్రకటించింది. తుపాను బాధిత ప్రాంతాల్లో ప్రజలకు పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందించడంతో పాటు వైద్య సదుపాయాల వంటి లాజిస్టిక్ సపోర్ట్ అందించేందుకు భారత నౌకాదళం అప్రమత్తంగా ఉందని వెల్లడించింది. అత్యంత ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనేందుకు భారత యుద్ధ నౌకలు విశాఖపట్నం, చెన్నై తీరాల్లో సన్నద్ధంగా ఉన్నాయని నౌకాదళాధికారులు తెలిపారు. అదనపు గజఈతగాళ్లు, వైద్యులు, రబ్బరు పడవలు, ఆహార పదార్థాలు, తాత్కాలిక వస్తువులు, దుస్తులు, మందులు, దుప్పట్లు వంటి వాటిని అవసరమైన మేరకు అందించేందుకు సిద్ధం చేశామన్నారు. విశాఖలోని ఐఎన్‌ఎస్ డేగాతో పాటు తమిళనాడు అరక్కోణంలో ఉన్న ఐఎన్‌ఎస్ రాజాలి నేవల్ ఎయిర్ స్టేషన్లలో ఎయిర్ క్రాఫ్ట్‌లను కూడా సిద్ధంగా ఉంచామని వెల్లడించారు. అంతే కాకుండా జెమిని బోట్లతో పాటు డైవింగ్ సిబ్బందితో కూడిన బృందాలు ఇప్పటికే మోహరించాయని వివరించారు. తుఫాను తీవ్రత మొదలైన క్షణం నుంచి సహాయక చర్యలకు ఉపక్రమించేందుకు సిద్ధం చేసినట్లు వివరించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయడంతో పాటు వాటిని ఎలా అభివృద్ధి చెయ్యాలనే విషయాలపై తూర్పు నౌకాదళం ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటుందని నౌకాదళాధికారులు స్పష్టం చేశారు.