
భువనేశ్వర్ : ఫొని తుపాను ఒడిశాలో బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలు, గాలుల ధాటికి 6గురు ప్రాణాలు కోల్పోయారు. గంటకు 80-125 కి.మీ. వేగంగా పెనుగాలులు, అతి భారీ వర్షాలతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పలు రహదారులు ధ్వంసమైపోయాయి. చాలా చోట్ల విద్యుత్ సంభాలు నేలకొరిగాయి. ఈ నేపథ్యంలో ఒడిశాలో హై అలర్ట్ ప్రకటించారు. టూరిస్టులందరూ పూరీ విడిచి వెళ్లాలని ఆదేశించారు. ప్రభావిత ప్రజలను ఆదుకునేందుకు ఒడిశా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 11 వేల మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు చెప్పారు.
మరోవైపు ప్రభావిత రాష్ట్రాల్లో ప్రజలకు భయపద్దనీ..తాము ఉన్నామంటూ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. తూర్పు తీర ప్రాంత ప్రజలు తుఫాన్ వల్ల ఇబ్బందులు పడుతున్నారని, ఆయా రాష్ట్రాలతో కేంద్రం నిరంతరంగా టచ్‌లో ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు. ఒడిశా, బెంగాల్, ఆంధ్రా, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతోందన్నారు. రాజస్థాన్‌లోని కరౌలీలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన మోదీ తుఫాను బాధితులు త్వరగా కోలుకోవాలని మోదీ కోరారు. తుఫాన్ ప్రభావిత రాష్ట్రాలకు ముందుగానే వెయ్యి కోట్లకుపైగా నిధులు రిలీజ్ చేశామని అన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఇండియన్ కోస్టు గార్డ్, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ పరిస్థితిని అంచనా వేస్తున్నారన్నారని మోదీ వివరించారు.