సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఉన్నత అధికారులపై ఆపద్దర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి అసహనం వ్యక్తం చేశారు. ఫొని తుపాను నేపథ్యంలో ఎన్నికల సంఘం కోడ్‌ను సడలించడంతో చంద్రబాబు శుక్రవారం సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... అధికారులపై అక్కసు వెళ్లగక్కారు. ‘అన్ని రాష్ట్రాలలో సీఎస్‌లు ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేస్తారు. మన దగ్గర మాత్రం ప్రధాన కార్యదర్శి సీఎం వద్దకు రారు. ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి మాట్లాడాలని తెలీదా? సీఎస్‌ని రమ్మని మేము అడుక్కోవాలా. రివ్యూలకు రారా? ఇక్కడి అధికారులు చదువు కోలేదా, చట్టం తెలీదా? అధికారి ఎవరైనా బాధ్యతారహితంగా ఉంటే సహించను. వచ్చే వారం కేబినెట్ సమావేశం పెడతా. ఎన్నికల కోడ్ పేరుతో అధికారులను ఎలా ఆపుతారో చూస్తాను’ అంటూ చంద్రబాబు రుసరుసలాడారు.
ఈసీ అడ్డుపడింది..
భారత వాతావరణ శాఖ కంటే ఆర్టీజీ సమర్థవంతంగా పనిచేసిందని ఆయన చెప్పుకొచ్చారు. ఆర్టీజీ ద్వారా ఒడిశాకు సమాచారం ఇచ్చామని, నాలుగు జిల్లాలలో దీని ప్రభావం ఉంటుందని ముందే చెప్పామన్నారు. పక్కా ప్రణాళికతో ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చేయగలిగామని చెప్పారు. తుపాను పర్యవేక్షణ చర్యలకు ఎన్నికల సంఘం అడ్డుపడిందని చంద్రబాబు విమర్శించారు. తుపాను వెళ్లిపోయాక రివ్యూలకు అనుమతి ఇచ్చిందని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ రివ్యూకు అనుమతి అవసరం లేదా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment