
సాక్షి, విశాఖపట్నం: ఈ నెల 22వ తేదీ తర్వాత పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపాను ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం స్పష్టతనిచ్చింది. ఐఎండీ తాజా నివేదిక ప్రకారం ఉత్తర అండమాన్ సముద్రంలో మంగళవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో గురువారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో తూర్పు మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని అల్పపీడనం ఏర్పడనుంది.
ఇది పశ్చిమ, వాయువ్య దిశగా పయనిస్తూ ఈనెల 22 వ తేదీ ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. ఆనంతరం ఈ వాయుగుండం మరింత బలపడుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారనుందని ఐఎండీ తెలిపింది. అయితే ఇది మరింతగా బలపడి అతి తీవ్ర/సూపర్ సైక్లోన్‌గా మారే అవకాశాలపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి ఈ తుపాను ఉత్తర కోస్తాంధ్ర–దక్షిణ ఒడిశాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
రాష్ట్రంపై అధిక ప్రభావం
తుపాను ప్రభావం మన రాష్ట్రంపై అధికంగా ఉండనుంది.ఫలితంగా ఈనెల 22వ తేదీ నుంచి రాష్ట్రంలో భారీనుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అదే సమయంలో తీరం వెంబడి గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయి. మరోవైపు రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ మంగళవారం రాత్రి నివేదికలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment