వానొచ్చె.. వరదొచ్చె.. | Rains for another four days in the AP | Sakshi
Sakshi News home page

వానొచ్చె.. వరదొచ్చె..

Published Sat, Aug 3 2019 2:48 AM | Last Updated on Sat, Aug 3 2019 8:40 AM

Rains for another four days in the AP - Sakshi

పోలవరం ప్రాజెక్ట్‌ కాఫర్‌ డ్యాం వద్ద పోటెత్తుతున్న గోదావరి

సాక్షి, అమరావతి/ నెట్‌వర్క్‌: రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండటం, ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి పెద్ద ఎత్తున వరద జలాలను ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తుండడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. గురువారం ఉదయం ఆరు గంటల నుంచి శుక్రవారం ఉదయం ఆరు గంటల వరకూ 24 గంటల్లో 16.53 టీఎంసీలు జలాశయంలోకి చేరాయి. ప్రస్తుతం 1,79,709 క్యూసెక్కుల మేర ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీశైలంలో నీటి నిల్వ 838.7 అడుగుల్లో 59.98 టీఎంసీలకు చేరుకుంది.

రానున్న రెండు రోజులు పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఎగువ నుంచి భారీ వరద వస్తుందని కర్ణాటకకు సీడబ్ల్యూసీ హెచ్చరించింది. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాలు నిండుకుండల్లా మారడంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల కూడా దాదాపుగా నిండింది. ఈ నేపథ్యంలో శనివారం శ్రీశైలానికి వచ్చే వరద ప్రవాహం మరింతగా పెరగనుంది. మరోవైపు భీమా నదిలో వరద కాస్త తగ్గుముఖం పట్టింది. ఉజ్జయినిలోకి 39,467 క్యూసెక్కులు చేరడంతో నీటి నిల్వ 78.06 టీఎంసీలకు చేరుకుంది. 24,860 క్యూసెక్కులు చేరడంతో తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ 30.44 టీఎంసీలకు చేరింది.

నేడు మరింత పెరగనున్న గోదారి వరద
శబరి, సీలేరు పరీవాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తుండడంతో భారీ ఎత్తున వరద నీరు గోదావరిలోకి చేరుతోంది. శుక్రవారం ఉదయం ధవళేశ్వరం బ్యారేజీకి 8,00,084 క్యూసెక్కుల వరద రాగా.. డెల్టా కాలువలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 7,85,089 క్యూసెక్కులను 174 గేట్లు ఎత్తి దిగువకు వదిలారు. సాయంత్రం ఏడు గంటలకు వరద కాస్త తగ్గడంతో 7,11,439 క్యూసెక్కులను విడుదల చేశారు. గురువారం ఉదయం ఆరు గంటల నుంచి శుక్రవారం ఉదయం ఆరు గంటల వరకూ 24 గంటల్లో 60 టీఎంసీలను ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి వదిలారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 340 టీఎంసీల గోదావరి జలాలు కడలిలో కలిశాయి. శనివారం కాటన్‌ బ్యారేజ్‌కు సుమారు 8.50 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు వచ్చి చేరే అవకాశం ఉందని ఇరిగేషన్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి నీటి మట్టం చేరుకుంది. తాలిపేరు రిజర్వాయర్‌ నుంచి 1.75 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో వరద నీటి ఉధృతి మరింత పెరిగింది.  

పునరావాస పనులు వేగవంతం
పోలవరం ప్రాజెక్టు కాఫర్‌ డ్యామ్‌ వద్ద వరద నీటి మట్టం 27.34 అడుగులకు చేరుకుంది. స్పిల్‌ వే రివర్‌ స్లూయిజ్‌ల ద్వారా స్పిల్‌ ఛానల్‌ మీదుగా గోదావరిలోకి ప్రవాహాన్ని మళ్లిస్తున్న అధికారులు వరదను ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గోదావరి నదికి 12 లక్షల క్యూసెక్కుల వరకూ వరద వచ్చినా పోలవరం ముంపు గ్రామాలకు ఎలాంటి ముంపు ఉండదని.. కానీ 12 లక్షల కంటే ఎక్కువ వరద వస్తే 41.15 కాంటూర్‌ పరిధిలోని ముంపు గ్రామాలను ముంచెత్తే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముంపు గ్రామాల ప్రజలకు పునరావసం కల్పించే పనులను వేగవంతం చేశారు.

కంటి మీద కునుకు లేదు..
వరద ప్రవాహం పెరుగుతుండటంతో గోదావరి తీర ప్రాంత గిరిజనం భయాందోళన చెందుతున్నారు. ఇటు గోదావరి పరీవాహక పోలవరం నిర్వాసిత దేవీపట్నం మండలంతో పాటు విలీన మండలాలు నాలుగింటిలో గిరిజనులు కుంటి మీద కునుకు లేకుండా జీవిస్తున్నారు. ముంపునీటిలో నానుతున్న ఇళ్లు కూలిపోతాయనే భయం వారిని వెంటాడుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటి పారుదలకు కాఫర్‌డ్యామ్‌ అడ్డుగా నిలవడంతో దానిపై నుంచి ప్రమాదకరంగా పొంగి ప్రవహిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. పూడుపల్లి, దేవీపట్నం సెక్టార్‌లు వరద ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోవడంతో నాటు పడవలే శరణ్యంగా మారాయి. ఏజెన్సీలోని 22 ముంపు గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. చంద్రబాబు సర్కార్‌ కళ్లు మూసుకుని నిర్మించిన కాఫర్‌ డ్యామ్‌ తమ కొంప ముంచుతోందని దేవీపట్నం పరిసర ప్రాంతాల గిరిజనులు శాపనార్థాలు పెడుతున్నారు.

5, 6 తేదీల్లో భారీ వర్షాలు
ఉత్తర కోస్తాంధ్ర పరిసరాల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 5.8 నుంచి 7.6 కిమీ మధ్యలో ఆవరించి ఉంది. అదే విధంగా ఇది వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా వైపు వంగి ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని అనేక చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. దీనికి తోడు ఈశాన్య బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని, ఇది మరింత తీవ్రంగా మారే అవకాశముందని పేర్కొంది. ఈ నెల 5, 6 తేదీల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్పపీడనం ప్రభావం బంగాళాఖాతంలో తీవ్రంగా ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని, అలలు ఉవ్వెత్తున ఎగసిపడతాయని అధికారులు తెలిపారు. నాలుగు రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న వర్షాలు
రాష్ట్రంలో వర్షాలు ఊపందుకున్నాయి. విశాఖ ఏజెన్సీ ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు అరుకు లోయ, సీలేరు, డుంబ్రిగుడ తదితర మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా డొంకరాయి జలాశయం పూర్తిగా నిండిపోయి ప్రమాదస్థాయికి చేరింది. కొద్ది రోజుల కిందట కురిసిన వర్షంతో ఈ జలాశయం నుంచి ఒక టీఎంసీ నీటిని విడుదల చేశారు. పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసాయి. గడిచిన 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లా చింతూరులో అత్యధికంగా 17 సెం.మీ వర్షపాతం నమోదైంది. వరరామచంద్రాపురం, కూనవరంలో 13, నూజివీడు, ఏలూరులో 9, కోయిడా, వేలరుపాడు, కుకునూరు, భీమడోలులో 8, రాజమండ్రిలో 7, కొయ్యలగూడెం, విజయవాడ, తాడేపల్లిగూడెం, చింతలపూడిలో 6, చింతపల్లి, తణుకు, ప్రకాశం బ్యారేజీలో 5, తిరువూరు, గుడివాడ, పిడుగురాళ్ల, పాలకోడేరు, పోలవరం, డోర్నిపాడు, దేవరకొండలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

సంగమేశ్వరుడిని చేరిన కృష్ణవేణి 
కొత్తపల్లి/ఆత్మకూరు రూరల్‌: కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని సప్తనదీ సంగమ ప్రదేశమైన శ్రీ లలితా సంగమేశ్వర ఆలయ గర్భాలయంలోకి కృష్ణా జలాలు శుక్రవారం ప్రవేశించాయి. ఐదారు రోజుల్లో ఆలయం పూర్తిగా కృష్ణవేణి గర్భవాసంలోకి చేరుకోబోతుండడంతో ఆలయ గోపుర దర్శనం చేసుకునేందుకు భక్తులు సంగం బాట పట్టారు.

వర్షాలు ఇక పుష్కలం
సాక్షి, విశాఖపట్నం: ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలకు వాతావరణ అనుకూలం ఉందని.. మొదట్లో ఇవి ఆలస్యమైనా ఇప్పటి నుంచి ఇక పుష్కలంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు వెల్లడించారు. వర్షాకాలంలో ఎక్కువ ప్రభావాన్ని చూపే ఈశాన్య, ఆగ్నేయ గాలులు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణం వైపుగా పయనించడం ప్రారంభించడంతో బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడనున్నాయి. ఫలితంగా ఆగస్టు 15 నుంచి అక్టోబరు 15 వరకూ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. వాతావరణంలో మార్పులవల్ల దశాబ్ద కాలం తరువాత ఈ ఏడాది రుతు పవనాలు ఆలస్యమయ్యాయని ఏయూ వాతావరణ విభాగం విశ్రాంత ఆచార్యులు ప్రొ. భానుకుమార్‌ ‘సాక్షి’కి వివరించారు. 

వర్షాలకు అనుకూలం..
పసిఫిక్‌ మహా సముద్రంలో ఈ ఏడాది వాతావరణంలో హెచ్చు తగ్గులు సాధారణంగా ఉండటం.. హిందూ మహా సముద్రం, అట్లాంటిక్‌ మహా సముద్రంలో కూడా తటస్థంగా ఉండటంతో ఈ ఏడాది వర్షాలకు సముద్ర భాగం నుంచి ఎలాంటి ఆటంకం ఏర్పడటంలేదని ఆయన తెలిపారు. దాంతో దేశవ్యాప్తంగా వర్షాలు బాగా పడుతున్నాయన్నారు. రాష్ట్రంలో అక్టోబరు 15వ వరకూ వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా ఆగస్టు ద్వితీయార్థం నుంచి భారీ వర్షాలు కురిసే పరిస్థితులున్నాయని చెప్పారు.

లోటు తీరిపోతుంది..
ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 8 శాతం లోటు వర్షపాతం ఉందని.. ఇది ఆగస్టు నాటికి భర్తీ అవుతుందని ఆయనన్నారు. రాష్ట్రంలో గతేడాది 91 శాతం వర్షం కురవగా.. ఈ ఏడాది రెండు నెలల కాలంలోనే ఇప్పటివరకూ 92 శాతం వర్షపాతం నమోదైందని.. ఇంకా ఆగస్టు, సెప్టెంబరు నెలలు ఉండటంతో నూరు శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని ప్రొ.భానుకుమార్‌ వివరించారు. నైరుతి రుతుపవనాల ప్రభావంవల్ల జూన్, జూలై నెలల్లోనే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని.. ఏపీలో మాత్రం ఆగస్టు, సెప్టెంబరులోనే ఎక్కువగా ఉంటుందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement