డెడ్‌లైన్.. ఆగస్టు 31
కరువు అంచున రాష్ట్రం
అప్పుడే కరువనుకోవద్దు.. ఆగస్టులో పెద్ద వానలు పడే అవకాశం ఉందని ఇటీవల ఒక సమీక్ష సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి. దేవుడు కరుణిస్తే, ముఖ్యమంత్రి నోటి మాట నిజమైతే అంతకన్నా ఏం కావాలి? కానీ వాతావరణ నిపుణులు చెబుతున్న మాటలే నిజమైతే? ఆగస్టులోనూ వర్షాలు కురవకపోతే? ఏంజరుగుతుంది..?
- భూగర్భ జలాల పాతాళ యాత్ర వేగం పుంజుకుంటుంది. ఇప్పటికే సగటు లోతు 20 మీటర్లు దాటింది.
- కొన ఊపిరితో మిగిలిన పంటలు కూడా తుదిశ్వాసను తీసుకుంటాయి. రాష్ట్రం మొత్తం దుర్భిక్ష ప్రాంతమవుతుంది.
- జూలై చివరి నాటికే తెలంగాణ పల్లెల నుంచి 15 లక్షల మందికిపైగా వలసబాట పట్టారు. ఈ నెలాఖరుకు(వానలు లేకుంటే) ఆ సంఖ్య ఇంకా రెండింతలు అవుతుంది.
- హైదరాబాద్‌కు మంచినీటిని సరఫరా చేసే రిజర్వాయర్లు చేతులెత్తేస్తాయి. 65 శాతం నగర జనాభాకు ఆధారమైన నాగార్జున సాగర్ ఇప్పటికే డెడ్‌స్టోరేజీకి దగ్గర పడింది. నీటి సరఫరాకు మరింత నియంత్రణ తప్పకపోవచ్చు.
- మరో 67 పట్టణాలు కూడా తీవ్రమైన నీటి కొరత ఎదుర్కొంటాయి.