భానుడు భగభగ
♦ నిప్పుల కుంపటిలా మారిన రాష్ట్రం
♦ కుతకుతలాడుతున్న కోస్తా, రాయలసీమ
సాక్షి, హైదరాబాద్/ విశాఖపట్నం: రాష్ట్రంలో ఎండలు భగభగా మండుతున్నాయి. రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రాష్ట్రం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. ఉదయం తొమ్మిదన్నరకే ఎండవేడి చురుక్కుమనిపిస్తోంది. సాయంత్రం అయిదు గంటలకూ వేడి సెగలు తగ్గడం లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ సాధారణం కంటే ఐదారు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలను భయపెడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో అత్యధికంగా 47.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తాంధ్ర, రాయలసీమల్లోనూ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతూ, వడగాడ్పులకు ఆస్కారం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
43 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 197 మండలాల్లో, మంగళవారం 186 మండలాల్లోనూ తీవ్ర వడగాడ్పులు నమోదయ్యాయి. మంగళవారం వైఎస్సార్ జిల్లాలో అత్యధికంగా 31 మండలాల్లో వడగాడ్పులు రికార్డయ్యాయి. ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల రికార్డుల ప్రకారం గత 24 గంటల్లో చాలా ప్రాంతాల్లో 43 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో 47.3, విశాఖపట్నం జిల్లాలోని చోడవరంలో 46.2, ప్రకాశం జిల్లా కంభంలో 46, వైఎస్సార్ జిల్లా కొండాపురంలో 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
పెరుగుతున్న వడగాల్పులు
తీవ్రమైన ఎండలకు వడగాల్పులు తోడై ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. గత 24 గంటల్లో జిల్లాల వారీగా శ్రీకాకుళంలో 20, విశాఖపట్నంలో 21, విజయనగరంలో 24 మండలాల్లో వడగాడ్పులు నమోదయ్యాయి.