సాక్షి, విశాఖపట్నం: ఈ ఏడాది వేసవి ఆరంభానికి ముందే ఉష్ణతాపం భయపెడుతోంది. శీతాకాలం సీజను ముగియక ముందే సూర్య ప్రతాపం మొదలైంది. ఫిబ్రవరి రెండో వారంలోనే ఏప్రిల్ నాటి ఎండలు చుర్రుమనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం పలుచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. కొన్నిచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు పైనే రికార్డవుతున్నాయి.
ఇవి రానున్న వేసవి తీవ్రతను ఇప్పట్నుంచే తెలియజేస్తున్నాయి. సాధారణంగా ఫిబ్రవరిలో గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు మించవు. కానీ అంతకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం ఇబ్బంది పడుతున్నారు.
గడిచిన రెండు మూడు రోజులుగా కర్నూలులో 38.5 డిగ్రీలు, అనంతపురం, నంద్యాల, వైఎస్సార్ కడపల్లో 38 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి (కనిష్ట) ఉష్ణోగ్రతలు కూడా కొన్ని ప్రాంతాల్లో మినహా పలు చోట్ల క్రమంగా పెరుగుతున్నాయి. ఇవి కూడా సాధారణంకంటే 2, 3 డిగ్రీలు ఎక్కువగా ఉంటున్నాయి.
పెరగనున్న వేసవి తీవ్రత
రానున్న వేసవి తీవ్రంగానే ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వేసవి తాపంతో పాటు తీవ్ర వడగాడ్పులు కూడా ఉంటాయని, కొన్ని రోజులు అసాధారణ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయని చెబుతున్నారు. పసిఫిక్ మహా సముద్రంలో బలంగా ఉన్న ఎల్‌నినోతో పాటు ఆకాశంలో మేఘాలు తక్కువగా ఉండట, కాలుష్య కారక వాయువులు ఉపరితలంలోకి వెళ్లకుండా పొగమంచు అడ్డుకోవడం వంటివి పగటి ఉష్ణోగ్రతల పెరుగుదలకు ప్రధాన కారణమని వాతావరణ శాఖ రిటైర్డ్ అ«దికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు.
అలాగే సాధారణంగా ఫిబ్రవరిలో చిరుజల్లులు కురుస్తూ ఉష్ణతాపాన్ని అదుపు చేస్తాయని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని వివరించారు. గత సంవత్సరానికంటే ఈ వేసవి ఎక్కువగా ఉంటుందన్నారు. ఈనెల 16వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని చెప్పారు. జూన్ నాటికి ఎల్‌నినో బలహీనపడి, లానినా పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉన్నందున మే ఆఖరు వరకు ఉష్ణతాపం కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు
Comments
Please login to add a commentAdd a comment