గుంటూరు జిల్లా తెనాలిలో ఈదురుగాలి ధాటికి రోడ్డుపై పడిపోయిన చెట్టు
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, గుంటూరు/నిమ్మనపల్లె(చిత్తూరు జిల్లా): రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఒక పక్క ఎండలు, వడగాడ్పులు, మరోపక్క పిడుగులు, వానలు.. వీటికి ఈదురు గాలులు తోడవుతున్నాయి. వీటి ధాటికి ఇటు కోస్తాంధ్ర, అటు రాయలసీమ ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు. ఏకధాటిగా ఎండలు కాస్తూ ఉష్ణతాపాన్ని వెదజల్లుతుండగా అనూహ్యంగా ఆకాశంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయి. ఆ వెనువెంటనే ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. కాసేపటికే ఈ మేఘాలు మాయమై మామూలు వాతావరణం నెలకొంటోంది. రుతుపవనాలకు ముందు ఇలాంటి పరిస్థితులు (ప్రీమాన్సూన్ థండర్ స్టార్మ్) సాధారణమేనని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా–దక్షిణ ఒడిశాలకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్రమట్టానికి 3.6 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. దీని ప్రభావంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు మంగళవారం కోస్తాంధ్రలో వాతావరణం సాధారణంగాను, రాయలసీమలో సాధారణం కంటే 2–4 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగాను నమోదవుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి నివేదికలో తెలిపింది. బుధవారం నుంచి కోస్తాంధ్రలో వడగాడ్పులు వీస్తాయని వెల్లడించింది. అదే సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని ఐఎండీ వివరించింది. అందువల్ల ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గడచిన 24 గంటల్లో రామగిరిలో 7, కంబదూరులో 6, చెన్నేకొత్తపల్లి, కనుర్పి, పెనుకొండ, కనేకల్, కురుపాంలలో 5, పాడేరు, రోళ్ల, ఆత్మకూరు, రోళ్ల, మడకసిరల్లో 4, ఇచ్ఛాపురం, ఓబులదేవరచెరువు, శాంతిపురం, అమరాపురం, హిందూపురం, ఓరుమామిళ్ల, ఆమడగూరు, ఆలూరుల్లో 3 సెం.మీల వర్షపాతం నమోదైంది.
గుంటూరు జిల్లాలో భారీ వర్షం
గుంటూరు జిల్లాలోని పొన్నూరు, చేబ్రోలు, వేమూరు, రేపల్లె, తెనాలి, కొల్లూరు, నిజాంపట్నం, చెరుకుపల్లి, నగరం, కొల్లిపర, భట్టిప్రోలు, అమృతలూరు, కర్లపాలెం సహా పలు మండలాల్లో సోమవారం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. పొన్నూరు, చేబ్రోలు సహా పలు మండలాల్లో మామిడి, అరటి, దొండ, కాకరకాయ తోటలు దెబ్బతిన్నాయి. గుంటూరు నగరం, చిలకలూరిపేట, బాపట్ల సహా పలు పట్టణాల్లో సైతం ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిశాయి.
పిడుగుపడి 45 గొర్రెల మృతి
పిడుగుపడి 45 గొర్రెలు మృతి చెంది.. నాలుగు లక్షల రూపాయల దాకా ఆస్తినష్టం జరిగిన ఘటన చిత్తూరు జిల్లా పూలవాండ్లపల్లెలో జరిగింది. బాధిత దంపతులు వెంకటరమణ, కాంతమ్మ కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. అదే సమయంలో 45 గొర్రెలున్న మందపై పిడుగు పడడంతో అవన్నీ అక్కడికక్కడే ప్రాణాలొదిలాయి. వాటి విలువ సుమారు నాలుగు లక్షల రూపాయల దాకా ఉంటుంది. గొర్రెల మృతితో జీవనాధారం కోల్పోయామని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరున్నారు.
Comments
Please login to add a commentAdd a comment