సామాన్య ప్రజలకు అర్థంకాని విషయాలను నిపుణులు సునాయాసంగా చెబుతూ వాతావరణ పరిస్థితులను విశ్లేషిస్తారు. ఆ వివరాలు ఒక్కసారి తెలుసుకుందాం..
యూవీ భాస్కరరావు, విశాఖపట్నం సాక్షి విలేకరి
తుఫాను తీరం దాటబోతోందని, తీరానికి ఇంత దూరంలో ఉందని వాతావరణ కేంద్రానికి చెందిన నిపుణులు, ఇతర వాతావరణ నిపుణులు చెబుతుంటారు. అయితే, వాళ్లకు ఆ సమాచారం ఎలా వస్తుందన్న విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సామాన్య ప్రజలకు అర్థంకాని విషయాలను నిపుణులు సునాయాసంగా చెబుతూ వాతావరణ పరిస్థితులను విశ్లేషిస్తారు. ఆ వివరాలు ఒక్కసారి తెలుసుకుందాం..
వాతావరణ కేంద్ర నిపుణులు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం, ఇంకా అవసరాన్ని బట్టి మరిన్ని సార్లు వాతావరణంలోకి బెలూన్లు వదులుతారు. వాటిలో కొన్ని రసాయనాలుంటాయి. వాటిద్వారా అవి గాలి తీవ్రతను పసిగట్టి, వాతావరణ కేంద్రంలోని కంప్యూటర్లకు పంపుతాయి. అలాగే, వాతావరణ కేంద్రాల్లో ట్రాపికల్ మీటర్లుంటాయి. వాటి ద్వారా కూడా వాతావరణ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంటారు. డాప్లర్ రాడార్ సిస్టమ్ ద్వారా గాలిలోని తేమ శాతాన్ని గుర్తిస్తారు. ఇక తీరప్రాంతంలో ప్రతి వంద కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు (ఏడబ్ల్యూఎస్) ఉన్నాయి. వాటి పరిధిలో ఎక్కడైనా సరే ఒక్క మిల్లీ మీటరు వర్షం పడినా అవి వెంటనే రికార్డు చేసి, వాతావరణ కేంద్రాలకు పంపుతాయి.
ఇది కాక, భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) నుంచి ఎప్పటికప్పుడు సమాచారం అందుతుంటుంది. ప్రతి మూడుగంటలకు ఒకసారి చొప్పున విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం స్పెషల్ బులెటిన్లు ఇస్తుంది. ఆంధ్రా విశ్వవిద్యాలయానికి చెందిన వాతావరణ శాఖ సిబ్బంది, విశాఖ తుఫానపు హెచ్చరికల కేంద్రం సిబ్బంది, పదవీ విరమణ చేసిన నిపుణులు.. అందరూ ఈసారి రంగంలోకి దిగారు. ప్రతి ఒక్కరూ తమ అనుభవాన్ని రంగరించి, పై-లీన్ తుఫాను గమనాన్ని, అది కలగజేసే ప్రభావాన్ని విశ్లేషిస్తున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ భానుకుమార్, వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి ఆర్. మురళీ కృష్ణ, విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం రిటైర్డ్ అధికారి అచ్యుతరావు.. వీళ్లంతా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077
తూర్పుగోదావరి: 0884-2365506
పశ్చిమగోదావరి: 0881230617
నెల్లూరు: 08612331477