మూడు వారాల్లో దేశవ్యాప్తంగా తిరోగమించనున్న నైరుతి
ఈ సీజన్‌లో సాధారణం కంటే 33 శాతం అధిక వర్షపాతం నమోదు
5 జిల్లాల్లో అత్యధికం, 21 జిల్లాల్లో అధికం, 7 జిల్లాల్లో సాధారణ వర్షపాతం
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల తిరోగమన ప్రక్రియ మొదలైంది. బుధవారం నుంచి ప్రారంభమైన రుతుపవనాల నిష్క్రమణ ప్రక్రియ దేశవ్యాప్తంగా దాదాపు 3 వారాలపాటు కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది మే 30న కేరళను తాకిన రుతుపవనాలు... క్రమంగా విస్తరిస్తూ జూన్ 6 నాటికి రాష్ట్రంలోకి ప్రవేశించాయి.
తొలుత అత్యంత చురుకుగా సాగిన రుతుపవనాలు... జూలైలో మందగించాయి. దీంతో జూలైలో ఎక్కువ రోజులు వర్షాలు కురవలేదు. రాష్ట్రంలోని చాలాప్రాంతాలు ఆగస్టు రెండో వారం నాటికి లోటు వర్షపాతంతోనే ఉన్నాయి. ఆగస్టు మూడో వారం నుంచి రుతుపవనాల కదలికలు చురుకవడంతో వర్షాలు ఊపందుకున్నాయి.
ఆగస్టు నెలాఖరులో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. సీజన్‌లో రాష్ట్రంలో నమోదు కావాల్సిన సాధారణ వర్షపాతం 72.52 సెం.మీ.. ఈ సీజన్‌లో ఇప్పటివరకు కురవాల్సిన సగటు సాధారణ వర్షపాతం 67.42 సెం.మీ. కాగా, నమోదైన వర్షపాతం 89.81 సెం.మీ.. ఈ లెక్కన సాధారణ వర్షపాతం కంటే 22% అధికంగా నమోదైంది.
నిష్క్రమణ సమయమూ కీలకమే...
రుతుపవనాలు నిష్క్రమించే సమయం కూడా కీలకమైందని నిపుణులు చెప్పారు. ఇప్పటివరకు ముందుకు కదులుతూ దేశాన్ని చుట్టేసిన రుతుపవనాలు... ఇప్పుడు తిరోగమన దిశలో ప్రయాణిస్తున్నాయి. ఈ సమయంలో కూడా భారీ వర్షాలకు అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
గత పదేళ్లలో ఎక్కువగా వర్షాలు తిరోగమన సమ యంలోనే నమోదైనట్లు తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఇప్పటివరకు వర్షపాతం సాధారణం నుంచి అత్యధిక స్థాయిలో నమోదైంది. ఇందులో ఐదు జిల్లాలు అత్యధిక వర్షపాతం కేటగిరీలో ఉండగా... 21 జిల్లాల్లో అధిక వర్షపాతం, 7 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ప్రస్తుత సీజన్‌లో లోటు వర్షపాతం ఉన్న జిల్లాలేవీ నమోదు కాలేదు. గత మూడేళ్లుగా జిల్లా కేటగిరీలో లోటు వర్షపాతం నమోదు కాకపోవడం గమనార్హం.
వర్షపాతం ఎక్కడ ఎలా?
అత్యధిక వర్షపాతం: మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణ పేట
అధిక వర్షపాతం: నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్–మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, ములుగు
సాధారణ వర్షపాతం: ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, హనుమకొండ, కామారెడ్డి, జనగామ, యాదాద్రి–భువనగిరి
Comments
Please login to add a commentAdd a comment