అధిక దిగుబడులపై రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచనలు
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి సకాలంలో ప్రవేశిస్తాయన్న వాతావరణశాఖ సూచనలతో రైతాంగం వ్యవసాయ పనుల్లో బిజీ అవుతోంది. ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన విత్తనాలు, ఎరువులు ఇతర ఇన్‌పుట్స్ కోసం రైతులు సన్నద్ధమవుతున్నారు. విత్తనాల ఎంపిక, యాజమాన్య పద్ధతులపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పత్తి రైతులకు పలు సూచనలు చేసింది.
అందుబాటులో ఉన్న వివిధ పత్తి హైబ్రిడ్‌లలో వరి, మినుము, సోయాచిక్కుడు పంటలలో మాదిరిగా ఎక్కువగా వైవిధ్యం లేదని, మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకుడు డాక్టర్ పి.రఘురామిరెడ్డి చెబుతున్నారు.
» ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో సుమారు 55 లక్షల ఎకరాలలో పత్తి సాగయ్యే అవకాశాలున్నాయి.
» గతేడాదితో పోలిస్తే పత్తిసాగు 10 లక్షల ఎకరాలు అదనం. డిమాండ్ దృష్ట్యా 1.20 కోట్ల విత్తన ప్యాకెట్లు వ్యవసాయశాఖ అందుబాటులో ఉంచింది.
» రైతులు కొన్నిచోట్ల ఒకటి, రెండు కంపెనీల విత్తనాల కోసం డిమాండ్ చేయడం, ఆ కంపెనీల విత్తనం మాత్రమే కావాలని అడుగుతున్నారు. కానీ యాజమాన్య పద్ధతులే దిగుబడికి కారణం అవుతాయని అధికారులు చెబుతున్నారు.
» గతంలో కూడా రైతులు ఇలాగే ఒకే రకమైన విత్తనాలు కావాలని కోరితే, మార్కెట్‌లో అందుబాటులో ఉన్న హైబ్రిడ్‌లపై విశ్వవిద్యాలయం అధ్యయనం చేసింది. దిగుబడులపై అంచనా వేసింది. ఆ హైబ్రిడ్‌ల దిగుబడుల్లో పెద్దగా తేడా లేదని పరిశోధనలో తేలింది.
» రెండుమూడేళ్లుగా అధిక సాంద్రత పత్తి సాగుకు ప్రాధాన్యం ఇచ్చారు. పొలాల్లో కూడా ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేశారు. దీనివల్ల ఎకరాకు రెండున్నర నుంచి 3 క్వింటాళ్ల అధిక దిగుబడి వచ్చిందని పరిశోధనలో తేలింది. మొక్కల సంఖ్య పెంచడం, మొక్కకు సరాసరి 10–12 కాయలు ఉన్నప్పుడు ఆశించిన దిగుబడులు సాధిస్తున్నట్టు గుర్తించారు.
» సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్లనే ఇది సాధ్యమైందని, ఎరువుల యాజమాన్యం, పోషకాల యాజమాన్యంతో మంచి దిగుబడులను సాధిస్తున్నట్టు పరిశీలనలో వెలుగు చూసింది.
» సూక్ష్మ పోషకలోపాలను సరిదిద్ది, మేలైన చీడపీడల యాజమాన్యం పాటించడం వల్ల పత్తి పంటలో అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది.
» వర్షాధారంగా పత్తిని ఎవరైతే సాగు చేస్తున్నారో, ఆ రైతులు, పెద్ద కాయలు ఉన్న హైబ్రిడ్‌ల కన్నా, మధ్యస్థంగా కాయలు వచ్చే హైబ్రిడ్‌లను ఎంపిక చేసుకోవడం మంచిది.
» నీటి వసతులు ఉన్నచోట, నల్ల భూములు ఉన్నచోట పెద్ద కాయలు వచ్చే హైబ్రిడ్‌లను ఎంపిక చేసుకోవచ్చు.
» భూమి తడిసి, 50– 60 మిల్లీ మీటర్ల వర్షపాతం పడిన తర్వాతనే పత్తి గింజలు విత్తుకోవాలి.
» చెలక భూములు, తేలిక భూములు, వర్షాధార భూముల్లో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేయడం వల్ల దిగుబడులు పెంచుకోవచ్చు.
» ఎకరాకు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాషియం సరైన మోతాదులో ఎరువుల యాజమాన్యం చేపట్టడం వల్ల పత్తిలో మంచి దిగుబడులు సాధించవచ్చు.
» అవసరం మేరకు పోషకాల పిచికారీ (19:19:19 / 13:0:45/యూరియా) చేపట్టాలి.
Comments
Please login to add a commentAdd a comment