
వాతావరణ శాఖ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్రంపైన నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నట్టు వాతావరణ శాఖ వివరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు, అతి భారీ వర్షాలు కూడా నమోదు కావొచ్చని వాతావరణశాఖ తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది. సోమవారం రాష్ట్రంలో సగటున 1.85 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో సగటున 4.39 సెం.మీ. వర్షం కురవగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 4.33 సెం.మీ. వికారాబాద్ జిల్లాల్లో 4.16 సెం.మీ., మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 4.04 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది.
