గ్రేటర్ హైదరాబాద్, జిల్లాల్లో మంగళవారం భారీ వర్షం
గంటల వ్యవధిలోనే రోడ్లు జలమయం.. వరద నీటిలో కొట్టుకుపోయి ఒకరు మృతి
హైదరాబాద్ జిల్లాలో సగటున 7.31 సెంటీమీటర్ల వర్షపాతం, గద్వాల జిల్లాలో 6.88 సెం.మీ.,
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 5.98 సెం.మీ.,రానున్న రెండు రోజులు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. అయితే తెల్లవారు జామునుంచే గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమై చెరువులను తలపించాయి. ఫలితంగా ఆయా రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
భారీ వర్షాలు కురుస్తాయనే ముందస్తు సమాచారంతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాల్లోని కొన్ని పాఠశాలల యాజమాన్యాలు ముందస్తుగా సెలవు ప్రకటించాయి. హైదరాబాద్ సమీప జిల్లాలతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు సైతం నమోదయ్యాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు లోటు వర్షపాతంలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు సమీప జిల్లాలకు ఈ వర్షంతో భారీ ఊరట దక్కింది.
రాష్ట్రంలో 2.2 సెంటీమీటర్ల సగటు వర్షపాతం...
ఉత్తర ప్రాంత జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవగా, దక్షిణ ప్రాంత జిల్లాల్లో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ క్రమంలో మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో 2.2 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.
అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 7.31 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఇప్పటివరకు రాష్ట్రంలో 50.6 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, మంగళవారం నాటికి 58.27 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 15శాతం అధికంగా వానలు కురిసినట్టు ప్రణాళిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం
రానున్న రెండు రోజులు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుంలాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు, ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.
– భారీ వర్షాలతో హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరింది. ముషీరాబాద్ పార్శిగుట్టకు చెందిన విజయ్‌కుమార్(43) వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు. కారులు, బైకులు కూడా కొట్టుకొని పోయాయి. ఒక అపార్ట్‌మెంట్‌పై పిడుగు పడి కొద్దిమేర ధ్వంసమై బీటల వారింది.పలు ప్రాంతాల్లో గోడలు కూలి వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎగువ ప్రాంతాల నుంచి మూసీకి వరద పోటెత్తోంది. దీంతో మూసారాంబాగ్ వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలకు హుస్సేన్‌సాగర్ నిండుకుండలా మారింది. దీంతో దిగువకు నీటిని విడుదల చేశారు. మూసీ పరీవాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జంటజలాశయాల్లో సైతం భారీ వరద నీరు వచ్చి చేరింది.
– ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని వంద పడకల ఆస్పత్రి భవన ప్రాంగణం జలమయమైంది. ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద రెండు అడుగుల వరద నీరు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లాయి. గద్వాల జిల్లా అయిజ మండలంలో ఓ అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది.
– రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో వాగులు, వంకలు ఉరకలెత్తాయి. లోతట్లు ప్రాంతాలు, కాలనీలు జలమయమయ్యాయి. కడ్తాల్ మండలం మేడికుంట చెరువుకు గండి పడి, నీరంతా వృథాగా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment