
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మరో రెండ్రోజులపాటు ఈ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మరోవైపు రాజధాని హైదరాబాద్‌ను కూడా భారీ వర్షం ముంచెత్తే అవకాశం ఉందని తెలిపింది.
భద్రాది కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రెండు నుంచి మూడు రోజులపాటు భారీ వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది. అలాగే బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
మరోవైపు ఇప్పటికే ఆ పది జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా నిన్నటి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఇక ఇవాళ(శనివారం) సాయంత్రం హైదరాబాద్ తో పాటు పరిసర జిల్లాల్లో సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణ శాఖ తాజా ప్రకటనతో జీహెచ్‌ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది.