Telangana: కరువుతీరా వర్షాలు | Heavy to very heavy rains were recorded across Telangana | Sakshi
Sakshi News home page

Telangana: కరువుతీరా వర్షాలు

Published Sun, Jul 21 2024 4:43 AM | Last Updated on Sun, Jul 21 2024 4:43 AM

Heavy to very heavy rains were recorded across Telangana

రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదు 

అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 4.6 సెం.మీ. సగటు వర్షపాతం

రాష్ట్రవ్యాప్తంగా 1.79 సెం.మీ. సగటు వర్షపాతం.. పలుచోట్ల పొంగి పొర్లుతున్న వాగులు..లోతట్టు ప్రాంతాలు జలమయం 

పంట పొలాలను ముంచెత్తిన వరద 

ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలంలో తెగిన తాత్కాలిక వంతెన 

మరో రెండ్రోజులు వర్షాలు..

10 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ 

గ్రేటర్‌ హైదరాబాద్‌లో భారీగా ఈదురుగాలులు, వర్షసూచన

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి నెట్‌వర్క్‌:  కరువుతీరేలా.. వరుణుడు కరుణించాడు. వానాకాలం ప్రారంభమైన నలభై రోజుల అనంతరం ఒకేసారి రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, కరీంనగర్‌ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. 

రాష్ట్రంలోని పలు వాగులు, ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నాయి. పలుచోట్ల పంట పొలాల్లోకి నీరు చేరింది. శనివారం జిల్లాల వారీ గణాంకాలు పరిశీ­లిస్తే.. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో సగటున 4.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆ తర్వాత ములుగు జిల్లాలో 4.19 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4.0 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో 12.15 సెం.మీ వర్షపాతం నమోదైంది. 

ఖమ్మం జిల్లా అంతటా.. 
ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతటా రెండురోజులుగా వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదు కాగా, ఇంకొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. శనివారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అత్యధికంగా ఖమ్మం ఎన్నెస్పీ గెస్ట్‌హౌస్‌ ప్రాంతంలో 2.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ముసురు వాన ఉండడంతో పలుచోట్ల వరి నారుమడులు, పత్తి చేన్లలో వరద నీరు నిలిచింది. పలుచోట్ల చెరువులు నిండి అలుగు పోస్తుండగా అక్కడక్కడా రహదారులు, లోలెవల్‌ బ్రిడ్జిలపైకి వరద చేరింది.  

ఉధృతంగా జంపన్న, ముసలమ్మ వాగులు 
ములుగు జిల్లాలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో ఏజెన్సీలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఏటూరునాగారం మండలంలోని కొండాయి, ఎలిశెట్టి గ్రామాల సమీపంలో జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మర పడవలను ఏర్పాటు చేశారు. ఎలిశెట్టిపల్లి సమీపంలో జంపన్న వాగు ఉధృతి ఎక్కువ కావడం, దబ్బగట్ల శైలజ, పులిసె అనూష అనే గర్భిణులు పురిటి నొప్పులతో బాధపడుతుండటంతో వారిని పడవల్లో వాగు దాటించి ఆస్పత్రికి తరలించారు. 

రామన్నగూడెం పుష్కరఘాట్‌కు 6 కిలోమీటర్ల దూరంలో కరకట్ట కోతకు గురవుతుండటంతో ఇరిగేషన్‌ శాఖ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. మంగపేట మండలంలోని రాజుపేట ముసలమ్మవాగు వరద ఉధృతికి ఒడ్డు కోతకు గురవుతుండటంతో ఒడ్డు వెంట నివాసం ఉంటున్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాజేడు మండల పరిధిలోని కొప్పుసూరు గుట్టల వద్ద ఉన్న గుండ్లవాగు ప్రాజెక్టు కట్ట ప్రమాదకరంగా ఉండటంతో అధికారులు పరిస్థితిని సమీక్షించారు. 

భూపాలపల్లి జిల్లా కాటారం మండలం పోతుల్వాయి సమీపంలోని బొర్రవాగు, గుండ్రాత్‌పల్లి సమీపంలోని అలుగువాగులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద కాజ్‌వేల పైనుంచి వెళ్తుండడంతో పలు  గ్రామాలకు మండలం మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో పత్తి చేలల్లోకి వరద నీరు చేరింది.  

బొగ్గు ఉత్పత్తికి అంతరాయం 
వర్షాలతో మల్హర్‌ మండలం తాడిచర్ల ఓపెన్‌కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని ఏఎమ్మార్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రభాకర్‌రెడ్డి, మైన్‌ మేనేజర్‌ కేఎస్‌ఎన్‌ మూర్తిలు తెలిపారు. వర్షాల కారణంగా 1.30 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఓబీ, 6 వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. 

గోదావరిలో కలెక్టర్, ఎస్పీ బోటు ప్రయాణం 
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్, పలిమెల మండలాల్లో కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే పర్యటించారు. గోదావరిలో బోటులో ప్రయాణించి వరద ఉధృతిని పరిశీలించారు. అక్కడి నుండి ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు మారుమూల గ్రామమైన దమ్మూరుకు చేరుకొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.   

ఉమ్రి–సాంగిడి దారి మూసివేత 
ఎడతెరిపిలేని వర్షాలతో వరద నీరు పోటెత్తడంతో ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలంలోని ఉమ్రి వాగుపై ఉన్న తాత్కాలిక వంతెన తెగిపోయింది. దీంతో ఉమ్రి–సాంగిడి దారిని పోలీసులు మూసి వేశారు. రెండు మండలాల పరిధిలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వాగుపై కొత్త బ్రిడ్జి పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో, తాత్కాలిక వంతెన గుండానే రాకపోకలు కొనసాగుతున్నాయి. 

60 గ్రామాలకు నిలిచిన రాకపోకలు  
మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. జిల్లాలోని ఎల్లంపల్లి, ర్యాలీవాగు, గొల్లవాగు, నీల్వాయి ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో పలు మండలాల్లో 60 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

సింగరేణి ప్రాంతాల్లోని శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, మందమర్రి, బెల్లంపల్లి, కైరిగూడ, డొర్లి ఏరియాల్లోని ఓపెన్‌ కాస్టుల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడి రూ.కోట్ల నష్టం వాటిల్లింది. నిర్మల్‌ జిల్లా కడెం మండలంలో అత్యధికంగా 65.5మి.మీ వర్షపాతం నమోదైంది. ఖానాపూర్‌ మండలంలోని దిలావర్‌పూర్‌ వెళ్లే మార్గంలో రెంకోనివాగుపై వేసిన తాత్కాలిక రోడ్డు వర్షాలకు కొట్టుకుపోయింది.   

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మూడురోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు జిల్లాలో 13.9 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. సింగరేణి ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 

ఇక నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో శనివారం రోజంతా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. కమ్మర్‌పల్లిలో 34.3 మిల్లీమీటర్లు, మెండోరాలో 28.0, నవీపేట్‌లో 27.5, బాల్కొండలో 24.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.  

పాలమూరులో ముసురు వాన 
వనపర్తి జిల్లాలో 2.7 సెంటీమీటర్లు, నారాయణపేట జిల్లాలో 2.69, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 2.49, జోగుళాంబ గద్వాల జిల్లాలో 2.04, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 1.42 సెంమీటర్ల వర్షపాతం నమోదైంది.ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా మహమ్మదాబాద్‌ మండలంలో 4.9 సెంమీ వర్షపాతం నమోదైంది. కొత్తకోట, జడ్చర్ల, ఆత్మకూరులో ముసురు వర్షానికి తడిసిన మట్టి ఇళ్లు కూలిపోయాయి.   

వీడని ముసురు 
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రెండు రోజులుగా ముసురు కొనసాగుతోంది. అక్కడక్కడా తేలికపాటి వర్షాలు నమోదవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలో శనివారం 1.43 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదవగా కడ్తాలలో అత్యల్పంగా 0.95 సెంటీమీటర్లు నమోదైంది. వికారాబాద్‌ జిల్లాలోని పలు వాగులు ఉరకలెత్తుతున్నాయి.  

సగటు వర్షపాతం కంటే ఎక్కువగా.. 
శనివారం రాష్ట్రంలో 1.79 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోంది. శనివారం 0.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా రెట్టింపు వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాల సీజన్‌లో భాగంగా జూన్‌1 నుంచి ఈనెల 20వ తేదీ వరకు రాష్ట్రంలో కురవాల్సిన సగటు సాధారణ వర్షపాతం 26.46 సెంటీమీటర్లు కాగా, ఇప్పటివరకు 33.11 సెంటీమీటర్ల వర్షపాతం (25 శాతం అధికం) నమోదైంది. 

గతేడాది ఇదే సీజన్‌లో 32.84 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత నైరుతి సీజన్‌లో శనివారం నాటికి రాష్ట్రంలోని జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. 

ఖమ్మం, నాగర్‌కర్నూల్, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, ములుగు, కరీంనగర్, సూర్యాపేట, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షం కురిసింది. మిగిలిన జిల్లాలో గడిచిన నాలుగు రోజుల క్రితం వరకు సాధారణం కంటే తక్కువ నమోదైనా.. శుక్ర, శనివారాల్లో ఎడతెరిపిలేని వర్షాలతో సాధారణ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ శనివారం రాత్రి ప్రకటించింది.  

వాయుగుండానికి తోడు ఉపరితల ద్రోణి 
పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం శనివారం మరింత ముందుకు సాగి ఒడిశాలోని చిలికా సరస్సు వద్ద కేంద్రీకృతమైంది. రానున్న ఆరు గంటల్లో వాయుగుండం తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టంపై 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండురోజులు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.  
  
నేడు అతిభారీ, అత్యంత భారీ వర్షాలు!
ఆదివారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భద్రాది కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం, కుమ్రుంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, వరంగల్‌ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.. ఆ మేరకు పది జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement