వడ దడ
వెనక్కి తగ్గని భానుడు
అదే ఉష్ణతీవ్రత
నగరంలో 39.2 ఉష్ణోగ్రత
విశాఖపట్నం : భానుడు వెనక్కి తగ్గడం లేదు. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం లేదు. పైగా ఉష్ణతీవ్రతను కొనసాగిస్తున్నాడు. అకాల ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. అదే పనిగా వీస్తున్న వడగాడ్పులను తట్టుకోలేకపోతున్నారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారు చెవులకు రక్షణగా హెల్మెట్లు పెట్టుకున్నా, కాటన్ వస్త్రాలు కప్పుకున్నా ఉపశమనం కలగడం లేదు. కిలోమీటరు దూరం ప్రయాణించే సరికే ఏ చెట్టు నీడనో ఆశ్రయిస్తున్నారు. అంతకంటే ముందుకు వెళ్తే ఏమవుతామోనని ఆందోళన చెందుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వేడి వెదజల్లుతూనే ఉండడంతో అట్టుడికిపోతున్నారు. రాత్రి చీకటి పడ్డాక కూడా వేడి ప్రభావం చూపుతోంది. ఆదివారం నగరంలో రికార్డు స్థాయిలో 39.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
సోమవారం కాస్త ఉపశమనం కలుగుతుందనుకుంటే అంతే స్థాయిలో 39.2 డిగ్రీలు రికార్డయింది. విశాఖలోని వాల్తేరు వాతావరణ నమోదు కేంద్రానికి, నగర శివారులోని ఎయిర్‌పోర్టులో నమోదు కేంద్రానికి ఉష్ణోగ్రతల్లో కనీసం మూడు నాలుగు డిగ్రీల వ్యత్యాసం ఉంటుంది. ఎయిర్‌పోర్టుకంటే వాల్తేరులోనే తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. విశేషమేమిటంటే సోమవారం ఈ రెండు చోట్లా దాదాపు ఒకేలా (వాల్తేరులో 39.0, ఎయిర్‌పోర్టులో 39.2 డిగ్రీలు) ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అందుకే సోమవారం నగరంలో అత్యంత ఎండతీవ్రతను జనం చవిచూశారు. ఇలాంటి పరిస్థితి అత్యంత అరుదుగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరో రెండ్రోజుల వరకు ఇలాంటి వాతావరణమే కొనసాగుతుందన్న హెచ్చరికలతో నగర, జిల్లా వాసులు బెంబేలెత్తుతున్నారు.