ముందస్తు ‘ఈశాన్య’ పవనాలు
‘నైరుతి’ ఉపసంహరణ వేగవంతం
అక్టోబర్ నుంచి ఆశాజనక వర్షపాతం
సాక్షి, విశాఖపట్నం : ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ముందస్తుగానే ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి నైరుతి రుతుపవనాలు ఉపసంహరణ పూర్తయిన వెంటనే ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయి. సాధారణంగా రాష్ట్రంలోకి ఈశాన్య పవనాల రాక అక్టోబర్ మొదటి వారంలో ఆరంభమవుతుంది. కానీ కొద్దిరోజుల ముందే ఇవి ప్రభావం చూపవచ్చని వాతావరణ అధ్యయన కేంద్రం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియరాలజీ (ఐఐటీఎం-పుణే) అంచనాకొచ్చింది.
నైరుతి రుతుపవనాల ఉపసంహరణ పశ్చిమ రాజస్థాన్ నుంచి ఈ నెల ఆరంభంలో మొదలయింది. రాష్ట్రం నుంచి ఉపసంహరించుకోవడానికి మరో 20 రోజుల సమయం పడుతుంది. ఊహించిన దానికంటే నైరుతి తిరోగమనం వేగవంతంగా జరుగుతోంది. దీంతో ఈశాన్య రుతుపవనాలు ఒకింత ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించవచ్చని భావిస్తున్నారు. గతేడాది పది రోజులు ఆలస్యంగా అక్టోబర్ రెండో వారంలో ప్రవేశించాయి.
లోటు వర్షపాతమే..
దేశంలో ఏటా రుతుపవనాల ద్వారా 110 సెం.మీ.ల వర్షపాతం కురుస్తుంది. ఇందులో అధిక భాగం అంటే 88 సెం.మీ.లు నైరుతి రుతుపవనాల ద్వారా, మిగిలినది ఈశాన్య రుతుపవనాల ద్వారా లభిస్తుంది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాల సీజన్ నిరాశాజనకంగానే కొనసాగుతోంది. దేశంలో భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనాలకు అనుగుణంగానే 12 శాతం లోటు వర్షపాతం నమోదవుతోంది.