
కోస్తాంధ్రలో వడగాడ్పులు
పలుచోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు
* రానున్న నాలుగైదు రోజులూ ఇదే పరిస్థితి
* పశ్చిమ గాలుల వల్లేనంటున్న వాతావరణ నిపుణులు
సాక్షి, విశాఖపట్నం: జోరుగా వర్షాలు కురవాల్సిన జూలైలో వడగాడ్పులు వీస్తున్నాయి. ఎండలు సాధారణం కంటే ఐదారు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఇలాంటి అనూహ్య పరిణామాలు వాతావరణ నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి.
సాధారణంగా జూన్ రెండో వారానికల్లా తొలకరి ప్రవేశంతో వాతావరణం బాగా చల్లబడుతుంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా ప్రవేశించినా బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండాల ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. అనూహ్యంగా జూలై ఆరంభం నుం చి మళ్లీ సెగలు మొదలయ్యాయి. రెండ్రోజుల క్రితం ఒకట్రెండు చోట్ల మాత్రమే 40 డిగ్రీల దా కా రికార్డయిన ఉష్ణోగ్రతలు ఆదివారం నాటికి అనేక ప్రాంతాల కు విస్తరించాయి.
ఆదివారం ఒంగోలు, బాపట్ల, కావలి, నెల్లూరు, తిరుపతిలో 40, విశాఖపట్నం, తుని, మచిలీపట్నంలలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోస్తాంధ్రలోని విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణా జిలా ్లల్లో వడగాడ్పులు వీచినట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రానున్న నాలుగైదు రో జులూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉం దని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
అత్యంత అరుదు..
జూలైలో అధిక ఉష్ణోగ్రతల నమోదుతో పాటు వడగాడ్పులు వీయడం అత్యంత అరుదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి చూడలేదని రిటైర్డ్ వాతావరణ శాస్త్రవేత్త మురళీకృష్ణ ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. విశాఖపట్నంలో ఇప్పటిదాకా జూలైలో రికార్డయిన అత్యధిక ఉష్ణోగ్రత 39.9 డిగ్రీలు. అది కూడా 1997 జూలై 16న నమోదైంది. ఆ తర్వాత మళ్లీ ఆదివారం నమోదైన ఉష్ణోగ్రతే అధికం కావడం విశేషం.
ఎందుకిలా..
ప్రస్తుతం రుతుపవనాలు హిమాలయ పర్వతాల వైపు ప్రభావం చూపుతున్నాయి. పశ్చిమ, వాయవ్య గాలులు వీస్తున్నాయి. పైగా సముద్రం నుంచి గాలులు వీయడం లేదు. గాలిలో తేమ తక్కువ కావడం, ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ ఏర్పడిన అల్పపీడన ద్రోణి బలహీనంగా ఉండడం, బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడకపోవడంతో ఉష్ణోగ్రతలు పెరిగి వడగాడ్పులకు కారణమవుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇదిలాఉండగా క్యుములోనింబస్ మేఘాలేర్పడి రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఆదివారం నాటి నివేదికలో తెలిపింది.