రాష్ట్రంపై భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులతో నిప్పుల వాన కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం 111 మండలాల్లో, రానున్న 48 గంటల్లో 12 మండలాల్లో వడగాడ్పులు సెగలు పుట్టించనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అప్రమత్తం చేస్తోంది.
సాక్షి, విశాఖపట్నం: భానుడి భగభగలతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మార్చి నెలాఖరు నుంచే వేసవి సెగ పుట్టిస్తోంది. మే నెలలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఇప్పటి నుంచే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓవైపు తేమ గాలులు, మరోవైపు ఆగ్నేయ, దక్షిణ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాబోయే 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంపై అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయి. ఇది తదుపరి 24 గంటల్లో ఉత్తర అండమాన్ దాని పరిసర ప్రాంతాల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ కారణంగా.. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో సూర్యుడు నిప్పుల వాన కురిపించనున్నాడని పేర్కొంది. మంగళవారం అనేక మండలాల్లో సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీలు, రేపు (బుధవారం) సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని హెచ్చరించింది. మంగళవారం రాష్ట్రంలోని 111 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని వెల్లడించింది. రాగల 48 గంటల్లో 12 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 80 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని హెచ్చరించింది. సోమవారం మొత్తం 42 మండలాల్లో వడగాడ్పులు వీచాయని అధికారులు వివరించారు.
31న తీవ్ర వడగాడ్పుల ప్రభావం ఉండే మండలాలు..
గరుగుబిల్లి (విజయనగరం), కొయ్యూరు (విశాఖపట్నం), గొలుగొండ (విశాఖపట్నం), అడ్డతీగల (తూర్పుగోదావరి), రాజవొమ్మంగి (తూ.గో), నెల్లిపాక (తూ.గో), కూనవరం (తూ.గో), చింతూరు (తూ.గో), వేలేరుపాడు (ప.గో), కంచికచర్ల (కృష్ణా), వీరులపాడు (కృష్ణా), ఇబ్రహీంపట్నం (కృష్ణా).
Comments
Please login to add a commentAdd a comment