సాక్షి, విశాఖపట్నం/శింగనమల: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో సోమవారం నుంచి కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రోహిణి కార్తె కావడంతో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎండలు, వడగాడ్పుల తీవ్రత ఎక్కువగానే ఉంటుంది.
ప్రస్తుతం తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటున సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. మరోవైపు ఉత్తర–దక్షిణ ద్రోణి ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటున సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా వెళుతోంది.
వీటి ఫలితంగా సోమవారం కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకటి, రెండుచోట్ల, బుధ, గురువారాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు అక్కడక్కడా పిడుగులు పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
నేడు వైఎస్సార్ జిల్లాలో వడగాడ్పులు
వైఎస్సార్ జిల్లాలోని చాపాడు, కమలాపురం, ప్రొద్దుటూరు, వల్లూరు, వీరపునాయుడుపల్లె, ఎర్ల గుంట్ల మండలాల్లో సోమవారం వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఎండ తీవ్రత ఉంటుందని పేర్కొంది.
ఆదివారం ప్రకాశం జిల్లా కురిచేడులో 45.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో 45.2, పల్నాడు జిల్లా రొంపిచర్ల లో 44.8, గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో 44.7 డిగ్రీలు చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఆదివారం 24 మండలాల్లో వడగాడ్పులు వీచాయి.
పిడుగుపడి ఇద్దరు మృతి
అనంతపురం జిల్లా శింగనమల మండలం ఉల్లి కల్లు గ్రామంలో ఆదివారం సాయంత్రం పిడుగు పడి ఇద్దరు మృతిచెందారు. ఉల్లికల్లుకు చెందిన వడ్డే బాలకృష్ణ (35), గౌరీశంకర్(19), వారి బంధువు తరుణ్‌కుమార్ కలిసి పొలం నుంచి బైక్‌పై ఇంటికి వస్తుండగా, పెద్ద వర్షం కురవడంతో మార్గమధ్యంలోని ఓ చెట్టు కింద ఆగారు. ఆ చెట్టుపై పిడుగుపడటంతో బాలకృష్ణ, గౌరీశంకర్ అక్కడికక్కడే మృతిచెందారు.
తరుణ్‌కుమార్ ప్రా ణాలతో బయటపడ్డాడు. బాలకృష్ణకు భార్య, కుమార్తె ఉన్నారు. గౌరీశంకర్‌కు వివాహం కాలే దు. మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లా పెద్ద అగ్రహారంలో ఆదివారం సాయంత్రం పిడుగుపడి ఇద్దరు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment